ఎప్పుడో నీరుగారి పోవాల్సిన కేసు ఆమె ఒంటరి పోరాటం వల్లే ఇంత కాలం సాగింది. నిత్యం కోర్టు మెట్లు ఎక్కుతూ ప్రతీ పిటిషన్లో ఇంప్లీడ్ అవుతూ కేసును ఆమె కొనసాగించారు. ఇప్పుడు కీలక అనుమానితులను నిందితులుగా చేర్చి వారి అరెస్టులు కొనసాగుతున్న తరుణంలో అది కేవలం ఒక్క వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి విజయమేనని చెప్పక తప్పదు. 2019లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు తొలుత ఆమె కూడా గుండెపోటు మరణమే అనుకున్నారు. తర్వాతే గుండెపోటు కాదు గొడ్డలి పోటు అని సునీత గ్రహించారు దానితో ఆమె న్యాయపోరాటం మొదటి పెట్టి పాత్రధారులు సూత్రధారులకు శిక్షపడే వరకు విశ్రమించేది లేదని ప్రకటించారు. నేరం చేసిన వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా శిక్ష పడాల్సిందేనని ఆమె పట్టుదలగా ఉండటం వల్లే ఇంతవరకైనా విచారణ జరిగింది. ఇప్పుడది కీలక దశకు చేరుకుంది.
వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా నీరు గార్చుతోందని గుర్తించిన తర్వాత సునీతలో పట్టుదల పెరిగింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ ప్రతిపక్ష నేతగా హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయించాలని కోరినప్పుడు జగన్ నుంచి తగిన స్పందన లేకపోవడం ఆ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్నవారిని సమర్థించేలా మాట్లాడడం వంటి పరిణామాలతో ఆమె అనుమానాలు మరింతగా పెరిగాయి. అన్నయ్య జగన్ తనకు న్యాయం చేయరని తెలిసిన తర్వాత తండ్రి మరణానికి కారకులైన వారికి శిక్ష పడేట్లు చేయడం తన బాధ్యతగా ఆమె భావించారు. సిట్ లను మార్చడం సిట్ అధికారులను మార్చడం లాంటి పరిణామాలు సునీతను కలవరపరిచాయి. దానితో ఆమె సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి అమెకు తీవ్రమైన ఒత్తిళ్లు బెదిరింపులు తప్పలేదు. నీతోపాటు నీ కుటుంబ సభ్యుల ప్రాణాల్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు అంటూ కొందరు ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నాలూ చేశారు. వివేకా హత్య కేసులో ఆమె భర్తను కూడా అనుమానితుడిగా పరిగణించాలని జగన్ అన్నప్పుడు ఉన్నత స్థాయిలో బెదిరింపులు ఎలా ఉంటాయో ఆమె అర్థం చేసుకున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీఎం జగన్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా ఆయన నుంచి సహాయ నిరాకరణ ఎదురైందని సునీత వివిధ సందర్భాల్లో వెల్లడించారు. ఆ క్రమంలో ఎవ్వరినీ వదిలేది లేదని సంకేతాలిచ్చారు.
వివేకా హత్య కేసు సీబీఐ విచారణ తెలంగాణకు మారడం ఆమె తొలి విజయంగా భావించాలి. ఆ తర్వాత కూడా ఆమె పట్టు వదల్లేదు తరచూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. కేసు విచారణ ఉన్నప్పుడల్లా కోర్టులకు హాజరయ్యారు. గతంలో ఓ సారి వివేకా కేసులో ఫ్యామిలీ మీటింగ్ పెట్టాలని సునీత కోరినప్పుడు జగన్ నిరాకరించారు. ఈ విషయంలో ఆయన తల్లి విజయలక్ష్మి కూడా నిస్సహాయంగా ఉండిపోయారు. తర్వాత మీటింగు ఏర్పాటు చేస్తే జగన్ మాట్లాడిన మాటలు ఆమెకు ఆవేదన కలిగించాయి. నిందితుల జాబితాలో ఆమె భర్త పేరు చేర్చాలని జగన్ ఉచిత సలహా పడేశారు. అయినా ఆమె కృంగిపోలేదు. పోరాటాన్ని కొనసాగించినందువల్లే అవినాష్ రెడ్డి కుటుంబానికి గట్టిగా ఉచ్చు బిగుసుకుందన్న విషయం గ్రహించాల్సి ఉంటుంది. వైఎస్ కుటంబంలో ఎవరూ ఆమెకు సహకరించలేదు. వీఐపీ మహిళలు వైఎస్ విజయలక్ష్మి వైఎస్ షర్మిల కూడా ఆమె ప్రయత్నంలో ఓ చేయి వేసేందుకు ముందుకు రాలేదు.
వివేకాను స్త్రీ లోలుడిగా కీచకుడిగా అవినాష్ రెడ్డి అభివర్ణిస్తుంటే అయ్యోపాపం అన్న వాళ్లు లేదు. చనిపోయిన వ్యక్తిపై అలాంటి ఆరోపణలు చేయడం తగదని కూడా విజయలక్ష్మీ షర్మిల వారించలేకపోయారు. ఒక్కసారి మాత్రమే షర్మిల ఈ కేసుపై మాట్లాడారు. జగన్ భార్య వైఎస్ భారతీ ఎప్పుడూ సింపథీని ప్రకటించలేదు. ఎవ్వరు రాకున్నా సునీత ఒంటరిగా ముందుకు సాగిపోయారు. కేసు తీర్పు వచ్చి శిక్షపడే వరకు ఆగేది లేదని ఆమె అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు మరో వార్త ప్రచారంలో వచ్చింది. అవినాష్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సునీత ఈ సారి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇండిపెండెంట్ గా ఆమె రంగంలోకి దిగితే వైసీపీయేతర పార్టీలు ఆమెకు మద్దతిస్తాయని వార్తలు వస్తున్నాయి. అప్పుడు జగన్ కు కూడా కష్టమే. సునీత గెలిస్తే జగన్ పరువు పోయినట్లే. పైగా కడప పార్లమెంటు పరిధిలోనే జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గం కూడా ఉంది. బరిలోకి దిగితే సునీత విజయం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే ఆమె పట్టుదల అలాంటిది.