ఆయన రాజకీయాల్లో లేరు. రెండు సార్లు ఎంపీగా చేసినా విభజన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు అడిగినా తాను రాజకీయాల్లో లేననే చెబుతారు. ఐనా సరే మీడియాకు, రాజకీయాల్లో రాణించేవారికి ఆయనో అంతరాత్మలా తయారయ్యారు. సలహాలు కావాలంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కూడా అదే. ఆయన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. చాలా మంది ఆపాయ్యంగా ఆయన్ను పంతులు గారూ అని కూడా పిలుస్తారు….
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ అంతరాత్మ. అది అందరికీ తెలిసిన విషయం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం కూడా కాకపోవచ్చు. అలాంటి అంతరాత్మ ఇప్పుడు షర్మిల వైపున ఉన్నారు. ఆమెకు ఏపీసీసీ అధ్యక్ష పదవి రావడం వెనుక ఎంతో కొంత కేవీపీ గాలి వీచిందని కూడా చెబుతారు. షర్మిల బాధ్యతలు చేపట్టేందుకు ముందు రోజున ఇడుపులపాయకు వెళ్తుంటే ఆమెతో పాటు అక్కడకు చేరుకున్న వృద్ధతరం నేతల్లో కేవీపీ కూడా ఒక్కరు. ఇంత జరిగినా ఇప్పుడు షర్మిలకు కేవీపీ అంతరాత్మేనని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ ఆయన్ను దగ్గరకు రానివ్వలేదు. జగన్ కుటుంబం కూడా కేవీపీని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు అవసరార్థం షర్మిల మాట్లాడినా, గుంపులో తిప్పుకున్నా…. కేవీపీపై ఆమె పూర్తిగా డిపెండ్ అవుతారన్న విశ్వాసమూ లేదు. మరి అసలు అంతరాత్మ ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ ను ప్రత్యేకంగా రాజమండ్రి వెళ్లి షర్మిల భేటీ కావడం కూడా ఆ దిశగానే చూడాల్సి ఉంటుంది.
ఉండవల్లి రాజకీయాల నుంచి తప్పుకుని ఉండొచ్చు. ఆయనకు మంచి స్టేట్స్ మెన్ అన్న పేరు మాత్రం ఉంది. న్యాయ కోవిదుడైన ఉండవల్లి అవసరమైనప్పుడు లీగల్ అంశాల్లో అడిగిన వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. కేసులు వేస్తూ సాగదీయడంలో ఆయన దిట్ట. పైగా రాజకీయ అంశాలపై సరైన డైరక్షన్ ఇస్తారని కూడా ఉండవల్లికి మంచి పేరుంది. దాన్ని వాడుకోవాలనే తపనతోనే షర్మిల ఆయన వైపు ఒక లుక్కేశారని కూడా చెబుతున్నారు.పైగా ఇప్పటికే షర్మిలకు ఉండవల్లి ఒక కీలక సలహా ఇచ్చారని పాలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది…
రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న మాజీ నాయకుడు ఉండవల్లి. ఆయనలో ఉన్నదీ కాంగ్రెస్ రక్తం. వైఎస్ అంటే ఒంటి నిండా అభిమానం. అందుకే షర్మిలతో భేటీకి ఆయన వెంటనే అంగీకరించారు. అంతకంటే ముందే షర్మిల ఆయనతో మాట్లాడినట్లు, సలహాలు పొందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని కీలకాంశాల్లో ముందు జాగ్రత్తలు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. చంద్రబాబును ఎంతైనా తిట్టు, పవన్ కల్యాణ్ జోలికి మాత్రం వెళ్లొద్దని ఉండవల్లి సలహా ఇచ్చారట. ఇలాంటి సలహా కేవీపీ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. షర్మిల ఆలోచించుకుంటే ఉండవల్లి చెప్పిందీ కరెక్టే అనిపించింది. పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే ఆయన అనుచరులను రెచ్చగొట్టినట్లు అవుతుందని వాళ్లు టీడీపీ బ్యాచ్ కంటే డేంజరస్ అని ఆమె గుర్తించారు. దానితో ఇప్పుడు మాట్లాడేప్పుడు ఆలోచించి, ఆచి తూచి అడుగులు వేశారు. ఉండవల్లి అంకుల్ మంచి సలహానే ఇచ్చారని ఆమె పొంగిపోతున్నారు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఉండవల్లి అంచనా వేయగలరు. దాన్నిబట్టి సలహాలు ఇవ్వగలరు. అందుకే నిత్యం టచ్ లో ఉండేందుకు వీలుగా షర్మిల ఆయనతో ఓ సారి భేటీ అయ్యి వచ్చారు..
పరిస్థితులను అర్థం చేసుకుని ఉండవల్లి రాజకీయాలకు దూరం జరిగి ఉండొచ్చు. విజయంపై నమ్మకం లేక ఇంటికి పరిమితమై ఉండొచ్చు. కాంగ్రెస్ పుంజుకుంటుందన్న విశ్వాసం కలిగితే మళ్లీ వెనక్కి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆయన ట్రాక్ రికార్డుకు, తెలివి తేటలకు ఎవరికైనా రాజగురువుగా ఉండొచ్చు కదా.. అంతకంటే కావాల్సిందేముంటుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…