వైఎస్‌ వివేకా మర్డర్‌ కేస్‌.. ఇంకెన్ని మలుపులో

By KTV Telugu On 10 March, 2023
image

ఆ కేసు ముందు హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సిన్మా కూడా చిన్నబోతోంది. ట్విస్టులమీద ట్విస్టులతో చివరికి కేసు ముగింపు ఎలా ఉంటుందో అంతుపట్టటంలేదు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ ఎంక్వయిరీదాకా వచ్చిందంటే అది ఆయన కూతురి పోరాటం వల్లే. ఆమె న్యాయపోరాటంతోనే కేసు విచారణ తెలంగాణక బదిలీ అయింది. ఇప్పుడు వివేకా కూతురు మరో అడుగు ముందుకేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌లో తనను ఇంప్లీడ్‌ చేయాలంటూ సునీత పిటిషనేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో సునీతపై వివేకా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడంతో తన వాదనలు కూడా వినాలన్నది సునీత తాజా అభ్యర్థన.

వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డిపై సోమవారందాకా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇప్పటిదాకా విచారించిన ఆడియో వీడియో రికార్డులను హార్డ్‌ డిస్క్‌ రూపంలో కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న అవినాష్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో రెండో పెళ్లి కూడా కీలకమైన అంశమని ఆ దిశగా కూడా సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ కోరారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళని వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని 2015లో వారిద్దరికీ ఓ కుమారుడు కలిగాడన్నది అవినాష్‌ ఆరోపణ. ఈ రెండో పెళ్లితో వివేకా కుటుంబంలో వివాదాలు తలెత్తాయని ఆయన్ని కుటుంబసభ్యులే ఇబ్బందిపెట్టారని అవినాష్‌రెడ్డి ఆరోపించారు.

రెండో భార్య పేరుమీద వివేకా ఆస్తులు రాయాలనుకున్నారని వాటిపై జరిగిన గొడవలే హత్యకు దారితీసి ఉండొచ్చని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. సోదరి వైఎస్ సునీతారెడ్డి తనను టార్గెట్ చేసినా ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందని అవినాష్‌ బాంబుపేలుస్తున్నారు. వివేకా హత్య రోజు ఇంట్లో దొరికిన లేఖను సునీతారెడ్డి భర్త దాచిపెట్టాలని ఎందుకు చెప్పారని ఎంపీ ప్రశ్నిస్తున్నారు. తనకు ఎలాంటి సంబంధంలేని కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఇకమీద తాను మౌనంగా ఉండనని అవినాష్‌రెడ్డి చెప్పటంతో కేసులో కొత్త కొత్త విషయాలు తెరపైకొచ్చేలా ఉన్నాయి. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుని కూడా ఎంపీ తప్పుపడుతున్నారు. విచారణాధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న అభియోగాలతో ఆడియో వీడియో రికార్డులకు సంబంధించి ఏ విషయమైనా తెలపాలని సీబీఐకి కోర్టు సూచించింది.