జగన్, షర్మిల మధ్య వైఎస్ !

By KTV Telugu On 5 July, 2024
image

KTV TELUGU :-

రాజకీయాలకు బంధుత్వాలు ఉండవు ప్రయోజనాలే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రాజకీయాలు చూస్తే ఇదే అర్థం అవుతుంది. అన్నాచెల్లెళ్లు రాజకీయంగా వేర్వేరు బాటల్లో ఉన్నారు. ఇప్పుడు వారిద్దరూ.. వైఎస్ లెగసీ కోసం పోరాటం చేస్తున్నారు.మొదట జగన్.. వైఎస్ వారసుడ్నని ప్రజల్ని మెప్పించి ఒక్క చాన్స్ పొందారు. కానీ తర్వాత వైఎస్ ను దూరం పెట్టారు. ఇప్పుడు అదే అవకాశంగా తీసుకుని షర్మిల అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. జగన్ నుంచి వైఎస్‌ను లాక్కుకుంటున్నారు. జగన్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడిపోయారు.

రాజకీయాల్లో సెంటిమెంట్ కు ఉన్న బలమేంటో జగన్ చూపించారు. వైఎస్ అకాల మరణం తర్వాత ఆ సానుభూతిని ఆయన ఏళ్ల తరబడి లైవ్‌లో ఉంచుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని చెప్పుకునేదుకు సినిమాలు కూడా తీశారు. కానీ అధికారం వచ్చిన తర్వాత వైఎస్‌ను పట్టించుకోలేదు. మెల్లగా అన్నింటికీ తన పేర్లే పెట్టుకోవడం ప్రారంభించారు. ఇదే చాన్స్‌గా తీసుకుని  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు  భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఐకాన్‌గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను పూర్తిగా పార్టీకి ప్లస్ అయ్యేలా చేసుకోవడానికి భిన్నమైన ప్లాన్లతో ముందడుగు వేస్తున్నారు.

వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ వైసీపీని ప్రారంభించారు. వైఎస్ అభిమానులతో  పాటు కాంగ్రెస్ క్యాడర్ అంతా  జగన్ వెంట నడిచారు. అసలైన కాంగ్రెస్ అదే అన్నట్లుగా ఇంత కాలం రాజకీయం నడిచింది. అయితే ఇప్పుడు షర్మిల దాన్ని మార్చాలని డిసైడయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం కాంగ్రెస్ వాది అని.. కాంగ్రెస్ వల్లే ఆయనకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని చెబుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడని..రాహుల్ ను  ప్రధాని చేయాలన్నది ఆయన చివరి కోరిక అని చెబుతున్నారు. ఇటీవల వైసీపీ వైఎస్‌ ఇమేజ్ పై ఆధారపడటం తగ్గించుకోవడం ప్రారంభించింది. జగన్ కే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ పరిణామాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని షర్మిల డిసైడయ్యారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75న జయంతిని కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడలో అత్యంత భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,  కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్‌కు అత్యంత ఆత్మీయులుగా పేరుపడిన నేతలందర్నీ పిలుస్తున్నారు. వైసీపీలో చాలా మంది వైఎస్ సన్నిహిత నేతలు ఉన్నారు. వారంతా ఇప్పటికీ వైఎస్ పై అభిమానంతో ఉన్నారు. వారిని ఈ కార్యక్రమానికి షర్మిల ఆహ్వానిస్తున్నారు. వైసీపీ .. వైఎస్ 75వ జయంతికి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. మామూలుగా అయితే ప్లీనరీ నిర్వహించేవారు. ఈ సారి పార్టీ ఓడిపోవడంతో ప్లీనరీ కూడా నిర్వహించడం లేదు. వైఎస్ కు ఎలాంటి నివాళి అర్పించే కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు.  కానీ షర్మిల మాత్రం అత్యంత ఘనంగా వైఎస్ జయంతిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ ఘోరమైన ఓటమి తర్వాత ఆమె పలువురు నేతలను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో వైసీపీ పరిస్థితి దిగజారుతుందని.. 2029లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వస్తుందని అప్పుడు మంచి భవిష్యత్ ఉంటుందన్న  నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఓ కొలిక్కి వస్తాయని..  కొత్తగా గత పాలనలో ఏపీ ప్రభుత్వం పెట్టే కేసులు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో వైసీపీ కోలుకోవడం కష్టమని చెబుతున్నారు. ముందుగా కాంగ్రెస్ లో చేరిన వారికి భవిష్యత్ ఉంటుందని సంకేతాలు పంపుతున్నారు.    తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటంతో వారి మద్దతు తీసుకుని షర్మిల ఏపీని బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  వైసీపీ నేతలపై ఆకర్ష్ ప్రయోగించడంలో.. తెలంగాణ , కర్ణాటక కాంగ్రెస్ నేతలు సహకరించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీ తరపున టిక్కెట్ రాని వారు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. వారి చేరిక వెనుక బలమైన లాబీయింగ్ ఉందని.. అదే ముందు ముందు కొనసాగుతుందని భావిస్తున్నారు. వైఎస్‌ను పూర్తిగా కాంగ్రెస్ ఓన్ చేసుకుంటే.. జగన్ నుంచి షర్మిల లాగేసుకుంటే  .. రాజకీయం సమూలంగా మారిపోతుంది.

జగన్‌కు ప్రత్యేకమైన ఇమేజ్ లేదు. ఐదేళ్ల పాలనలో ఆయన నెగెటివ్ ఇమజే తెచ్చుకున్నారు. తాను మంచే చేశాననే భ్రమలో వైఎస్ ను కూడా ఆయన షర్మిలకు వదిలేసుకుంటే.. రాజకీయంగా మరిన్ని క్లిష్ట పరిస్థితులు జగన్ ఎదుర్కొనే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి