రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ విషయం వైఎస్ కుటుంబాన్ని చూస్తే మరోసారి అర్థం అవుతుంది. అన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు అన్నను ఎదిరిస్తూ నిలబడ్డారు. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. రేపు ఆయనపై పులివెందులలో లేదా కడప పార్లమెంట్ లో పోటీ చేయడానికి షర్మిల రెడీ అవుతున్నాయి. ఇంత చేసి ఎన్నికల్లో పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండదు. అందుకే కడపలో అన్నా చెల్లెళ్ల సవాల్‌పైనే ఎక్కువగా అందరి దృష్టి పడింది. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా వైఎస్ వారసుల మధ్య పోరులో .. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విజయాన్ని టీడీపీ పట్టుకుని పోయినా ఆశ్చర్యం ఉండదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా పూర్తిగా స్థాయిలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఇక్కడి వరకూ వచ్చాక మొహమాటాలేమిటని ఆమె నేరుగానే జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఇచ్చాపురం టూ ఇడుపులపాయ టూర్ పెట్టుకున్న షర్మిల మిగిలిన పార్టీలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నా.. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తుండటం విశేషం. తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని జగన్ మోహన్ రెడ్డి అంటే.. వెంటనే షర్మిల అసలు చీల్చింది జగన్ మోహన్ రెడ్డేనని దానికి తన తల్లే సాక్ష్యమన్నారు. ఆ క్రమంలో ఆ అన్నాచెల్లెల్ల సొంత జిల్లా కడప రాజకీయం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది..
కడప పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ అడ్డా . కడప ఎంపీగా వైఎస్ కుటుంబసభ్యులే గెలుస్తూ రావడం రివాజుగా మారింది. అక్కడ నుంచి దివంగత నేతలు వైఎస్, వివేకా, వారి తర్వాత జగన్ లోక్‌సభకు భారీ మెజార్టీలతో ఎన్నికయ్యారు. జగన్ ఆ సీటును ఖాళీ చేసిన తర్వాత అవినాశ్‌రెడ్డికి చాన్సిచ్చారు. రెండు సార్లు ఆయన కూడా భారీ మెజార్టీలతో గెలిచారు. 1989లో కడప నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుపొందిన నాటి నుంచి అక్కడ వారికి ఓటమే లే కుండా పోయింది. ఒక్క కడప ఎంపీ స్థానం పరిధిలోనే కాదు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. అటువంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు రాజకీయంగా చీలిపోయింది . వివేకానంద రెడ్డి హత్య జరిగిన కొద్ది రోజులలోనే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి . సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యానికి జగనే కారణమన్న టాక్ ఉంది.. ఎందుకంటే జగన్‌కి తమ్ముడయ్యే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, అతని తండ్రి ఆ హత్య కేసులో నిందితులు.. దాంతో వివేకా కూతురు జగన్‌తో విభేదించి న్యాయపోరాటానికి దిగారు.
ఇక ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల కూడా జగన్‌కు రాజకీయ శత్రువయ్యారు . ఆస్తుల పంపకాల గొడవలతో వివాదం ప్రారంభమయిందని చెబుతున్నారు. ఒక్క సారి విబేధాలు వచ్చిన తర్వాత మళ్లీ కలవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా విజయమ్మ కూడా షర్మిల వైపే ఉన్నారు .. ఇక వివేకా కుమార్తె సునీత కూడా కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం మొదలైంది. సునీత కాంగ్రెస్‌లో చేరకపోయినా.. జగన్‌పై వ్యతిరేకతతో షర్మిల పక్షాన చేరడం మాత్రం ఖాయమంటున్నారు ఏదేమైనా ఇప్పుడు సొంత జిల్లాలో జగన్ టీడీపీ, జనసేనలతో పాటు తల్లీచెల్లెళ్లను పొలిటికల్‌గా ఢీ కొట్టాల్సి ఉంది.
షర్మిల కాంగ్రెస్ నుంచి కడప లోక్‌సభ బరిలో నిలిస్తే కడప ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. మరోవైపు వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ఇప్పటికే ఎంపీగా కాకుండా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్‌రెడ్డి ఎంపీ సీటు నుంచి సైడ్ అయితే.. వైసీపీ నుంచిమరో వైఎస్ కుటుంబంలోని వారే బరిలో ఉంటారు. ఈ సమయంలో వైఎస్ భారతి పేరు తెరపైకి చవ్చింది. భారతి , షర్మిల పోటీ పడితే వైఎస్ కుటుంబమంతా వన్ సైడ్‌గా షర్మిలకే సపోర్ట్ చేసే అవకాశముందంటున్నారు. ఇప్పటికే తల్లి, చెల్లిని జగన్ పట్టించుకోవడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలతో.. జనం కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు .. దానికి తోడు వివేకా హత్యతో జిల్లా వ్యాప్తంగా వైఎస్ సునీతపై సానుభూతి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటుబ్యాంకుకు కోత పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ క్రమంలో షర్మిల కడప ఎన్నికల బరిలో ఉంటే రాజకీయంగా వైసీపీకి కొంత గడ్డు పరిస్థితి తప్పదంటున్నారు. ముఖ్యంగా వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ అనుకునే చాలా మంది నేతలు జిల్లాలో .. వారంతా ఇప్పటివరకు గత్యంతరం లేక వైసీపీ వెంట నడుస్తున్నారు .. ఇప్పుడు షర్మిల అన్నకు వ్యతిరేకంగా .. అందులోనూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా మారడంతో .. వారంతా ఆమె వెంట నడిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం.. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో చాలా మందికి షర్మిల ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఇలాంటి సమీకరణల మధ్య షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే.. ఆ సెగ్మెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ ఓటుబ్యాంకుకు కోత తప్పదన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .. గ్రౌండ్ లెవల్లో వైసీపీ శ్రేణుల్లో కూడా అదే టెన్షన్ కనిపిస్తోంది.
వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు తెలుగుదేశం పార్టీకి కొత్త అవకాశంలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కడప జిల్లా ఓటర్లలో వైఎస్ కుటుంబసభ్యులను వ్యతిరేకించే వర్గంగా ఎప్పుడో విడిపోయింది. ఆ వర్గం టీడీపీని అంటి పెట్టుకుని వారు షర్మిల వైపు మొగ్గు చూపే అవకాశం లేదు. వైఎస్ , వైసీపీ ఓటు బ్యాంకునే రెండు వర్గాలు పంచుకుంటాయి. ఈ ఓట్ల చీలికతో తాము బలపడతామని..దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న విజయాన్ని అందుకుంటామని నమ్మకంతో ఉన్నారు. ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో కూడా టీడీపీ అభ్యర్థికి మెజార్టీ వచ్చింది. ఇదే వారికి కొత్త ఆశల వైపు నడిపిస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…