ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేడర్ ఇప్పుడు ఓటమికి కారణాలను అన్వేషిస్తోంది. ఎక్కడ తేడా కొట్టిందో లెక్కలేసుకుంటోంది. ఇలా ఎందుకు జరిగిందీ అని ఆలోచిస్తోంది. పనిలో పనిగా జగన్ ఐదేళ్ల పాలనకు, చంద్రబాబు వంద రోజులు దాటిన పాలనకు… ఆ క్రమంలో పార్టీల కేడర్ కు జరిగిన ప్రయోజనాన్ని బేరీజు వేసుకుంటోంది. దానితో అసలు సంగతులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లుగా తేలిపోయి.. వైసీపీ కేడర్ కు జగన్ పట్ల వ్యతిరేకత మొదలైంది. కాంట్రాక్టులు, సంపాదన విషయంలో టీడీపీ కేడర్ ను, సానుభూతిపరులను చంద్రబాబు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు నిర్ణయానికి వచ్చారు. వాళ్లు ఇప్పుడు చంద్రబాబుకు అభిమానులుగా మారిపోయారు..
వైసీపీ హయాంలో ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కాములు జరిగాయని విపక్షాలు ఆరోపించేవి. వేల కోట్లు చేతులు మారాయని చెప్పుకునే వారు. ఎమ్మెల్యేల దగ్గర వందల కోట్లు మూలుగుతున్నాయని లెక్కలు వేసే వాళ్లు. కట్ చేసి చూస్తే అనుకున్నదొక్కటీ, ఐనదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. జగన్ రెడ్డి చేసిన కేంద్రీకృత పాలన కారణంగా క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు అందినదీ శూన్యమని తేలిపోయింది. ఎమ్మెల్యేల్లో కూడా ఒకరిద్దరికి మినహా చేరిన డబ్బులే లేవని ఇప్పుడు అర్థమవుతోంది. కష్టపడి పని చేసే నేతలు, కార్యకర్తలు నాలుగు రూపాయలు సంపాదించకుండా జగన్ అడ్డుకున్నారని ఇప్పుడు జనం లబోదిబోమంటున్నారు. ప్రతీ దానికి మై హూ నా అంటూ జగనన్న అన్నీ చెడగొట్టేశారని వైసీపీ జనం వాపోతున్నారు.
ఇసుక.. ఒకరే గుత్తేదారు.. సింగిల్ పేమెంట్, లిక్కర్.. సెంట్రలైజ్ వ్యవహారం,సెంట్రలైజ్ లావాదేవీలు. మైనింగ్ సంగతి సరేసరి. రోడ్ల కాంట్రాక్ట్ డిటో.. డిటో.. కార్యకర్తలు పాపం చిన్న చిన్న పనులు చేసినా బిల్లులు రాని వైనం. మొత్తం ఎమ్మెల్యేల్లో కొద్ది మందికి మాత్రం అదాయం సంపాదించే అవకాశం వుండేది, మిగిలిన వారికి అంతే సంగతులు. మొత్తం డబ్బులు జగన్ రెడ్డి ఆయన పరివారం దగ్గరకు చేరిపోయాయని ఎన్నికల నాటికి అసలు నిజం తెలిసిపోయింది. దానితో ఎమ్మెల్యే అభ్యర్థులు ఖర్చు పెట్టుకునేందుకు జగన్ రెడ్డి డబ్బులు పంచారు. కాకపోతే ఆయన ఇచ్చిన డబ్బులు కార్యకర్తలకు చేరలేదు.ఎలాగూ ఓడిపోతున్నామని తెలిసిన ఎమ్మెల్యే అభ్యర్థులు కోటి రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతావి బీరువాల్లో దాచేసుకున్నారు. దానితో ఐదేళ్ల పాటు పార్టీని నమ్ముకుని ఉంటూ, ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన చిన్న స్థాయి నేతలు, కార్యకర్తలకు పైసా చేరలేదు. వాళ్లిప్పుడు జగన్ ను శాపనార్థాలు పెడుతున్నారు.. ఐదేళ్ల పాటు జగన్ ఏం చేశారో అర్థం కావడం లేదని తలలు పట్టుకు కూర్చుంటున్నారు.
కట్ చేసి చూస్తే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు వారికి దేవుడిలా కనిపిస్తున్నారు. వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు కష్టాలను అనుభవించి.. జైళ్లకు వెళ్లిన తమ నేతలకు,కార్యకర్తలకు చంద్రబాబు ఇప్పుడు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని ప్రత్యర్థి పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇసుక అన్నది ఇప్పుడు మంచి అదాయ వనరుగా మారుతోంది . ప్రయివేటు ఇసుక ర్యాంప్ లు మొదలయ్యాయి. ఇప్పుడు లిక్కర్ ప్రయివేటు పరం అయింది. ఇది ఏ విధమైన అదాయ వనరుగా వుంటుంది అన్నది అందరికీ తెలిసిందే. పైగా ఎలాంటి ప్రలోభాలు, ఆశ్రిత పక్షపాతానికి అవకాశం లేకుండా లాటరీ పద్ధతిలో మద్యం టెండర్లు నిర్వహించారు. సంపాదించుకున్నవాడికి సంపాదించుకున్నంత అని చంద్రబాబు వదిలేశారు. ఇసుక దందా చేసుకుంటున్న టీడీపీ కేడర్ ను చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నారు. లివ్ అండ్ లెట్ లివ్ అన్నట్లుగా అధికారం సాధించుకుని తాను సంతోషంగా ఉన్నానని, తన కేడర్ కూడా సంతోషంగా ఉండాలని ఆయన సంకల్పించారు. వివాదాలు లేకుండా, ఆరోపణల రాకుండా చూసుకుంటూ.. సంపాదించుకునేందుకు అడ్డుపడబోమని చంద్రబాబు నర్మగర్భంగా సంకేతాలు కూడా ఇచ్చేశారు. జగన్ తాను సంపాదించుకుని, కార్యకర్తలను గాలికి వదిలెయ్యగా.. చంద్రబాబు అందుకు భిన్నంగా ఏదోకటి చేసుకోండీ, నాకు ఇబ్బంది రాకుండా చూసుకోండి చాలని తేల్చేశారు. అందుకే వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు చంద్రబాబుకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి దందాలు, వ్యాపారాలు చేసుకుంటూ హాయిగా బతకాలనుకుంటున్నారు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…