వైఎస్ వివేకా కేసు.. టీడీపీ పొలిటిక‌ల్ గేమ్

By KTV Telugu On 21 April, 2023
image

 

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసు వైసీపీని రాజ‌కీయంగా ఇబ్బందిపెట్టేలా ఉంది 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ ప్ర‌చారంలో సెంటిమెంట్ అస్త్రంగా ప‌నికొచ్చిన అంశం ఇప్పుడాయ‌న్ని నింద‌ల బోనులో నిల‌బెట్టేలా ఉంది. సీబీఐ విచార‌ణ తీరును నిందితులు వైసీపీ నేత‌లు ఎంత త‌ప్పుప‌డుతున్నా కేసు విచార‌ణ ఆగ‌డంలేదు. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది ఆయ‌న్ని క‌స్ట‌డీలోకి తీసుకుంది. హైకోర్టునుంచి ఆదేశాలు తెచ్చుకోలేక‌పోతే ఈపాటికి అవినాష్‌రెడ్డి కూడా అరెస్ట్ అయి ఉండేవారేమో. ఏప్రిల్ నెలాఖ‌రుకు కేసు విచార‌ణ పూర్తిచేయాల‌న్న సుప్రీం ఆదేశాల‌తో సీబీఐ ఎంక్వ‌యిరీ ప్ర‌క్రియ వేగం పుంజుకుంది. చివ‌రికి వివేకా మ‌ర్డర్ కేసులో అభియోగాల నిరూప‌ణ జ‌రిగి నిందితులు దోషులుగా తేలితే మాత్రం వైసీపీకి సొంత జిల్లాలోనే ఇదో స‌వాలు కాబోతోంది.

ఎందుకో కొత్త సంవ‌త్స‌రం వైసీపీకి అంత‌గా క‌లిసిరావ‌డం లేదు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌మికి తోడు  ఎమ్మెల్యేల కోటాలో పార్టీ ఏడో అభ్య‌ర్థి ఓట‌మితోనే వైసీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఇదే స‌మ‌యంలో సీబీఐ కేసు వీగిపోతుంద‌నుకుంటే రోజురోజుకీ మెడ‌కు మ‌రింత బిగుసుకుంటోంది. టీడీపీ నేత‌లు ఆరోపిస్తే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు నింద‌లువేస్తే అవి త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని కొట్టి పార‌యొచ్చు. కానీ వైఎస్ వివేకా హ‌త్య‌కేసులో స్వ‌యానా ఆయ‌న కూతురే సొంత మ‌నుషుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయిన‌వాళ్లే త‌న తండ్రిని పొట్టన‌బెట్టుకున్నార‌ని అనుమానిస్తున్నారు. అన్న అవినాష్‌రెడ్డి కుటుంబానికి శిక్ష వేయించేందుకు అలుపెర‌గ‌ని న్యాయ‌పోరాటం చేస్తున్నారు. ఇది స‌హ‌జంగానే ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేసునుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వైఎస్ వివేకాని స్త్రీలోలుడిగా చిత్రీక‌రించ‌డం ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంపై బుర‌ద‌చ‌ల్ల‌టంతో కేసును మ‌రింత స‌వాలుగా తీసుకున్నారు ఆయ‌న కూతురు డాక్ట‌ర్ సునీత‌.

హ‌త్య‌కేసు నిందితులు అనుమానితులు ఇదంతా కుట్రంటున్నా ఆ వాద‌న తేలిపోతోంది. ఏమీ లేకుండానే వారినెందుకు అనుమానిస్తార‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకునేదాకా వెళ్లింది. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు వైసీపీపై ముప్పేట దాడి చేస్తున్న విప‌క్షాల చేతికి వివేకా కేసుల రూపంలో ఓ బ్ర‌హ్మాస్త్ర‌మే దొరికింది. సునీత న్యాయ‌పోరాటాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబుస్థాయి నేత‌లు ప్రశంసిస్తున్నారు. సీబీఐ విచార‌ణ స‌రైన దారిలో వెళ్ల‌డం లేద‌న్న అవినాష్‌రెడ్డి త‌దిత‌రుల వాద‌న నిల‌బ‌డ‌టం లేదు. కేసులో అనుమానితులు విచార‌ణ ఎలాసాగాలో చెప్ప‌డాన్ని ఎవ‌రూ స‌మ‌ర్ధించ‌డంలేదు. దీంతో నైతికంగా ఈ కేసు వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఎన్నిక‌ల్లోపే కేసు విచార‌ణ కొలిక్కివ‌చ్చి శిక్ష‌లు ప‌డే అవ‌కాశం కూడా ఉంద‌ని టీడీపీ అంచ‌నావేస్తోంది. అందుకే సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని సొంత జిల్లాలో టార్గెట్ చేసేందుకు ఈ ఎపిసోడ్‌ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న ప్లాన్‌తో ఉంది.

ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌దాకా వ‌స్తే క‌డ‌ప జిల్లా వైసీపీకి కోలుకోలేని దెబ్బేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎందుకంటే జిల్లా రాజ‌కీయాల‌ను ఇప్ప‌టిదాకా అవినాష్‌రెడ్డి కుటుంబ‌మే ప్ర‌భావితం చేస్తోంది. మొన్న‌టి ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందుల‌నుంచి అభ్య‌ర్థిని తెర‌పైకి తెచ్చి గెలిపించుకుంది టీడీపీ. ఇదే ఊపులో వివేకా కేసుతో వైఎస్ కుటుంబాన్ని దెబ్బ కొట్టాల‌నుకుంటోంది. వివేకా కూతురు సునీత ఆశించ‌కుండానే టీడీపీనుంచి ఆమెకు సంపూర్ణ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

వైఎస్ కంచుకోట‌ను ఇప్ప‌టిదాకా బ‌ద్ద‌లు కొట్ట‌లేక‌పోయిన టీడీపీ అవినాష్‌రెడ్డిపై సునీత‌ను ప్ర‌యోగించాల‌న్న ఆలోచ‌న‌తో ఉంది. క‌డ‌ప‌లో వైసీపీకి సెగ త‌గిలితే దాని ప్ర‌భావం రాయ‌ల‌సీమ అంతా ఉంటుంద‌న్న‌ది టీడీపీ వ్యూహం. సునీత ముందుకొస్తే క‌డ‌ప ఎంపీ స్థానంనుంచి ఆమెను నిల‌బెట్టాల‌నుకుంటోంది. స‌హ‌జంగానే వివాదర‌హితుడైన వివేకా హ‌త్య‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆవేద‌న ఉంది. అది సానుభూతి రూపంలో సునీత‌కు మ‌ళ్లే అవ‌కాశం ఉంది. తండ్రి హంత‌కుల‌కు శిక్ష‌ప‌డాల‌నే ఆమె ప‌ట్టుద‌ల‌కు అంద‌రినుంచి మ‌ద్ద‌తు దొరుకుతోంది. సునీత‌కు ఎన్నిక‌ల్లో పోటీపై ఆస‌క్తి లేక‌పోయినా ఆమె భ‌ర్త నర్రెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై ఒత్తిడి పెంచితే ఆమె కాద‌నే ప‌రిస్థితి ఉండ‌దు. అందుకే ఇప్ప‌ట్నించే తెర‌వెనుక పావులు క‌దుపుతోంది టీడీపీ. అదే జ‌రిగితే క‌డ‌ప‌గ‌డ‌ప‌లో వైఎస్ కుటుంబానికి గ‌ట్టి స‌వాల్ ఎదురైన‌ట్లే.