అధిష్టానం ఎంత వారిస్తున్నా అసమ్మతి చల్లారడం లేదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు ఎమ్మెల్యేలు. వైసీపీలో వసంత గానం వేడెక్కుతోంది. మైలవరం ఎమ్మెల్యే ధిక్కార స్వరం పెంచుతున్నారు. పార్టీ నేతలపై వరుసగా పంచ్‌లు విసురుతున్నారు. తన నియోజకవర్గంలో జిల్లా మంత్రి, ఇతర ఎమ్మెల్యేల జోక్యాన్ని సహించలేకపోతున్న వసంత కృష్ణప్రసాద్ బహిరంగంగానే వారిపై విమర్శలు గుప్పిస్తున్నాడు. మొన్నటికి మొన్న గుంటూరు బాబు సభలో చోటుచేసుకున్న పరిణామాలపై ఉయ్యూరు శ్రీనివాస్‌ను వెనకేసుకొచ్చి, సొంత పార్టీ నేతల తీరును తప్పుబట్టిన వసంత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పదిమంది పోరంబోకుల్ని వెంటేసుకుని తిరిగే రాజకీయం చేయలేకపోతున్నానంటూ హాట్ కామెంట్స్ చేశారు వసంత. అలా ప్రవర్తిస్తేనే నేటి రాజకీయాల్లో నిలబడగలమన్న ఆయన పెద్దరికం పనికిరాదన్నారు. అందుకే పాతతరం నాయకుడిగా మిగిలిపోయానన్నారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు కాలం నాటి రాజకీయాలు ఇప్పుడు లేవని చెప్పుకొచ్చారు. అకారణంగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించనని అందుకే పార్టీలో కొందరికి తనపై అసంతృప్తి నెలకొందంటూ వసంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయాల్లో హుందాగానే ఉంటానని చెబుతున్నారు కృష్ణప్రసాద్. విపక్ష నేతలపై గతంలోలా విరుచుకుపడటం మానేశారు ఆయన. గడగడపకు కార్యక్రమాన్ని కూడా ఆపేయడంతో పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాపై గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీకి దగ్గరవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మైలవరం అసెంబ్లీ నియోజక వర్గంపై కన్నేసిన మంత్రి జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారట. నియోజకవర్గంలో పట్టు కోసం వసంత, జోగి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడుస్తోంది కూడా. వైసీపీ అధిష్టానం కూడా మంత్రిగా ఉన్న జోగి రమేష్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో వసంత టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రచారాలను మైలవరం ఎమ్మెల్యే ఖండిస్తున్నా, టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలను మాత్రం కొట్టి పారేయలేని పరిస్థితి ఉంది.
మరోవైపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వర్ రావు కేశినేని నానితో సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు చెప్పారు. కేశినేని మంచి నాయకుడని నాగేశ్వర్ రావు ప్రశంసలు కురిపించారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో వసంత కుటుంబం వైసీపీకి గుడ్‌బై చెప్పినా ఆశ్చర్య పోనక్కర్లేదని జిల్లా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీకి చేరువ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలోనూ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గం లేకపోవడాన్ని నాగేశ్వరరావు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అప్పట్లో కృష్ణప్రసాద్ తన తండ్రి వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోద్దంటూ సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం తండ్రీకొడుకుల రాజకీయంపై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.