ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందా? తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో అనుమానాలు పెంచేలా అపోహలు సృష్టించేలా..రెండు పార్టీల మధ్య సయోధ్య ను దెబ్బతీసేలా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అమలు చేస్తోందని రాజకీయ పండితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే భావనలో ఉన్నారు. అందుకే వైసీపీ ట్రాప్ లో పడొద్దంటూ తమ పార్టీ శ్రేణులు, అభిమానులకు పదే పదే చెబుతున్నారు. తన మాట వినని వారు పార్టీకి గుడ్ బై చెప్పి పోవచ్చునని కూడా పవన్ అల్టిమేటం జారీ చేశారు. దీనికి కారణం వైసీపీ మైండ్ గేమే అంటున్నారు పరిశీలకులు.
తెలుగుదేశం- జనసేనల మధ్య మొన్న సెప్టెంబరు నెలలోనే పొత్తు ఖరారు అయ్యింది. జనసేనాని పవన్ కళ్యాణే స్వయంగా ఈ ప్రకటన చేశారు. స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబును పరామర్శించిన వెంటనే పవన్ టిడిపితో పొత్తు గురించి బహిరంగ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత రెండు పార్టీల కార్యకర్తలు కలిసి మెలసి పనిచేయాలని చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ వస్తున్నారు. నేతల స్థాయిలో సయోధ్య ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సయోధ్య లేదని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నదానిపై చర్చ నడుస్తోంది.
టిడిపి-జనసేన పార్టీల పొత్తులో కుదిరిన ఒప్పందాలేంటి? అన్న అంశంపై రక రకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు ఆకాంక్షిస్తున్నారు. తమ నాయకుడికి సిఎంపోస్ట్ ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా జనసేనకు చిల్లర విదిల్చినట్లు అరకొరగా సీట్లు కేటాయిస్తే సరిపోదని గౌరవ ప్రదంగా సీట్లు కేటాయించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అటు పవన్ అభిమానులు కూడా ఈ సారి జనసేనను అవమానించేలా సీట్ల కేటాయింపు ఉంటే చూస్తూ ఊరుకోమని అంటున్నారు.టిడిపి -జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశాల్లో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి కూడా.
టిడిపి-జనసేనల మధ్య ఈ వాతావరణాన్ని గమనించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దీన్ని క్యాష్ చేసుకోడానికే మైండ్ గేమ్ మొదలు పెట్టిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను టిడిపి అవమానిస్తోందని.. బిస్కట్లు పారేసినట్లు కొద్ది సీట్లు విదిలిస్తోందని వైసీపీ నేతలు పదే పదే అంటున్నారు. ఇది జనసేన కార్యకర్తల్లో బలంగా నాటుకుపోతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టిడిపికి వ్యతిరేకంగా జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. ఈ గేమ్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసైనికులకు దిశానిర్ధేశనం చేశారు. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాయన్నఅంశాన్ని పట్టించుకోవద్దని గట్టిగా చెప్పారు పవన్. ఎవరైనా సీట్ల గురించి మాట్లాడితే వారు కోవర్టులే అవుతారని అటువంటి వారు ఇష్టం లేకపోతే పార్టీ వీడి వైసీపీలో చేరచ్చని నిష్ఠూరంగానే అన్నారు పవన్.
తాజాగా నారా లోకేష్ పాదయాత్ర ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.ఈ సభ కు ముందు లోకేష్ ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ టిడిపి 150 స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందన్నారు. అదే విధంగా ఎన్నికల తర్వాత చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలను బాగా వైరల్ చేస్తోన్న వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని టిడిపి నేతలు జమ కట్టేశారంటూ ప్రచారం మొదలు పెట్టారు. అదే విధంగా పవన్ కు పాతిక లోపు సీట్లే ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇది జనసేన కార్యకర్తల్లో అసంతృప్తిని రాజేస్తోంది.
నిజానికి లోకేష్ చాలా యథాలాపంగా 150 స్థానాల్లో పోటీకి సిద్ధమన్నారు. టిడిపి జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు జరగనే లేదు. ఈ విషయంలో చంద్రబాబు కానీ పవన్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వైసీపీ చేస్తోన్న ప్రచారంతో క్షేత్ర స్థాయిలో జనసైనికులు అయోమయానికి గురవుతున్నారన్నది జనసేన నేతల వాదన. ఇలా గందరగోళం సృష్టించడం ద్వారా టిడిపి జనసేనల మధ్య దూరం పెంచాలన్నది వైసీపీ వ్యూహంగా భావిస్తున్నారు. దీన్ని గమనించారు కాబట్టే పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఎవరైనా మాట్లాడితే వారు వైసీపీ కోవర్టులే అంటున్నారు. అటువంటి వివాదాలకు దూరంగా ఉంటూ టిడిపి జనసేన కలిసి మెలసి ఎన్నికల బరిలో దిగితే వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం తమదే అంటున్నారు పవన్. వైసీపీ మైండ్ గేమ్ ను బ్రేక్ చేయాలని ఆయన పిలుపు నిస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…