జగన్ – ధైర్యం లేని రాజకీయ నేత !

By KTV Telugu On 1 July, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో కనీస విలువలు పాటిస్తేనే ఎంతో కొంత  ప్రజల్లో పలుకుబడి ఉంటుంది. కనీసం పాటిస్తున్నట్లుగా  ప్రజల్ని నమ్మించాలి.  నైతికత అనేదే లేదని నిరూపిస్తే ప్రజలు అసహ్యంగా చూస్తారు. గత ఐదేళ్లలో అదే చేశారు. ఫలితంగా ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అయినా  అదే చేస్తున్నారు.  పీలో టీడీపీతో పోరాడుతూ… ఢిల్లీలో టీడీపీ కూటమి తరపున నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారని ఆలోచించలేకపోయారు.   కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం ఉంది. ఎ విషయంలో అయినా   ఎన్డీఏకి సపోర్టు చేయడం అంటే… టీడీపీకి సపోర్టు  చేయడమే.  ఇది జగన్ భయానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తమ మద్దదు  బీజేపీకే అని ప్రకటించడం దేశవ్యాప్త రాజకీయాల్లో కలకలానికి కారణం అయింది. ఎందుకంటే  ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో కలిసి వైసీపీని భారీ తేడాతో ఓడించాయి. అయినా జగన్మోహన్ రెడ్డి తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో వైసీపీ స్ట్రాటజీ జగన్ రాజకీయాల్ని అందరూ మర్చిపోయేలా చేశాయి.    ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన విప్ జారీ చేసి.. ఓటింగ్ ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చాయి. అయితే నలుగురు ఎంపీలు ఉన్న వైసీపీకి ఇక్కడే సమస్య ఎదురయింది. తాము ఓటింగ్ కు దూరంగా ఉండాలా లేకపోతే బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాలా అని ఆలోచించారు. కానీ బీజేపీకి దూరమయ్యామని భావిస్తే… కాంగ్రెస్ కు దగ్గరవుతున్నామన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే  బీజేపీకే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.   ఇది రాజకీయాల్లో చర్చనీయాంశమయింది.

ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీకి కీలక పాత్ర, బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీ. టీడీపీని శత్రువులా చూసేది వైసీపీ. ఐదేళ్ల కాలంలో టీడీపీని వైసీపీ అధినేత జగన్ ఎంత టార్చర్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అంతకు మించి చూపించాలని టీడీపీ హైకమాండ్ పై క్యాడర్ ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాల గురించి విచారణలు చేయక తప్పదు. ఒక్క డిజిటల్ కార్పొరేషన్ పేరుతోనే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల స్కాం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటిపై విచారణ చేస్తే.. జగన్ సహా అనేక మందికి అరెస్టు ముప్పు ఉంటుంది. సీబీఐ, ఈడీ కేసులకు ఇవి అదనం అవుతాయి. అయితే బీజేపీకి సపోర్టుగా ఉంటున్నందున బీజేపీ కాపాడుతుందని.. వైసీపీ నేతలు గట్టి నమ్కకంతో ఉన్నారని అందుకే సపోర్టు అడగకపోయినా ప్రకటిస్తున్నారని చెబుతున్నారు.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వైసీపీ మద్దతివ్వక తప్పని  పరిస్థితి.  ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. వాటి విచారణ కోర్టుల్లో ఉంది. పన్నెండేళ్లుగా ట్రయల్ కు రాని కేసులన్న విమర్శలు  వస్తున్నాయి. అదే సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు కూడా ఉంది. అధికారంలో ఉండటం వల్ల అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా అతి కష్టం మీద కాపాడగలిగారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేంగా వెళ్తున్నామన్న సంకేతాలు వస్తే పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడతాయి.  . అందుకే జగన్మోహన్ రెడ్డి నైతికత.. అనైతికత అనేదాని గురించి ఆలోచించకుండా.. వెంటనే బీజేపీకి మద్దతు పలికేశారు.   భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో కానీ.. వైసీపీ అధినేత జగన్ మాత్రం.. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉంటే వారికి దాసోహం అంటారన్న భావన మాత్రం పెరుగుతోంది.

అంతకు ముందు ఐదేళ్ల పాటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బేషరతు మద్దతు ఇచ్చారు. ఎలాంటి బిల్లు అయినా పార్లమెంట్ లో డిమాండ్లు పెట్టకుండా అడిగినా అడగకపోయినా సపోర్టు  చేశారు. అందుకే తమకు వ్యతిరేకంగా బీజేపీ వెళ్లదని అనుకున్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాము ఎప్పటిలాగా మద్దతుగా ఉంటామని టీడీపీ, జనసేనతో కలవొద్దని కోరినట్లుగా ప్రచారం కూడా జరిగింది. కానీ టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసిపోయింది. ఇలాంటి సందర్భంలో వైసీపీ బీజేపీని వ్యతిరికించాల్సింది. కానీ వైసీపీ అధినేత జగన్‌కు  మరో ఆప్షన్ లేదన్నట్లుగా బీజేపీకే మద్దతుగా ఉంటున్నారు. . రాజ్యసభలో ఇప్పటికీ వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు. వారంతా ఇక చెప్పాల్సిన పని లేకుండా బీజేపీకే మద్దతుగా ఉంటారు. అంటే..  టీడీపీ, జనసేనతో కలిసిన బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లేందుకు వైసీపీ సిద్దంగా లేదన్నమాట.

రాజకీయాల్లో  తెర వెనుక ఎలాంటి వేషాలేసినా.. తెర ముందు కనీస విలువలు పాటించాల్సిన అవసరం లేకపోతే చులకన అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే అవుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి