మంచు ఫ్యామిలీకి వైసీపీ టికెట్..!

By KTV Telugu On 2 February, 2024
image

KTV TELUGU :-

ఏపీ  ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాల ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. టికెట్ రాని వాళ్లు, జగన్ ఆదేశాలను పాటించేందుకు ఇష్టపడని వాళ్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటే…పార్టీని నిలబెట్టి మరింత  బలోపేతం చేసేందుకు  జగన్ తన ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో జనం సులభంగా మెచ్చే సినీ పరిశ్రమకు చెందిన కొందరిని ఎన్నికల కదనరంగంలోకి దించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడయ్యారు….

జగన్ ఇప్పటి వరకు లోక్ సభ , అసెంబ్లీ కలిపి  68 మందిని మార్చారు. అందులో 58 మంది ఎమ్మెల్యేలున్నారు. బహు తక్కువ మందికి మాత్రమే స్థానచలనం లభించగా.. చాలా మందికి ఉద్వాసన తప్పలేదు. అవకాశాలు కోల్పోయిన వాళ్లు ఇష్టం లేని ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిన వాళ్లు పలాయనమంత్రం పఠిస్తున్నారు. అలాంటి వాళ్లు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నేత ఆదిమూలం, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసి.. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. లోక్ సభ సభ్యుడు బాలశౌరి ఫిబ్రవరి 4న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారు. ఈ పరిస్థితులన్నింటినీ ఆంచనా వేసుకున్న తర్వాత వైసీపీ అధినేత జగన్ కాస్త రూటు మార్చారు. పార్టీ పూర్తిగా దిగజారకుండానూ, కాస్త  పాపులారిటీ పెరిగే విధంగానూ ఆయన పావులు కదపుతున్నారు. రాజకీయానికి సినీ గ్లామర్ అద్దాలని ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట  ఎంపీ  లావు కృష్ణదేవరాయలు  గుంటూరు నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేయడంతో పాటు వైసీపీ నుంచే వైదొలిగిన నేపథ్యంలో  ఆ స్థానానికి సినీ నటుడు మంచు విష్ణును బరిలోకి దించాలని  నిర్ణయించుకున్నట్లు సమాచారం. విష్ణు తండ్రి మోహన్ బాబు గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. విష్ణు కమ్మ సామాజికవర్గానికి చెందిన నటుడు కావడం, గుంటూరులో కమ్మ వారు ఎక్కువగా ఉండటంతో అక్కడ నుంచే పోటీ చేయించాలని జగన్  నిర్ణయించుకున్నారు.పైగా వివాహాల పరంగా జగన్ కు, విష్ణుకు బంధుత్వం కూడా ఉంది.  విష్ణును గుంటూరు నుంచి పోటీ చేయిస్తే టీడీపీకి చెక్ పెట్టినట్లు కూడా అవుతుందని భావిస్తున్నారు. అవసరమైతే తానే ఎన్నికల నిధులు ఇచ్చేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మోహన్  బాబు కుటుంబానికి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉంది. విష్ణు ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్  అసోసియేషన్  అధ్యక్షుడిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం మోహన్ బాబు వెళ్లి చంద్రబాబును కలిసినా… ఆయన వైపు నుంచి ఎటువంటి హామీ రాలేదు. దానితో ఇప్పుడు వైసీపీ వైపుకు వచ్చేందుకే ఆ కుటుంబం ఇష్టపడుతోంది.ఇక  వేరే నటులు కూడా వైసీపీలో పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నారు…

గుంటూరులో వైసీపీకి బలమైన నాయకుడు లభించకపోతే విష్ణుకు ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. మరో  పక్క ఎమ్మెల్యే టికెట్ కోసం నటుడు అలీ,  నటుడిగా మారిని రచయిత పోసాని కృష్ణమురళీ ఎదురుచూస్తున్నారు.వారిద్దరూ ఇప్పుడు  నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. గతంలో అలీకి రాజ్యసభ వస్తుందని ఎదురు చూసినా నిరాశ తప్పలేదు. ఈ సారి అలీకి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఆయన పల్నాడు  జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారని చెప్పుకున్నారు. అయితే ప్రస్తుతం నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సత్తెనపల్లిలో అంబటికి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన్ను మార్చాలనుకుంటే టికెట్ అవకాశం ఉన్న వారిలో అలీ పేరు కూడా వినిపిస్తోంది.  ఇక  పోసాని విషయం  మాత్రం ఈ సారి ఎన్నికలకు పక్కకు పెట్టారని అంటున్నారు. ఐనా ఆశ వదులుకోకుండా  పోసాని తన  ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.. ఇటీవల  సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని జగన్ ను వేడుకున్నట్లు సమాచారం.

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున నలుగురైదుగురైనా సినీ జనం  పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ను ప్రసన్నం చేసుకోగలిగితే టికెట్ రావడంతో పాటు ఖర్చులు కూడా  పార్టీనే పెట్టుకుంటుందన్న విశ్వాసం వారిలో  ఉండటమే కారణం. పైగా పార్టీకి కూడా సినీ గ్లామర్ చాలా అవసరం. చూడాలి ఏం జరుగుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి