కౌన్సిలర్‌కి ఎక్కువ కార్పొరేటర్‌కి తక్కువ అన్నమాట రాజకీయాల్లో వినిపిస్తుంది. కానీ ఎక్కడా లేనన్ని అద్భుతాలు జరిగేది మాత్రం రాజకీయాల్లోనే. వార్డుమెంబర్‌గా కూడా పనికిరాడనుకున్న వాడు ఆ ఊరి సర్పంచ్ అయిపోవచ్చు. కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయినవాడు కూడా తర్వాత అదృష్టం కలిసొచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టొచ్చు. జనం తీర్పు ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక్కసారి ఈక్వేషన్స్ కలిసొస్తే ఇంపాజిబుల్ అనుకుంది కూడా ఇట్టే జరిగిపోతుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేనోళ్లో నాయకులైపోతుంటే రాజకీయ కుటుంబంనుంచి వచ్చిన మహిళ చట్టసభల్లో అడుగుపెట్టొచ్చన్న ప్రచారాన్ని అసాధ్యమని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు.
ఎవరన్నా కావాలని చేస్తున్న ప్రచారమో ఉన్న విషయమే గడపదాటి బయటికొస్తోందోగానీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబంనుంచి మరొకరు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటిదాకా సాక్షిమీడియా బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు గృహిణిగా తన కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు వైఎస్ జగన్ సతీమణి భారతి. ఎప్పుడైనా ఉగాదివంటి వేడుకల్లోనో మరెవరయినా ముఖ్యమైన అతిధులొస్తేనే జగన్‌తో పాటు అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చన్న ప్రచారం బలంగా ఉంది.
కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. పులివెందులనుంచి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అదే జిల్లాలో మరో కీలకమైన జమ్మలమడుగునుంచి వైఎస్ భారతిని పోటీచేయించే అవకాశం ఉందట. 2014లో ఇక్కడినుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణరెడ్డి గెలిచారు. మూడేళ్లు తిరక్కముందే టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. 2019లో ఓడిపోయాక బీజేపీలో చేరారు. రాజకీయ అనుభవం లేని డాక్టర్ సుధీర్‌రెడ్డి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి అక్కడున్న పట్టు అలాంటిది. అయితే ఇప్పుడు సుధీర్‌రెడ్డిపై వ్యతిరేకత పెరిగింది. టీడీపీనుంచి వైసీపీలోకి వచ్చిన రామసుబ్బారెడ్డికి అవకాశం ఇచ్చినా వర్గపోరు నష్టంచేసేలా ఉంది. అందుకే మధ్యేమార్గంగా వైఎస్ భారతి పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
వైఎస్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న జగన్ కుటుంబం తల్లీ చెల్లీ ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మేనమామ కమలాపురం ఎమ్మెల్యే. సోదరుడు అవినాష్‌రెడ్డి కడప ఎంపీ. ఇప్పుడాయన సతీమణి కూడా దిగినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. కడపలో పట్టు చేజారకుండా చూసుకోవడం ఆ కుటుంబానికి చాలా ముఖ్యం. అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులకేసు ఇంకా అలాగే ఉంది. భవిష్యత్తులో మళ్లీ చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవన్న నమ్మకమేమీ లేదు. అందుకే సేఫ్‌సైడ్‌గా భారతిని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దీంతో భారతి బరిలో ఉంటే అలవోకగా గెలిచేస్తారన్న నమ్మకంతో ఉంది వైసీపీ.
కేంద్రంతో పోరాటం విషయంలో జగన్ ప్రభుత్వం మెతక వైఖరితో ఉందన్న విమర్శలున్నాయి. ఎల్లకాలం బ్యాలెన్స్ చేయడం సాధ్యపడకపోవచ్చు. కేసీఆర్‌లా గతంలో చంద్రబాబులా కేంద్రంమీద పోరాటానికి సిద్ధమైతే పర్యవసానాలకు కూడా సిద్ధపడి ఉండాలి. జగన్ మీద సీబీఐ కేసులున్నాయి. సీబీఐ విచారిస్తున్న వైఎస్ వివేకా హత్య కేసు ఏ మలుపులు తిరుగుతుందో తెలీటం లేదు. గతంలో జగన్ అరెస్టయినప్పుడు ఆయన సోదరి పాదయాత్ర కొనసాగించారు. ఇప్పుడామె అన్నతో సంబంధం లేకుండా తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. దీంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన రాజకీయాన్ని కొనసాగించేందుకు జగన్‌కి అర్ధాంగికి మించిన ప్రత్యామ్నాయం ఇంకేముంటుంది.