అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి విచారణకు సిద్ధమంటున్నారు. వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో చివరికి ఏం తేలుతుందో తెలీదోగానీ సీబీఐ విచారణ రాజకీయ సంచలనాలకు కారణమవుతోంది. ఓ పక్క సీబీఐ ఎంక్వయిరీ జరుగుతుండగానే సమాంతరంగా జరుగుతున్న పొలిటికల్ ఇంటరాగేసన్ ఏపీలో హీట్ పుట్టిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు నాలుగేళ్లవుతోంది. సీబీఐ కేసును టేకప్ చేశాక అసలు దర్యాప్తు ఏ దశలో ఉందో కూడా గతంలో అర్ధంకాలేదు. కానీ ఈమధ్య సీబీఐ దూకుడు పెంచింది. రోజుకో విషయాన్ని బయటకు వస్తోంది. కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ కోసం పిటిషన్ వేస్తే దానికి సీబీఐ కౌంటర్ పిటిషనేసింది. వివేకాని ఎవరు చంపారో సీబీఐ దర్యాప్తులో తేలిపోయిందని టీడీపీనే చెప్పేస్తోంది. ఈ లీకుల వెనుక కథా స్క్రీన్‌ప్లే డైరెక్షన్ చంద్రబాబుదేనన్నది వైసీపీ ఆరోపణ.
సీబీఐ పిలుపుతో కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఆయన పాత్రపై సీబీఐకి కీలక ఆధారాలు లభించాయని ఈసారి విచారణతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని టీడీపీ ముందే ఊహాగానాలు చేసింది. దాదాపు నాలుగున్నర గంటలు సీబీఐ అవినాష్‌రెడ్డిని విచారించింది. బయటికొచ్చాక తనను సాక్షిగా విచారిస్తున్నారో అనుమానితుడిగా విచారిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డిన సీబీఐ ప్రశ్నించడం ఇది రెండోసారి.
సీబీఐ విచారణ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతోందని అనుమానిస్తున్నారు వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి. అబద్ధాన్ని నిజంగా మార్చేందుకు నిజాన్ని అబద్ధంగా చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అవినాష్ అనుమానం వ్యక్తంచేశారు.
టీడీపీ గతంలో ప్రస్తావించిన గూగుల్ టేకౌట్ సీబీఐ ఎంక్వయిరీలో రావటంతో ఆ పార్టీ విచారణను ప్రభావితం చేస్తోందన్న అనుమానాన్ని వ్యక్తంచేశారు. విచారణ సమయంలో ఆడియో వీడియో రికార్డు చేయాలని కోరినా సీబీఐ పట్టించుకోలేదన్నది అవినాష్ అభియోగం. వివేకానందారెడ్డి హత్యకు గురైన రోజు ఆయనింట్లో దొరికిన లేఖను ఎందుకు బయటపెట్టడం లేదో తెలియడం లేదని అవినాష్‌రెడ్డి అన్నారు. ఆ లేఖను హంతకులు ఆయనతో బలవంతంగా రాయించినట్లు ఇదివరకే సీబీఐ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించారు. వైసీపీ ఎంపీ ఆ లేఖను ఎందుకు ప్రస్తావించారో అర్ధంకాని విషయం. మరోవైపు అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిచింది. మొన్న తనకు పనులున్నాయని మరో తేదీ చెప్పాలని కోరిన భాస్కర్‌రెడ్డి విచారణకు రమ్మని తనకు ఎలాంటి నోటీసు అందలేదంటున్నారు. సీబీఐనుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చినా ఆయన అదే మాటమీదున్నారు. మీడియాలో వచ్చాక సీబీఐ ఎస్పీకి ఫోన్‌చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదంటున్నారు. మొత్తానికి అవినాష్‌రెడ్డి ఫ్యామిలీకి వైఎస్ వివేకా మర్డర్‌తో చిక్కులు తప్పేలా లేవు.