ఆనం రామనారాయణ రెడ్డి ఎపిసోడ్ తో జాగ్రత్త పడాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నప్పటికీ ఆ పని వారి వల్ల కావడం లేదు. ఇక మనం ఉండి ప్రయోజనం లేదనుకుంటున్న నేతలు వేరు దారి వెదుక్కునే పనిలో ఉన్నారు. సంక్రాంతి పండుగను సరదాగా గడుపుకున్న తర్వాత వాళ్లంతా చల్లగా జారుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పార్టీలో పెత్తందార్ల హవాను తట్టుకోలేకపోతున్నామని కొందరు నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. పైగా పెత్తందార్లు వారి పిల్లలకే అన్ని పదవులు ఇచ్చేస్తూ అడిగినప్పుడల్లా వారికే అప్పాయింట్ మెంట్ ఇస్తూ ఇతరులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో తమ పట్ల దుష్ప్రచారం జరుగుతున్నా పార్టీ పట్టించుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు ఆందోళనగా ఉన్నారు. జగన్ విజయసాయి సజ్జల లాంటి వారిపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చేందుకు మాత్రమే వైసీపీ సోషల్ మీడియా ఉందని మిగతా వారిని పట్టించుకోవడం లేదని వారి ఆరోపణ. ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం జరుగుతుంటే అది తమ పార్టీకి సంబంధించినది కాదన్నట్లుగా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ప్రవర్తిస్తున్నారని వారంటున్నారు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా ఇంఛార్జ్ బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డికి అప్పగించడంతో తమకు ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా పోయిందని వారి వాదన.
విజయవాడలో పెన్షన్ అడిగిన మైనార్డీ వర్గం మహిళలపై తాజా దాడి కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ తరపున కొందరు మహిళలను తీసుకెళ్లి దాడి చేయించారని అది ముమ్మాటికి దేవినేని అవినాష్ ఓవరాక్షనేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ వర్గంలో ఉన్న ఆ మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇప్పించి ఉంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉండగా అనవసరంగా పెద్దది చేసి విపక్షానికి అవకాశం ఇచ్చారని కొందరు వైసీపీ నేతలు వాపోతున్నారు. ఎమ్మెల్యే పదవి లేకపోయిన అతి చేసే అవినాష్ లాంటి వాళ్లు చాలా మంది పార్టీలో తయారయ్యారని వారి వల్లే ఇప్పుడు పార్టీ దెబ్బతింటోందని డైరెక్టుగా చెప్పేస్తున్నారు. రౌడీలు బాధితులు ఇద్దరూ వైసీపీ వాళ్లేనని ఆ పార్టీ నేత యలమంచిలి రవి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీలో ఉండే కంటే టీడీపీకి వెళ్లిపోవడం మంచిదని రవి భావిస్తున్నారట.
15 మంది వరకు వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఆధిపత్య పోరులో అధిష్టానం తమకు నచ్చిన వారికే పెద్ద పీట వేస్తోందని పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న తమను పట్టించుకోవడం లేదని ఆ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. వారిలో నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల బ్యాచ్ ఎక్కువగా ఉన్నారు. ఒకరిద్దరు రాయలసీమ వాసులున్నారు.
జగన్ అర్థం చేసుకునే లోపే పరిస్థితి చేయిదాటి పోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెచ్చరికల స్థాయి నుంచి బుజ్జగింపుల స్థాయికి అధిష్టానం దిగజారినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఫలానా వారికి టికెట్ కష్టమేనని అధిష్టానం తరపున చేసిన సోషల్ మీడియా ప్రచారమే బెడిసి కొట్టిందని అంటున్నారు. పైగా వారంతా వెళ్తూ వెళ్తూ జగన్ పై విమర్శల బురద చల్లిపోయే ప్రమాదం ఉంది. జగన్ నియంతృత్వ పోకడలు ఏకపక్ష నిర్ణయాలను ఎండగట్టే అవకాశం ఉంది. వాళ్లంతా టీడీపీలో చేరితే తనకు కష్టమని ఎన్నికల నాటికి పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. మరి వారిని శాంతింపజేసి పార్టీలో కొనసాగించేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.