పార్లమెంటులో వైసీపీ అద్భుత వ్యూహం

By KTV Telugu On 9 February, 2023
image

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్, బిజెపిలు రెండూ ఘోరంగా విఫలమయ్యాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఫైర్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కేంద్రంలోని బిజెపిని ఇంత గట్టిగా నిలదీయడం ద్వారా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ దూకుడునే ప్రదర్శించిందని వారు భావిస్తున్నారు. ఇది రాజకీయంగా వైసీపీకి కలిసొచ్చే పరిణామమేనని వారంటున్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని కాస్త ఇరకాటంలోకి నెట్టే వ్యూహం అంటున్నారు రాజకీయ పండితులు.

2014లో ఆంధ్ర ప్రదేశ్ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాటి యూపీయే ప్రభుత్వం. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆదరా బాదరాగా పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించేసుకున్నారు యూపీయే పాలకులు. దానికి బిజెపి సహకారమూ ఉంది. తెలంగాణా ఇచ్చిన పార్టీలుగా తెలంగాణా ఓటు బ్యాంకును సొంతం చేసుకోడానికి కాంగ్రెస్ బిజెపిలు పోటాను పోటీగా విభజన బిల్లును ఆమోదించేశాయి. చిత్రం ఏంటంటే లోక్ సభలో అసలు ఈ బిల్లుపై చర్చకూడా జరగలేదు. పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేసి తలుపులు వేసి బిల్లుకు మమ అనిపించారు.
ఈ సందర్భంగానే నాటి బిజెపి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూపీయే ప్రభుత్వం అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదాకు ఓకే అంటే వెంకయ్య నాయుడు అయిదేళ్లు సరిపోదు కనీసం పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వండి అని పట్టుబట్టారు. దానికి యూపీయే కూడా సరేనంది.

బిల్లు పాస్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. ఎన్నికల ప్రచారంలో టిడిపి-బిజెపిలతో పాటు వారికి మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు నాయుడు అయితే మరో అడుగు ముందుకేసి ప్రత్యేక హోదా పదేళ్లు కూడా సరిపోదు పదిహేనేళ్లు ఉండాలి అని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటకట్టుకోవడంతో యూపీయే అడ్రస్సే గల్లంతైంది. నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. కేంద్రంలో బిజెపి తనంత తానుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ ఉన్నా కూడా ముందస్తు పొత్తులను గౌరవిస్తూ బిజెపి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో నాటి టిడిపి ఎంపీలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి కూడా మంత్రులయ్యారు.

ఏపీలోని టిడిపి ప్రభుత్వంలోనూ బిజెపి ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావులు మంత్రులయ్యారు.
టిడిపి-బిజెపిలు జుగల్బందీగా అక్కడా ఇక్కడా ప్రభుత్వాల్లో అధికారాన్ని పంచుకోవడంతో ఏపీకి రావల్సిన ప్రత్యేక హోదా గ్యారంటీగా వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే కొద్ది రోజులు గడవగానే ఆ ఆశలపై ఇద్దరూ నీళ్లు కుమ్మరించేశారు. ప్రత్యేక హోదా సాధ్యం కాకపోవచ్చునంటూ మొదలైన యూ టర్న్ ప్రత్యేక హోదా ఇక ఇవ్వలేం అని ఖరాఖండీగా చెప్పే స్థాయికి చేరిపోయింది. ప్రత్యేక హోదా పదేళ్లు ఉండాలంటూ పట్టుబట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక హోదా రాదని తేల్చేశారు.

దీనిపై ఏపీలో విపక్షాలు ఉద్యమాలు అందుకున్నాయి. ఆ సమయంలోనే ఓ అర్ధరాత్రి వేళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాం అన్నారు. ఆ వెంటనే దాన్ని చంద్రబాబు నాయుడు స్వాగతించారు. అక్కడితో ఆగకుండా ప్రత్యేక ప్యాకేజీ సాధించిన వీరులుగా వెంకటయ్యనాయుడు, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలను హీరోలుగా ప్రొజెక్ట్ చేశారు. అయితే ఏపీకి ఇక ప్రత్యేక హోదా రాదా సారూ అని చంద్రబాబును మీడియా ప్రతినిథులు అడిగితే కోడలు మగబిడ్డను కంటానంటే అత్తకి అభ్యంతరం ఏం ఉంటుందయ్యా అంటూ చాలా వెకిలి కామెంట్ ఒకటి చేశారు. ప్రత్యేక హోదాను మించి ప్యాకేజీ ఇస్తానంటే దాన్ని ఎలా వదులుకుంటామన్న చంద్రబాబు హోదా తో ఒరిగేదేంటి అని ఎదురు దాడి చేశారు మీడియాపై.

అయితే ఏపీలో ప్రజాసంఘాలు నాటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీలు ప్రత్యే క హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో చంద్రబాబు ఒత్తిడిలో పడ్డారు. వైసీపీ అయితే తమ పార్టీకి చెందిన అయిదుగురు ఎంపీల చేత రాజీనామాలు చేయించి కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి కూడా సిద్ధం కావడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు 2018లో ఎన్డీయే ప్రభుత్వం నుండి వైదొలగి ధర్మపోరాట దీక్షలు చేశారు. ఈ లోపు 2019 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఏపీలో ప్రజలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారు. కేంద్రంలో బిజెపికి తిరుగులేని మెజారిటీ ఇచ్చి రెండో సారి అధికారంలోకి తెచ్చారు. బిజెపి సొంతంగానే మూడువందలకు పైగా ఎంపీలను గెలుచుకుని అజేయంగా నిలిచింది.
ఎన్నికలైన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ రాకుండా వారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైసీపీ మద్దతు అవసరమై ఉంటే కచ్చితంగా ప్రత్యేక హోదా సాధించుకోగలిగి ఉండేవాళ్లమని జగన్ అన్నారు. అయినా ప్రత్యేక హోదాను తాము విడిచి పెట్టడంలేదని అంది వచ్చిన ప్రతీ వేదికపైనా ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మూడున్నరేళ్లు దాటింది. అప్పుడప్పుడూ ప్రత్యేక హోదా ఇవ్వండంటూ ఏదో ఓ రూపంలా డిమాండ్ చేయడమే తప్ప వైసీపీ కూడా దానిపై ఆశలు వదిలేసుకుందేమో అనిపించేలానే వ్యవహరించింది. అయితే తాజాగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో మాత్రం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా కోసం గట్టిగానే పట్టుబట్టారు. కేంద్రంలోని బిజెపిపైనా విరుచుకు పడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పటి బిజెపి ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. దీంతో పాటే ఇతర విభజన హామీల గురించీ కూడా విజయసాయిరెడ్డి గట్టిగా స్పష్టంగా తన బాణి వినిపించారు. కేంద్రంలోని బిజెపితో కుమ్మక్కై ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంలో టిడిపి బాటలోనే వైసీపీ కూడా నడుస్తోందంటూ వస్తోన్న ఆరోపణలకు వైసీపీ గట్టి సమాధానాన్నే ఇచ్చినట్టు అయ్యిందని రాజకీయ పండితులు అంటున్నారు. ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న తరుణంలో ప్రత్యేక హోదా విషయంలో తాము రాజీ పడ్డం లేదన్న సంకేతానలు బలంగా పంపించడంలో వైసీపీ విజయవంతమైందని వారంటున్నారు. ఇంత గట్టిగా హోదా గురించి టిడిపి ఎంపీలు ఎన్నడూ పార్లమెంటులో గళం విప్పలేదని వారు గుర్తు చేస్తున్నారు. హోదా వచ్చినా రాకపోయినా విజయసాయి గట్టిగా డిమాండ్ చేయడం ద్వారా వైసీపీకి పొలిటికల్ మైలేజీ వస్తుందని అదే సమయంలో అది టిడిపికి నష్టం చేకూరుస్తుందని వారు అంచనాలు వేస్తున్నారు.