ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయం మారిపోయింది. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కనీస పోటీ ఇవ్వలేకపోయారు. మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లు వస్తే అందులో ఏడు రాయలసీమలో వచ్చాయి. రెండు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. రెండు మాత్రం విశాఖ జిల్లాలో వచ్చాయి. ఈ రెండు మాత్రమే కోస్తా, ఉత్తరాంధ్రలో కలిపి వచ్చిన సీట్లు. ఆ రెండు కూడా అరకు, పాడేరు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. అయితే ఓటమి కాదు.. అసలు ప్రజలు కనీస ఓట్లు వేయకపోవడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఆ పార్టీ నేతలకు భవిష్యత్ కల్పిస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి భవిష్యత్ భయంపై భయం కలిగేలా చేశాయి. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి భవిష్యత్ ఉందా అన్నదానిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. అత్యంత ఘోరంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. జగన్మోహన్ రెడ్డి మనస్థత్వం ప్రకారం చూస్తే… ఆయన బయటకు వచ్చే అవకాశాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడే ఆయన భయం భయంగా గడిపారు. ఇప్పుడు ప్రజల మధ్య తిరిగేందుకు ఆయనకు ధైర్యం ఉండకపోవచ్చు. అంతకు మించి ఆయన ఓటమిని ఓటమిలాగా తీసుకునే అవకాశాలు లేవు. ఈ విషయాలను పక్కన పెడితే..జగన్ రెడ్డిని క్యాడర్ ఇంకా ఎంత నమ్ముతుందన్నది సందేహాస్పదంగా ఉంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కూటమి నేతల మెజార్టీలు చూస్తే వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. హయ్యస్ట్ మెజార్టీలు కూటమి అభ్యర్థులకు వచ్చాయి. ఉత్తరాంధ్రలో గాజువాక, భిమీలీల్లో 90వేలకుపైగా మెజార్టీలు వచ్చాయి. విశాఖ నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల మెజార్టీలు కూడా కళ్లు చెదిరేలా వచ్చాయి. బొత్స సత్యనారాయణ కంచు కోట అయిన చీపురుపల్లిలో చివరి క్షణంలో అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసినా ఇరవై వేల వరకూ మెజార్టీ వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరి మెజార్టీ పాతిక వేలకుపైగానే ఉంది. విజయనగరం, బొబ్బిలి వంటి నియోజకవర్గాల్లో ఈ ఆధిక్యాలు అరవై వేలకు దాటిపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క వార్డు విజయనగంలో రాలేదు. ఇక గోదావరి జిల్లాల సంగతి చెప్పాల్సిన పని లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏ ఒక్క స్థానంలోనూ వైసీపీ అభ్యర్థులు విజయానికి దగ్గరగా రాలేదు. ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉండే గుంటూరు తూర్పులో దాదాపుగా నలభై వేల మెజార్టీ రాగా.. లో బీజేపీ అభ్యర్థి సుజనాకు దాదాపుగా అంతే మెజార్టీ వచ్చింది. లోకేష్‌కు 90 వేల మెజార్టీ వచ్చింది. మొత్తంగా కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వైసీపీకి 30 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి.
ఫలితాలు వచ్చిన రెండు రోజులకే ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొంత మంది నేతలు జనసేన నాయకత్వంతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పాత పరిచయాలు, ఇతర రాజకీయ , వ్యక్తిగత సంబంధాలతో తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఈ ఐదేళ్లలో జరగనుంది. 2029 ఎన్నికల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతాయి. అంటే కనీసం యాభై అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. జనసేన పార్టీకి అభ్యర్థుల కొరత ఉంటుంది. నిజానికి ఇప్పటికీ జనసేన పార్టీకి పెద్దగా నేతలు లేరు. అందుకే గత ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ నేతల్ని చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అవకాశాల్ని ముందుగా అందిపుచ్చుకోవడానికి చాలా మంది రెడీ అవుతున్నారు. వచ్చే ఒకటి, రెండు నెలల్లో .. జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉండే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి.
వైసీపీ క్యాడర్ ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే జగన్ రెడ్డికి వచ్చిన ఘోర పరాజయానికి భవిష్యత్ ఒక్క పదవి కూా రాదు. గతంలో ఓడిపోయినా అరవై మందికిపైగా ఎమ్మెల్యేలు ఉండేవారు. ఎమ్మెల్సీ పదవులు వచ్చేవి.కానీ ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో రాజ్యసభ కాదు కదా ఎమ్మెల్సీ కూడా రాదు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహించాలో జగన్ రెడ్డి చూపించారు కాబట్టి… పార్టీ క్యాడర్ కూడా పోటీ చేయడానికి జంకే పరిస్థితులు ఉంటాయి. ఈ సవాళ్లను అధిగమించడం అంత తేలిక కాదు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోంది. ఇలాంటి సమయంలో ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిలకు ఎంతో మంచి అవకాశం వచ్చినట్లే. ఆమె పూర్తి స్థాయిలో వైఎస్ కుమార్తె తరహా రాజకీయం చేస్తే వైసీపీ క్యాడర్ ను తమ పార్టీలోకి తీసుకుంటే… క్రమంగా వైసీపీ బలహీనపడుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…