సస్పెన్స్ థ్రిల్లర్ సిన్మాలో కూడా ఉండవేమో ఇన్ని ట్విస్టులు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకుముందు టీడీపీ పాలన చరమాంకంలో జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్. ఆయన స్వయానా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బాబాయ్. పులివెందులలోని తన సొంతిట్లోనే 2019 మార్చి 15 వైఎస్ వివేకా దారుణహత్యకు గురయ్యారు. హత్యకేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లాక ఎంతోమంది అనుమానితులు తెరపైకొచ్చారు. చివరికి కొందరు నిందితులుగా తేలారు. వారంతా వైఎస్ కుటుంబ బంధువులు సన్నిహితులు కావటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.
వైఎస్ వివేకా హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రిపేరు ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పుడు సీబీఐ వైసీపీ ఎంపీదాకా వచ్చింది. అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తంచేస్తున్న సీబీఐ విచారణకు రమ్మంటూ ఎంపీకి నోటీసులు పంపడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఆఫీస్‌కి విచారణకు రమ్మని సీబీఐ ఇచ్చిన నోటీసులపై అవినాష్‌రెడ్డి స్పందించారు. ఒక్కరోజుముందు సమాచారం ఇస్తే ఎలా రాగలనంటూ ఐదురోజుల తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానని చెప్పారు. నాలుగురోజులు అటూఇటూ సీబీఐ అవినాష్‌రెడ్డిని విచారించడం ఖాయం. దీంతో వివేకా హత్యలో ఆయన పాత్రపై సీబీఐ చేతిలో ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది ఆసక్తిరేపుతోంది.
రెండున్నరేళ్లుగా నిందలు పడుతున్నామని అంటున్నారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. తానేంటో ప్రజలకు తెలుసంటున్నారు. కానీ నిప్పులేనిదే పొగరాదన్నట్లు మర్డర్ కేసులో వివేకా సొంత బంధువుల పేర్లు ఎందుకు వస్తాయన్న చర్చ జరుగుతోంది. వివేకా కూతురు సునీత అనుమానాలే నిజమవుతున్నాయి. కేసు దర్యాప్తు సీబీఐకి వెళ్లేలా ఆమె పెద్ద పోరాటమే చేశారు. కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చేలా చూశారు. ప్రజల్లో ఉన్న సందేహాల సంగతి పక్కనపెడితే సోదరి సునీతకున్న అనుమానాలను కూడా జగన్ నివృత్తి చేయలేకపోయారు. అందుకే ఈ నాలుగేళ్ల కాలంలో కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి అవినాష్ దగ్గర ఆగింది. కడప కోర్టులో ఇప్పటికే రెండు చార్జిషీట్లు వేసిన సీబీఐ ఈ కేసు విచారణను కొలిక్కి తీసుకురాబోతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు ఆధారాలే చివరికి అసలు దోషులను చట్టం ముందు నిలబెడతాయి.