ఇంటింటికి వైసీపీ పీపుల్స్ సర్వే.. టీడీపీ దూకుడుకు కళ్లెం

By KTV Telugu On 7 April, 2023
image

మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగింది. ఇంతవరకు ఓటమి ఎరుగని పార్టీకి ఒక్క సారి పెద్ద కుదుపు వచ్చినట్లయ్యింది. ప్రజలే కాదు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారంతో ముచ్చెమటలు పట్టిన మాట కూడా వాస్తవం. దానితో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ దిశగా తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగితేనే పార్టీకి మనుగడ ఉంటుందని వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలుంటాయని జగన్ కు అర్థమైంది. సుదీర్ఘ మేథోమథనం తర్వాత వైసీపీ పెద్దలు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అధికారానికి వచ్చిన 46 నెలల కాలంలో 98 పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చామని వైసీపీ చెప్పుకుంటోంది. సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు జనం ఖాతాల్లో వేశామంటోంది. వార్డు మెంబర్ నుంచి కేబినెట్ వరకు సింహభాగం పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించామంటోంది. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు రిజర్వ్ చేశామని దానితో సామాజిక న్యాయం సాధ్యపడిందని వైసీపీ చెప్పుకుంది. మరి వైసీపీ చెప్పిన మాటలన్నీ నిజమైనా వాటిపై జనంలో ఉన్న అభిప్రాయమేమిటో తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రజా స్పందన అర్థం చేసుకోవాల్సిందే ఇప్పుడు వైసీపీ చేస్తున్నది కూడా అదేననుకోవాలి. పైగా దూరమవుతున్న ప్రజాభిప్రాయాన్ని తమ వైపుకు మౌల్డ్ చేసుకునేందుకు కూడా జనంలోకి వెళ్లాలని వైసీపీ తీర్మానించుకుంది.

ప్రతీ ఇంటా ప్రతీ నోట జగన్ మాట అనే విధంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. 7 లక్షల మంది సైనికులతో ప్రతి ఇంటికీ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వంపై ప్రజా విశ్వసనీయత నమోదు చేసేలా పీపుల్స్‌ సర్వే చేపట్టింది. రాష్ట్రంలోని పట్టణాలు మొదలు మారుమూల గ్రామంలో ఉన్న ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఏప్రిల్ 20 వ తేదీ వరకూ అంటే 14 రోజుల ­పాటు కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని 1.6 కోట్ల ఇళ్ల వద్దకు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ అభివృద్ధి ఫలాలను వివరిస్తున్నారు. పీపుల్స్‌ సర్వేలో భాగంగా ప్రతి ఇంట్లోనూ పౌరులను ఐదు ప్రశ్నలు అడిగి వారు చెప్పిన సమాధానాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసి రశీదు ఇస్తారు. ఆ తర్వాత జగన్‌ సర్కారుకు మద్దతు తెలిపేందుకు అంగీకరించిన వారితో 82960 82960 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులను గృహ సారథులు విజ్ణప్తి చేస్తారు. ఇలా మిస్డ్‌కాల్‌ ఇచ్చిన ఒక్క నిమిషంలోగా వారికి సీఎం జగన్‌ సందేశంతో కూడిన ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ వస్తుంది.

జనాన్ని అడిగే ప్రశ్నలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా అనేది మొదటి ప్రశ్న. మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతీ సామాజిక వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా అనేది రెండో ప్రశ్న. గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పింఛన్ అమ్మ ఒడి ఆసరా చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్ లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ణీ చేతికి అందించడం బాగుందా అన్నది మూడో ప్రశ్న. నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా అన్నది నాలుగో ప్రశ్న. జగనన్న పాలనలో అమలువుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా అన్నది ఐదో ప్రశ్న ఈ ప్రక్రియ మొత్తాన్ని నిర్వహించేందుకు ప్రతీ ఒక్కరికీ కిట్ బ్యాగ్ అందిస్తారు. ప్రతీ కిట్ లో 200 ఇళ్లకు సరిపడా సామాగ్రి కూడా ఉంటుంది. అందులో టీడీపీ సర్కారు వైసీపీ సర్కారుకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలతో పాటు ప్రజా మద్దతు పుస్తకాలు ఉంటాయి. ఇద్దరు గృహసారథులు ముగ్గురు కన్వీనర్లు ధరించేందుకు వీలుగా బ్యాడ్జీలు సీఎం వైఎస్ జగన్ ఫోటో ఉన్న 200 స్టిక్కర్లు సీఎం జగన్ ఫోటో ఉన్న మరో 200 మొబైల్ ఫోన్ స్టిక్కర్లు అందులో ఉంటాయి.

పీపుల్స్ సర్వే నిర్వహించే విధానం కూడా వెరైటీగా ఉంటుంది. ప్రతీ ఇంటికి వెళ్లే గృహసారథులు వాలంటీర్లు తాము తీసుకొచ్చిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. ఐదు ప్రశ్నలున్న స్లిప్పుపై కుటుంబ సభ్యుల పేరు ఫోన్ నెంబరు నమోదు చేయడంతో పాటు వారిచ్చిన సమాధానం ఆధారంగా అవును కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. ఇంటి తలుపుకు జగన్ స్టిక్కర్ అందించేందుకు అనుమతి కోరతారు. మొబైల్ ఫోన్ స్టిక్కర్ అతికించి ధన్యవాదాలు తెలియజేస్తారు. పని పూర్తయిన తర్వాత ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు.

తాజా సర్వే వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని వైసీపీ నమ్ముతోంది. ప్రజల అభిప్రాయాలను వారి మనోభావాలను తెలుసుకునే దిశగా ఈ కార్యక్రమం ఉంటుందని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. ప్రజల అంచనాలు ఆకాంక్షలను అర్థం చేసుకుని ముందుకు వెళ్లేందుకు కూడా వ్యూహాలకు రూపొందించుకోవచ్చు. ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందిన వారికి ఇంకా ఏం కావాలో అడిగి తెలుసుకుంటారు. సంతృప్తి చెందని వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుని వారికి ఏం కావాలో నమోదు చేసుకుని నివేదిక రూపొందించుకునేందుకు వీలుంటుంది.

ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఇప్పుడు దూసుకుపోతోంది. బాదుడే బాదుడు అంటూ జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతోంది. జనంలో కూడా టీడీపీ పట్ల సానుకూలత పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మద్దతు చెక్కుచెదరకుండా ఉందని భావిస్తున్నారు. అందుకే ఇంటింటికి వెళ్లి జనాభిప్రాయం తెలుసుకుంటే తప్పులు సరిదిద్దకుని టీడీపీకి అవకాశం లేకుండా చేసే వీలుంటుందని భావిస్తున్నారు. పైగా టీడీపీ ఇంకా ఇలాంటి కార్యక్రమం ఏదీ చేపట్టలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఆయన వెళ్లి ఒక చోట మాట్లాడటమే తప్ప ఇంటింటికి వెళ్లడం లేదు. మరి వైసీపీ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.