గ్లోబల్ సమ్మిట్ పై బాబు మార్క్ రాజకీయం.. హుందాగా పవన్ కళ్యాణ్

By KTV Telugu On 4 March, 2023
image

అన్ని విషయాలనూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. కొన్ని విషయాల్లో పార్టీలు హుందాగా ఉండాలి. ఈ విషయంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో తాను ఎప్పటికీ హుందాగా ఉండే ప్రసక్తే లేదని టిడిపి చాటి చెప్పుకుంది. ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విషయంలో టిడిపి-జనసేనల వైఖరిని గమనిస్తోన్న వారు జనసేనానిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ప్రతీ దాన్నీ రాజకీయం చేయాలనుకుంటారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ప్రతీదీ రాజకీయం చేయడం సరియైనది కాదని భావిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సంకుచితంగా ఆలోచిస్తే పదేళ్ల క్రితమే పార్టీ పెట్టిన జనసేనాని మాత్రం ఎంతో అనుభవం ఉన్న నేతలా హుందాగా ఉంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడా తాజాగా మరోసారి బయట పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విశాఖ నగరంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏర్పాటు చేసింది. అందుకోసం చాలా కసరత్తులు చేసింది. ఎన్నో ప్రణాళికలు రూపొందించుకుంది. అనుకున్న నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేసింది.
ఫలితంగా సమ్మిట్ మొదటి రోజే పెద్ద హిట్ అయ్యింది. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎం.ఓ.యూ.లు కుదిరాయి.

ఇంతవరకు దక్షిణాది వైపు ఓరకంట కూడా చూడని పారిశ్రామిక దిగ్గజాలు అంతర్జాతీయ సంస్థలు ఇపుడు ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. 340 సంస్థలు ఈ సమ్మిట్ లో ఒప్పందాలు చేసుకున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు హయాంలో కానీ నిర్వహించిన పార్టనర్ షిప్ సమ్మిట్స్ లో ఎన్నడూ ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు రాలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు సంబంధించి శుభవార్తే.
ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే ఏకంగా 6లక్షల మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. అదే సమయంలో పారిశ్రామిక ప్రగతితో ఏపీ ఆర్ధిక శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయి. ఇందులో రాజకీయాలకు ఎలాంటి అవకాశం లేదు ఉండకూడదు కూడా. కాకపోతే రాజకీయాలే పరమావధిగా ఉన్న టిడిపి మాత్రం సదస్సు మొదటి రోజునే రాజకీయం మొదలు పెట్టేసింది. ఇక టిడిపి అనుకూల మీడియా అయితే నాలుగేళ్లలో రాని పెట్టుబడులు చివరి సంవత్సరంలో వచ్చేస్తాయా అరాచకాల ఆంధ్రాకి పెట్టుబడిదారులు ధైర్యంగా వస్తారా ఎన్నికల కోసమే పెట్టుబడుల డ్రామా ఆడుతున్నారా అంటూ వెక్కిరింతల డిబేట్స్ నిర్వహించేసింది.

టిడిపి నేతలు సైతం ఈ పెట్టుబడులన్నీ నిజంగానే వస్తాయా సమ్మిట్ కు వచ్చిన వారంతా పెట్టుబడులు పెట్టేస్తారా అంటూ సాగదీసుకుంటూ ప్రశ్నలు సంధించారు. విషయం ఏంటంటే విపక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమే. ఇపుడు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే అది ఏపీకి మంచిదే కదా. ప్రధాన ప్రతిపక్షం ఏం చేయాలి పెట్టుబడులను మరో మాట లేకుండా స్వాగతించాలి. మన రాష్ట్రం మరింతగా అభివృద్ది చెందాలని కనీసం ఆకాంక్ష వ్యక్తం చేయాలి. ఒక వేళ వారు ఇపుడు నిలదీస్తోన్నట్లు ఈ పెట్టుబడులు నిజం కాకపోతే అప్పుడే ప్రశ్నలు కురిపించవచ్చు. ప్రభుత్వం చెప్పిన స్థాయిలో ఎం.ఓ.యూలు నిజంగా కుదిరాయా లేదా ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామిక వేత్తలు నిజంగానే ఏపీలో కంపెనీలు నెలకొల్పారా లేదా వంటి అంశాలన్నీ కొంత కాలం ఆగితే ఎలాగూ తేలుతుంది. అపుడు ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షాలకు ఎలాగూ ఉంటుంది. అంత వరకు ఆగే ఓపిక కూడా లేకుండా ఇపుడే బురద జల్లేద్దాం అనే రాజకీయం దిగజారుడు రాజకీయమే అవుతుందంటున్నారు రాజకీయ పండితులు.

తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ. అటువంటి పార్టీ ఎంతో కొంత హుందాగా ఉంటే ప్రజల్లోనూ మంచి మార్కులు కొట్టేయచ్చు. అలా కాకుండా ఇలా పుల్ల విరుపు మాటలతో అర్ధం పర్ధం లేని రాజకీయాలతో రచ్చచేయడం శోభ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టిడిపి ఇలా ఉంటే పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఎంత హుందాగా ఉందో చూడండి. సమ్మిట్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఒకే మాట అన్నారు. రెండు రోజుల సమ్మిట్ సమయంలో తాము రాజకీయాలు మాట్లాడం అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని కూడా అన్నారు. ఎంతటి రాజకీయ పరిణతి ఉంది అందులో ఎంతటి హుందాతనం ఉంది. ఈ పాటి హుందాతనాన్ని కూడా చంద్రబాబు నాయుడి పార్టీ ప్రదర్శించలేకపోయిందంటే ఏమనాలి అని మేథావులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం చెబుతోన్న పెట్టుబడుల లెక్కల్లో డొల్ల తనం ఉంటే దాన్ని క్షుణ్నంగా పరిశీలించి వాస్తవాలను తెలుసుకుని అప్పుడే ప్రభుత్వాన్ని నిలదీయవచ్చునన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు. నిజంగానే అది చక్కటి ఆలోచన. ఇటువంటి ఆలోచనలతోనే నాయకుల విలువ మరింత పెరుగుతుంది. జనాదరణ కూడా అదే క్రమంలో రెట్టింపు అవుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ రోజు రోజుకీ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ప్రజాసమస్యల విషయానికి వస్తే ఇదే జనసేనాని రాజీ అన్నదే లేకుండా పోరాటానికి సై అంటారు.
ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ప్రజాసమస్యలు పరిష్కరించుకోడానికి ముందుకు వస్తారు. ఈ క్రమంలో తనకు ఉపాధి కల్పిస్తోన్న సినిమాలను కూడా పక్కన పెట్టి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కాంక్షిస్తోన్న చంద్రబాబు నాయుడి పార్టీ మాత్రం ప్రజాసమస్యలను పట్టించుకోదు. రాజకీయాలు చేయకూడని అంశాల్లో హుందాగా ఉండదు. ఇదేం రాజకీయం అని రాజకీయ పరిశీలకులు నిలదీస్తున్నారు.