ఇప్ప‌టినుంచి ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌నంలోన ఫ్యాన్ పార్టీ

By KTV Telugu On 27 October, 2023
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో పాల‌క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌బోతోంది. ఎన్నిక‌ల ఏడాదిలో వీలైనంత ఎక్కువ‌గా జ‌నంతో మ‌మేకం అవ్వాల‌న్న అజెండాతో  వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోన్న వైసీపీ  అక్టోబ‌రు 26 నుండి సామాజిక సాధికార  యాత్ర పేరిట బ‌స్సు యాత్ర‌లు నిర్వ‌హించ‌డానికి  సిద్దం అయ్యింది.రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ ఒకే రోజు  మూడు బ‌స్సుల్లో ఈ యాత్ర‌ను ప్రారంభిస్తారు. సామాజిక సాధికార యాత్ర పేరుకు త‌గ్గ‌ట్లే ఈ యాత్ర లో మూడుప్రాంతాల్లోనూ  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ‌ర్గాల నేత‌లే యాత్ర‌లో కీల‌క పాత్ర పోషిస్తారు.మూడు ప్రాంతాల్లోనూ కీల‌క ప్రాంతాల  నుండి యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. డిసెంబ‌రు వ‌ర‌కు  జ‌గ‌ర‌బోయే యాత్ర‌లో రాష్ట్రంలోని 175 నియోజ‌క వ‌ర్గాల‌ను ట‌చ్ చేస్తూ యాత్ర‌లు సాగుతాయి.

కోస్తా ప్రాంతంలో తెనాలి..రాయ‌ల‌సీమ ప్రాంతంలో శింగ‌న‌మ‌ల‌…ఉత్త‌రాంధ్ర‌లో ఇచ్ఛాపురం  నుండి ఒకే రోజున  ఈ సామాజిక సాధికార యాత్ర ఆరంభం అవుతుంది. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలోనేకాదు  నామినేటెడ్ ప‌దవులు, నామినేటెడ్ ప‌నులు.. స్థానిక సంస్థ‌ల ప‌ద‌వులు వివిధ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న  న్యాయాన్ని  ఆ వ‌ర్గాల్లోకి బ‌లంగా తీసుకుపోవ‌డ‌మే ఈ యాత్ర‌ల ఉద్దేశంగా చెబుతున్నారు. గ‌తంలో వెనుక బ‌డిన వ‌ర్గాల్లో కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఏనాడూ ద‌క్క‌ని ప‌ద‌వులు త‌మ పాల‌న‌లో ద‌క్కాయ‌ని వివ‌రించి చెప్ప‌నున్నారు. త‌ద్వారా ఆయా వ‌ర్గాల మ‌న్న‌న‌లు పొంద‌వ‌చ్చున‌ని పార్టీ నాయ‌క‌త్వం భావిస్తోంది.

డిసెంబ‌రు నెలాఖ‌రు వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న యాత్ర‌ల‌కోసం మూడు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను రూపొందించారు. ఈ బ‌స్సుల‌కు ముందు వైపున  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్ గుర్తు కొట్టొచ్చేట్లు క‌న‌ప‌డేలా స్టిక్క‌రింగ్ చేశారు.దాని పైన సామాజిక సాధికార యాత్ర నినాదాన్ని  ఏర్పాటు చేశారు. మిగ‌తా మూడు వైపులా మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్  పేరుతో స్టిక్క‌ర్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన  ప్ర‌ముఖ నేత‌ల ఫోటోల‌ను సైతం  ఏర్పాటు చేశారు.మొద‌టి విడ‌త‌ న‌వంబ‌రు 9 వ‌ర‌కు సాగుతుంది. ప్ర‌తీ రోజూ  మూడు ప్రాంతాల్లోనూ  ఒక్కో చోట బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తారు. అంటే ఒకే సారి మూడు బ‌హిరంగ స‌భ‌ల చొప్పున నిర్వ‌హిస్తూ ఉంటారు. ఈ స‌భ‌ల్లో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన పార్టీ నేత‌లే  ప్ర‌సంగిస్తారు.

వై నాట్ 175 నినాదాన్ని  ప‌దే ప‌దే వినిపిస్తున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.దాన్ని  నిజం చేసుకోడానికే 175 నియోజ‌క వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను  తెలియ‌జేసేలా ప్ర‌చారం చేయ‌డం యాత్ర‌ల ఉద్దేశం. ఇంత అభివృద్ధి చేసిన పార్టీనే మ‌రోసారి అధికారంలోకి తెచ్చుకుంటే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేయ‌డం ఒక వ్యూహం.గ‌త ఏడాది మే నెల‌లో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్ర‌భుత్వం. అందులో పాల‌క ప‌క్ష ప్రజాప్ర‌తినిథులంతా త‌మ త‌మ నియోజ‌క వ‌ర్గాల్లో ఇంటింటికీ తిరిగి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాలు అంద‌రికీ అందుతున్నాయా లేదా అన్న‌ది స్వ‌యంగా ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.  ఒక‌టీ అరా విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఈ కార్య‌క్ర‌మానికి అనూహ్య స్పంద‌న వ‌చ్చింద‌ని పార్టీ చెప్పుకుంటోంది.

గ‌డ‌ప గ‌డ‌ప‌కీ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం హిట్ అయ్యింద‌ని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ భావిస్తోంది. దానికి కొన‌సాగింపుగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న  సామాజిక న్యాయం కూడా  త‌మ‌కి అందుతోంద‌ని ఆ వ‌ర్గాల‌కు చెందిన నేత‌ల ద్వారానే  ప్ర‌చారం చేయించ‌డం ద్వారా ఆ వ‌ర్గాల్లో న‌మ్మ‌కం పెంచి….వారి మ‌న‌సులు గెలుచుకోవాల‌ని ప్ర‌భుత్వం లెక్క‌లు వేసుకుంది. అయితే ఇది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో  చెప్ప‌లేక‌పోయినా  నిరంత‌రం పాల‌క ప‌క్షం ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవ్వాల‌నుకోవ‌డం మాత్రం మంచి ఆలోచ‌నే అంటున్నారు  రాజ‌కీయ పండితులు.అయితే  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన తెలుగుదేశంతో పాటు జ‌న‌సేన, సిపిఐ పార్టీలు మాత్రం అణ‌గారిన వ‌ర్గాల‌కు వైసీపీ ప్ర‌భుత్వంలో అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తున్నాయి. ఎస్సీ వ‌ర్గాల‌పై ఎన్న‌డూ లేని విధంగా దాడులు చేస్తూ వేధిస్తున్నార‌ని  విమ‌ర్శ‌లూ చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు కూడా  ఈ యాత్ర‌ను  వినియోగించుకోవాల‌ని  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ భావిస్తోంది.

రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో 77 శాతం ప‌ద‌వుల‌ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ‌ర్గాల‌కే   అప్ప‌గించిన వాస్త‌వాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్న‌ది   పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఆలోచ‌న‌గా చెబుతున్నారు.సామాజిక న్యాయంతో పాటే గ‌త ఎన్నిక‌ల్లో విడుద‌ల చేసిన మేనిఫెస్టోని య‌థాత‌థంగా అమ‌లు చేసిన తీరును కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల‌ని పార్టీ భావిస్తోంది.డిసెంబ‌రు నెలాఖ‌రు క‌ల్లా బ‌స్సు యాత్ర ముగిసేలా షెడ్యూలు రూపొందించారు. ఆ త‌ర్వాత మూడు నెల‌ల‌కే ఎన్నిక‌ల‌కు వ‌స్తాయి.ఆ మూడు నెల‌ల్లో మ‌రో కార్య‌క్ర‌మంతో జ‌నంలోకి వెళ్లాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు.

మొత్తానికి  ఇప్ప‌టి నుంచి ఎన్నిక‌ల న‌గారా మోగే వ‌ర‌కు  ఏపీలో పాల‌క ప‌క్ష నేత‌లంతా జ‌నం మ‌ధ్య‌నే ఉండేలా పార్టీ నాయ‌క‌త్వం  కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసేసింది. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ దీనికి డిజైన్ చేసింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి