జగన్ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం

By KTV Telugu On 4 January, 2023
image

ఏపీ అధికార పార్టీలో అసలేం జరుగుతోంది?ప్రత్యర్థుల కన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం జగన్‌ను భయపెడుతున్నారు. పార్టీ, ప్రభుత్వ తీరుపై కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు అధినాయకత్వాన్ని తలబొప్పి కట్టిస్తున్నాయట. ఎన్నికలకు ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలపై పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే పార్టీపై తిరుగుబాటు చేసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు అప్పట్నుంచి నిత్యం జగన్ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. పార్టీ, ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని రఘురామ కృష్ణం రాజు చెలరేగుతుండగా ఆయన ద్వారా ప్రతిపక్ష పార్టీలు జగన్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ దారిలోనే అన్నట్టు మరికొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉంది.

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. తాము ఏం మంచి పనులు చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామంటూ ఇటీవల ఆనం చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. రోడ్ల గుంతలు పూడ్చలేదు. ప్రాజెక్టులు కట్టలేదు. సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీ కన్నా ఎక్కువగా ఎత్తిచూపుతున్నారు ఆనం. ముందస్తు ఎన్నికలు వస్తే అంతా ఇంటికి పోవడం ఖాయమంటూ బాంబ్ పేల్చారు. పార్టీ వీడే ఉద్దేశంతోనే ఆనం ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో అలర్ట్ అయిన హైకమాండ్ ఆనంకు షాక్ ఇచ్చింది. వెంకటగిరికి ఇంఛార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది. దీంతో ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ నాయకత్వం దాదాపుగా పక్కనపెట్టినట్టు అయ్యింది. అయితే పార్టీపరంగా ఆయనపై వేటు వేస్తారా? లేదా ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇటీవల జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు, శాఖలు మారుతున్నాయి కలెక్టర్లు మారారు. కానీ పనులు మాత్రం జరగడం లేదంటూ కోటంరెడ్డి మండిపడ్డారు. రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల‌ మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తున్నారని ఆరోపించారు శ్రీధర్ రెడ్డి. తాను అందరు ఎమ్మెల్యేల్లాగా ఉండబోనని తాడోపేడో తేల్చుకుంటానన్నారు. ప్రజలకోసం ఎంతదూరం అయినా వెళ్తానని అన్నిటినీ మౌనంగా భరించే వ్యక్తిని మాత్రం తాను కాను అని చెప్పారు. నెల్లూరు రూరల్ లో రోడ్ల నిర్మాణంతో జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారని కూడా అన్నారు శ్రీధర్ రెడ్డి. దాంతో కోటంరెడ్డికి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లింది. ఏవైనా ఉంటే అంతర్గతంగా చూసుకోవాలని బహిరంగ విమర్శలు చేయవద్దని సీఎం నుంచి కోటంరెడ్డికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. తన మాటలు రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూడాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థించారు.

ఇక చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి పేద ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై వైసీపీ నేతలు టీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు తన ప్రచార యావ కోసం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని నరరూప రాక్షసుడని మండిపడుతున్నారు. బాబు సభలకు పర్మీషన్‌పైనా ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరులో జరిగిన ఘోరంపై స్పందిస్తూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవను రాజకీయ కారణాలతో విమర్శించడం మంచి పద్ధతి కాదని ఎన్నారైలను భయపెడితే ఎలా అంటూ గుంటూరు ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్‌ను వెనకేసుకొచ్చారు. శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడు అన్న వసంత అనుకోకుండా దుర్ఘటన జరిగిందని తెలిపారు. ఎన్ఆర్ఐలు వాళ్ల పని వాళ్లు చేసుకోవాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని ఇది సరికాదని వైసీపీ నేతలకే వసంత కౌంటర్ ఇచ్చారు. ఇలా చేస్తే అభివృద్ధిని ఆపడమే అవుతుందని అన్నారు. గుంటూరు ఘటనలో టీడీపీని అధికార పార్టీ నేతలు ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తుంటే సొంత పార్టీ సభ్యుడే ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నట్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.