సిట్ మారిపోయింది.. వివేకా కేసు డెడ్‌లైన్ ఏప్రిల్ 30

By KTV Telugu On 30 March, 2023
image

సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న విచార‌ణ‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం అస‌హ‌నం వ్య‌క్తంచేసింది. దీంతో వివేకా హ‌త్యకేసులో ప్ర‌ధాన ఎంక్వ‌యిరీ ఆఫీస‌ర్ రాంసింగ్‌ని సీబీఐ త‌ప్పించింది. కేసు విచార‌ణ‌కు సీబీఐ ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక విచార‌ణ బృందానికి ఆమోదం తెలుపుతూ విచార‌ణ ముగించేందుకు ఏప్రిల్ 30ని డెడ్‌లైన్‌గా ప్ర‌క‌టించింది సుప్రీంకోర్టు.

రాంసింగ్ స‌హా పాత బృందాన్ని త‌ప్పించి సీబీఐ డీఐజీ కె.ఆర్‌.చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటుచేశారు. ఈ బృందంలో ఎస్పీ వికాస్‌ సింగ్‌ అడిషనల్‌ ఎస్పీ ముఖేశ్‌ కుమార్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీమతి నవీన్‌ పునియా ఎస్సై అంకిత్‌ యాదవ్‌ ఉన్నారు. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇప్పటికే కేసు విచారణ ఆలస్యం కావ‌టంతో కాల‌ప‌రిమితి విధించింది. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి స‌హా వివేకా బంధువులు అనుమానితులు.

వివేకా హ‌త్య‌కేసును విచారిస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ వివాదాల‌కు కేంద్ర‌బిందువు అవుతున్నారు. ఆయ‌న ఒత్తిడి తెస్తున్నారంటూ అనుమానితులు గ‌తంలో ఫిర్యాదు చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా విచార‌ణ సాగుతున్న తీరుని త‌ప్పుప‌ట్టారు. విచార‌ణ ఆల‌స్య‌మ‌య్యేకొద్దీ వివాదాస్ప‌దం అవుతుండ‌టంతో సుప్రీం చివ‌రికి ఏప్రిల్ నెలాఖ‌రుక‌ల్లా విచార‌ణ పూర్త‌వ్వాల‌ని ఆదేశించింది. అందుకే దర్యాప్తు అధికారిని తొల‌గిస్తూ సీబీఐ ప్ర‌తిపాదించిన కొత్త సిట్‌కి విచార‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కేసు దర్యాప్తులో పురోగతి లేన‌ప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడం అర్ధ‌ర‌హిత‌మ‌ని న్యాయ‌మూర్తి అభిప్రాయ‌ప‌డ్డారు. అవినాష్‌రెడ్డి పిటిష‌న్‌ని విచారించిన‌ప్పుడు దర్యాప్తు అధికారి రాంసింగ్‌ వివక్ష చూపుతున్నారనడానికి సాక్ష్యాలు లేవ‌న్న న్యాయ‌స్థానం విచార‌ణ‌లో జాప్యానికి కార‌కుడంటూ ఆయ‌న్ని త‌ప్పించింది.