వైసీపీ, జనసేనల స్టిక్కర్ వార్

By KTV Telugu On 11 February, 2023
image

ఏపీలో ఇప్పుడు స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ, జనసేనల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. స్టిక్కర్ వార్ షురూ అయ్యింది. సంక్షేమమే అజెండాగా వైసీపీ ఈసారి ఎన్నికల కదనరంగంలోకి దూకుతోంది. దాంట్లో భాగంగా తమ పథకాలను హైలెట్ చేసేలా అధికార పార్టీ మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ ప్రచారం మొదలుపెట్టింది. ఇంటింటికీ వాటిని అంటించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈనేపథ్యంలో విపక్ష జనసేన రంగంలోకి దిగింది. జగన్‌ సర్కార్‌కు కౌంటర్‌గా అంతే ధీటుగా కొత్త పంథాలో మరో స్టిక్కర్‌ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. మాకు నమ్మకం లేదు దొర, నిన్ను నమ్మలేం జగన్ అంటూ పవన్ పార్టీ స్టిక్కర్స్ ముద్రిస్తోంది. సామాన్యుడి ఫోటోతో జగన్‌ స్టిక్కర్‌కు సమాధానం ఇస్తోంది.

వైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో భారీ ఎత్తున చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వైఎస్ జగన్ ఫోటోతో స్టిక్కర్ రూపొందించింది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి ఇళ్లకు స్టిక్కర్లు అంటించాలని నిర్ణయించింది. తద్వారా జనంలో జగన్ సంక్షేమం గుర్తుండిపోతుందని అలాగే ఈ స్టిక్కర్లను చూసిన వారికి జగన్ ఎంతమందికి లబ్ది చేకూరుస్తున్నారో కూడా తెలుస్తుందని వైసీపీ చెబుతోంది. అది ఎన్నికల్లో ఓట్లు రాలుస్తుందనేది వైసీపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రావాలి జగన్ కావాలి జగన్ పేరుతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ అధికారాన్ని చేపట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తాము చేసిన పనులను స్టిక్కర్ల రూపంలో ప్రజలకు గుర్తు చేస్తోంది. మళ్లీ జగన్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందనే రీతిలో వైసీపీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కళ్యాణ్ తేల్చిచెబుతున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జగన్ సర్కార్‌తో ఢీ అంటే ఢీ అంటోంది జనసేన. త్వరలోనే పవన్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. అటు టీడీపీ ఇటు జనసేనను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూనే ఇటు ప్రజల మనసు గెలుచుకునేందుకు జనం బాట పడుతోంది. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం ద్వారా జనంలోనే ఉంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అటు సీఎం జగన్ కూడా ఏఫ్రిల్ తర్వాత ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇరు పార్టీల పోటాపోటీ స్టిక్కర్ నినాదాలతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఎన్నికల నాటికి అది మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.