జగన్ లెక్కలు – కులాల చిక్కులు-Ap cm Jagan Mohan Reddy – Ysrcp

By KTV Telugu On 26 February, 2024
image

KTV TELUGU :-

ఏపీలో మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల కసరత్తులో చేస్తున్న ప్రయోగాలు చూసి .. రాజకీయాల్లో  బేసిక్స్ తెలిసిన వారికి కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది.  గాల్లో రాయి వేసి..  లక్ష్యాన్ని చేధిద్దామని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా ఎవరికైనా అర్థమవుతుది. సామాజిక సమీకరణాలంటూ కొన్ని కులాల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అందులో రాయలసీమలో అత్యంత ప్రభావం చూపే బలిజలు కూడా ఉన్నారు. ఈ పరిణామం రాయలసీమ లో రెడ్డి నేతల్ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది.

సామాజిక సమీకరణాలతో  అందరికీ అవకాశం కల్పించేలా టిక్కెట్లు ఖరారు చేస్తున్నామని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు.  కానీ జాబితాలు చూసిన వారికి కొన్ని కులాల వారిని పూర్తిగా పక్కన పెడుతున్నట్లుగా అర్థమవుతుంది. ఆ కులాల జాబితాలో బలిజలు కూడా చేరారు.  రాయలసీమలో బలమైన ప్రభావం చూపే బలిజలకు ఒక్క చోట కూడా చాన్స్ ఇవ్వకపోవడం.. సిట్టింగ్‌లుగా ఉన్న ఇద్దరికి టిక్కెట్లు నిరాకరించడం .. చర్చనీయాంశంగా మారుతోంది. బలిజలు ఆగ్రహిస్తే.. వైసీపీకి ఇబ్బంది ఎదురవుతుందన్న అంచనాలను హైకమాండ్ ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

గ్రేటర్ రాయలసీమలో బలిజ ఓటర్లు గణనీయంగా ఉంటారు.  గత ఎన్నికల్లో ఆ వర్గం వైసీపీకి మద్దతుగా నిలిచింది. జనసేన బరిలో ఉన్నప్పటికీ వారు జగన్ వెంటే నిలిచారు. ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికారపక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం ఆలోచనలో పడింది. కాపు సామాజికవర్గాన్నే  రాయలసీమలో బలిజలుగా చెబుతారు.  రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలలో వారు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం.. ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నుంచి విజయం సాధించారు.

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులు బలిజ సామాజికవర్గ నాయకులే.  దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులులకు ఈ సారి టిక్కెట్లు కేటాయించలేదు. . ఆరు జల్లాల్లోని 74 నియోజకవర్గాల్లో ఎక్కడా  బలిజ వర్గానికి చెందిన నేత పేరు వినిపించడం లేదు.  దర్శి, చిత్తూరుల్లో  రెడ్డి నేతలకు ఇంచార్జ్ పదవులు ఇచ్చారు. చిత్తూరు నుంచి విజయానందారెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలకు అవకాశం కల్పించింది. నిజానికి రాజంపేట ఎంపీ టిక్కెట్ బలిజలకే కేటాయిస్తూ ఉంటారు. కానీ వైసీపీ రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డికి కేటాయిస్తోంది.

గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. అత్యదికంగా చిత్తూరు జిల్లాలో  ఉంారు.  రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.  బలిజ వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు..   అన్యాయం జరిగిందని, తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు అసెంబ్లీ , రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ లోక్‌సభ సీటు పరిధిలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వే కొడూరు నియోజకవర్గాలలో మెజారటీ ఓటర్లు బలిజలే.  ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు.. తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. ఆ వర్గానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమీకరణాలు దారి తప్పితే ఘోరమైన పరాజయం ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి