కేసీఆర్ దేశ ప్రధాని కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని వారి తరపున బీఆర్ఎస్ నేతలు రోజూ ప్రకటిస్తూనే ఉంటారు. కేసీఆర్ ప్రధాని కావాలనుకుంటున్నారని అలా నేరుగానే చెబుతారు. సాధ్యాసాధ్యాల గురించి పెద్దగా చర్చించడం లేదు. తెలంగాణనే సాధించిన కేసీఆర్‌కు ప్రధాని పదవి సాధించడం ఓ లెక్కా అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు నేరుగా చెప్పే ధైర్యం లేదు. కానీ ఆయన పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు తాజాగా ఇతర రాష్ట్రాల నుంచి మనుషుల్ని మీరు ప్రధాని కావాలి సార్ అంటూ రంగంలోకి దింపుతున్నారు. అలాంటి వారికి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తున్నారు. దీంతో జగన్ ప్రధాని ప్రయత్నాలూ హైలెట్ అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయన సీఎం కావాలంటూ ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ఒకరు పాదయాత్ర చేస్తారు. శ్రీకాకుళం నుంచి మరొకరు సైకిల్ యాత్ర చేస్తారు. మరో దంపతులు ఇడుపులపాయకు వెళ్తారు. ఇలాంటి వారికి వైసీపీ సోషల్ మీడియాలో మంచి పబ్లిసిటీ వస్తుంది . జనం జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ప్రచారం చేసుకోవడమే దీని ఉద్దేశం. ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే ప్రధాని పదవి కోసం జగన్ ప్రారంభించారు. కాబోయే ప్రధాని జగన్ అని టీ షర్టు మీద సైకిల్ యాత్ర చేసుకుంటూ మహారాష్ట్రకు చెందిన కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే అనే వ్యక్తి అమరావతి వచ్చారని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆయన సీఎం జగన్ ప్రధాని కావాలనే స్లోగన్‌తో టీ షర్టు వేసుకున్నాడు. ఆయనను జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించి ఫోటోలు దిగారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఆ విషయాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ప్రధాని పదవిపై జగన్ ఆశపడ్డారని స్ట్రాటజీలు ప్రారంభించేశారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ నేతలు అనేక మంది జగన్ ప్రధానమంత్రి అవుతారని ప్రకటించారు ప్రకటిస్తూనే ఉన్నారు. స్వయంగా మంత్రులు ఇలాంటి ప్రకటనలు చేసే వారిలో ఉన్నారు. వారంతా జగన్ ను మెప్పించేందుకు ఆయన మనసులో ఉన్న కోరికను ఇలా బహిరంగంగా చెబుతున్నారు. ఎలా చూసినా జగన్ కూడా ప్రధాని పదవిపై గట్టిగానే ఆశలు పెట్టుకుంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప్రధాని అపోయినట్లుగానే వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తాను ఢిల్లీ పీఠం మీద ఉంటానని అందరికీ దళిత బంధు రైతు బంధు పథకాలతో డబ్బులు లక్షలకు లక్షలు ఖాతాలకు జమ చేస్తానని చెబుతున్నారు. ఆయన చెబుతున్న మాటలు ఇతర రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయో లేదో కానీ తెలంగాణలో మాత్రం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న పార్లమెంట్ సీట్లు 17 మాత్రమే. అందులో హైదరాబాద్ స్థానంలో పోటీ చేయరు చేసినా డిపాజిట్ రాదు. మిగిలి పదహారు స్థానాల్లో పట్టుమని పది కూడా వస్తాయని ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు. పట్టుమని పది మంది ఎంపీలూ ఉండని పార్టీ నుంచి ప్రధాని ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. అయితే తమది జాతీయ పార్టీ అని దేశమంతా పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ పక్కనే జరుగుతున్న కర్ణాటక ఎన్నికల వైపు చూడటానికే భయపడే పార్టీ దేశం మొత్తం ఎలా పోటీ చేస్తుంది. పోటీ చేసినా ఒక్క స్థానం బయట సాధించినా గొప్పే అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కేసీఆర్ ప్రగతి భవన్ దాటని రాజకీయం చూస్తున్న ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయని ఎవరూ అనుకోరు. అయినా కేసీఆర్ తాను ప్రధాని అయిపోయినట్లేనన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. 17 సీట్లు ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ప్రధాని అవ్వాలని తహతహలాడుతూంటే పాతిక పార్లమెంట్ సీట్లు ఉన్న ఏపీకి సీఎం అయిన తాను మాత్రం ఎందుకు సైలెంట్ ఉండాలని జగన్ అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇటీవల తనకు ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టెంట్ గా ఉన్న న్యూస్ చానల్‌తో తనకు వచ్చే ఎన్నికల్లో పాతిక పార్లమెంట్ సీట్లు వస్తాయని సర్వే వేయించుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఎవరు అయినా ప్రధాని పదవి చేపట్టవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ ప్రధాని పదవి ఎలా వస్తుంది అంటే పూర్తిగా ప్రజలు ఇస్తేనే వస్తుంది అదే ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరు ప్రధానిగా కోరుకుంటారో వారికే మద్దతు లభిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పుడు అందరి కంటే ముందున్నారు. చాలా మంది ప్రాంతీయపార్టీల నేతలు సీనియర్ నేతలు తాము ప్రధాని కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో ఉన్న వారు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన వారూ ఈ జాబితాలో ఉంటున్నారు. అయితే వీరెవరూ తమ బలంతో ప్రధాని కావాలని అనుకోవడం లేదు. తమకు కొద్దిగా బలం అది కూడా డిసైడింగ్ ఫిగర్ ఉంటుందని అందుకే అందరూ కలిసి తమకే మద్దతిస్తారని ఆశపడుతున్నారు. ప్రస్తుతం రెండుతెలుగు రాష్ట్రాల నేతల రాజకీయం చూస్తూంటే వాస్తవ పరిస్థితుల్ని పట్టించుకోకుండా తమకు తిరుగులేని అధికారం ఉందని ఇక్కడ కాకపోతే ప్రధానిగా ఢిల్లీలో చక్రం తిప్పగలమని వారు ఆశపడుతున్నారు. పథకాల పేరుతో ప్రజాధనాన్ని ఓటు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసి అది తాము చేస్తున్న మేలు అని పథకాలు అని ప్రచారం చేసుకుని దేశ్ కీ నేత అవగలమని వీరనుకుటున్నారు. కానీ అదంతా తేలిక కాదని రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్న వారికైనా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రం తాము సాధించిన విజయాలతో బేరీజు వేసుకుని ప్రధాని పదవి మరీ దూరం ఏమీ కాదని గట్టిగా నమ్ముతున్నారు. ఆకాశంలో మేఘాలు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్లుగా పరిస్థితి మారిపోతే ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు మాజీలవుతారు అప్పుడు దేశంలో కాదు రాష్ట్రంలో కూడా పట్టించుకునేవారు ఉండరు. అదే రాజకీయం.