పార్టీ మారితే ఇద్దరం మారుతాం..మాజీ హోంమంత్రి సుచరిత

By KTV Telugu On 5 January, 2023
image

మంత్రి పదవి పోయిన నాటి నుంచి మాజీ హోంమంత్రి సుచరితలో మార్పు కనిపిస్తోంది. పార్టీకి విధేయులుగా ఉంటామంటూనే కొంత పరేషాన్ చేస్తున్నారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికాక రాజీనామాకు సిద్ధపడిన సుచరిత అధినేత పిలిచి మాట్లాడడంతో శాంతించారు. వైసీపీలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కొంతకాలానికే తనకు అప్పజెప్పిన జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని షాక్ ఇచ్చారు. నియోజకవర్గానికి సమయం వెచ్చించేందుకే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె చెప్పినా డొక్కాకు బాధ్యతల నేపథ్యంలోనే ఆమెను తప్పించారనేది సుస్పష్టం. ఎక్స్ మినిస్టర్ అయిన నాటి నుండి పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో సుచరిత ఉన్నారు. అయనప్పటికీ పార్టీ తరపున అప్పుడుప్పుడు తన వాయిస్ వినిపిస్తున్నారు. తాజాగా ఆమె పార్టీ మార్పు అంశంపైన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

తన భర్త పార్టీ మారాలనుకుంటే ఆయన అడుగుజాడల్లో తాను వెళ్లాల్సిందేగా అంటూ సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఒక పార్టీలో తాను మరొక పార్టీలో పిల్లలు వేరొక పార్టీలో ఉండరని చెప్పుకొచ్చారు. ఉంటే అంతా ఒక్క పార్టీలోనే ఉంటామన్నారు. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్ళు వైఎస్ జగన్‌తో ఉండాలనుకున్నామని సుచరిత స్పష్టం చేసారు. సుచరిత భర్త దయాసాగర్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. దయాసాగర్ లోక్ సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దయాసాగర్ ఎంపీగా బరిలో ఉంటే సుచరితకు సీటు ఉండదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. వైసీపీ ఏర్పాటు నుంచి సుచరిత జగన్ కు మద్దతుగా నిలిచారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి కేబినెట్‌లో సుచరితకు హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ తొలి మహిళా హోం మంత్రిగా సుచిరతకు అవకాశం దక్కింది. కేబినెట్ విస్తరణలో భాగంగా సుచరితను మంత్రి పదవి నుంచి తప్పించారు.

పదవి పోయినందుకు కొంత బాధగా ఉన్నా వైసీపీలోనే కొనసాగుతానని సుచరిత చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సుచరిత దయాసాగర్ ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీలో టికెట్ రాకపోతే దయాసాగర్ మరో పార్టీ నుంచి పోటీ చేసే అవకాశముందనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సుచరిత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సీటు ఖరారు చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఆరు నెలల ముందే టికెట్ల ఖరారుకు నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ప్రతీ సీటు, చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుచరిత రాజకీయ అడుగులు ఏవిధంగా ఉండబోతున్నాయనేది ఆసక్తిని రేపుతోంది.