వైసీపీ – జంప్ జిలానీ..

By KTV Telugu On 21 June, 2024
image

KTV TELUGU :-

అధికారం పోతే ఆ  పార్టీలో ఉండాలనిపించదు.నిన్న ఆయా రామ్…ఇవాళ గయారాం అని చెప్పుకోవాలనిపిస్తుంది. అవకాశాన్ని, అవసరాన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు  ఎక్కువేనని చెప్పాలి. ఇప్పుడు ఓటమిపాలైన వైసీపీ బ్యాచ్ కూడా పక్క చూపులు చూస్తోంది. టీడీపీలోకి నో ఎంట్రీ  బోర్డు పెట్టడంతో కేంద్రంలో అధికార సంకీర్ణానికి నాయకత్వం వహించే బీజేపీ వైపు చూస్తున్నారు. కమలంలో చేరిపోతే కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలుసు. అటు వైపు నుంచి గ్రీన్  సిగ్నల్ వచ్చిందని  కొందరు నేతలు చెప్పుకుంటున్నారు. ఇదీ టీడీపీ దూకుడుకు చెక్ పెట్టే ప్రక్రియ అవుతుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న…

2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఫిరాయించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్… బీజేపీలో చేరిపోయి హాయిగా బతికారు. సుజనాపై ఉన్న ఆర్థిక నేరాలు ముందుకు సాగలేదు. సీఎం రమేష్ వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాయి. టీజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ ను టీడీపీలో చేర్చి లోకల్ గా ప్రయోజనం పొందారు. 2024 ఎన్నికల నాటికి సుజనా ఎమ్మెల్యే అయితే, సీఎం రమేష్ లోక్ సభ సభ్యుడయ్యారు. టీజీ భరత్ ఎమ్మెల్యే అయ్యారు. అధికార పార్టీలో ఉండటమెలాగో తెలిసిన నేతలు కావడంతో టైమ్ వేస్ట్ కాకుండా ఫిరాయించేశారు.ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఫిరాయింపు మంత్రం పఠిస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు కొంతకాలం పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు బీద మస్తాన్ రావు, లోక్ సభ సభ్యులు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా క్యూ కడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మరో పక్క ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన కొందరు కాషాయ కండువా  కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. అందులో మాజీ మంత్రి విడదల రజనీ ముఖ్యలని చెప్పాలి. ఆమె ప్రస్తుతం ఎవరికీ కనిపించకుండా హైదరాబాద్లోని ఒక రిసార్ట్ లో ఉంటూ బీజేపీ నేతలకు టచ్ లోకి వెళ్లారని సమాచారం..

వైసీపీ నేతలను టీడీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో అంటకాగిన అధికారులపై దృష్టి పెట్టింది. తమ వంతు వచ్చే సరికి సేఫ్ జోన్లోకి వెళ్లిపోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. పైగా అందరిపైనా ఏదోక కేసు ఉంది. అందులో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కూడా జరుగుతోంది…..

విజయసాయి రెడ్డి చాలా రోజులుగా బెయిల్ పై ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక పట్టుపట్టాలనుకుంటే క్షణాల్లో ఆయన్ను అరెస్టు చేసే  వీలుంది.పైగా  ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో లేకపోవడంతో బీజేపీకి ఆ పార్టీతో పెద్దగా పనిలేదు. విచ్ హంట్ కు చాలా అవకాశాలే ఉన్నాయని తెలుసుకుని ఆయన రూటు మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదిలి పెట్టేది లేదని టీడీపీ  వర్గాలు తెగేసి చెబుతున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబును టార్గెట్ చేసి వేధించిన కారణంగా…ఇప్పుడు కక్షసాధింపుకు టీడీపీ ప్రయత్నిస్తోందని అనుమానిస్తున్నారు. అందుకే బీజేపీలో ఉంటే సేఫ్ అని భావిస్తున్నారు. అయితే వివేకా   హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందుక కడప ఎంపీ అవినాష్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడం అనుమానమే.ఇక వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలుగా  ఉన్న వాళ్లు తెగ దోచేశారు.  ల్యాండ్, శాండ్, మైనింగ్ లో డబ్బులు దండుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు వందల కొద్దీ కేసులు  పెట్టే అవకాశం ఉంది. అందుకే బీజేపీలో ఉంటే టీడీపీ తమ జోలికి రాకుండా ఉంటుందని వారి  ఆలోచన. మరి వైసీపీ నేతలు బీజేపీలో చేరితే టీడీపీ ఊరుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికిప్పుడు మాత్రం టీడీపీ ఏమీ చేయలేకపోవచ్చు.చేయకపోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబుకు ఆ దిశగా కేంద్ర సహకారం చాలా అవసరం. ఇప్పుడే తగవుకు దిగితే ఒక పని కూడా కాదు. అందుకే వైసీపీ నుంచి నిజంగా ఫిరాయింపులు జరిగినా చూస్తూ ఉరుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదనే చెప్పాలి….

మాజీ సీఎం జగన్ కూడా జగత్ కీలాడీనే..ఆయనే ముందు జాగ్రత్తగా పార్టీ వారిని బీజేపీలోకి పంపే ప్రయత్నంలో ఉన్నారని టాక్ నడుస్తోంది. వైసీపీలో కొనసాగితే కష్టాలు తప్పవు కాబట్టి.. వెళ్లి బీజేపీలో సెటిలైపొమ్మని చెబుతున్నారట. ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారడం మాత్రం ఖాయం. పూర్తిగా క్లారిటీ  వచ్చేందుకు ఒకటి రెండు వారాలు పడుతుందని చెబుతున్నారు…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి