ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అందర్నీ దూరం చేసుకున్నారా… లేకపోతే వాళ్లే దూరమయ్యారా అన్న సంగతి పక్కన పెడితే ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ ఒంటరి పోరాటం రాజకీయంగానే కాదు కుటుంబ పరంగా కూడా. గత ఎన్నికల్లో ఆయన కోసం పని చేసిన వారిలో 80 శాతం మంది సైలెంట్ గా ఉండటమో లేకపోతే టీడీపీ కూటమి కోసం పని చేయడమో చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ తాను గెలుస్తానని జగన్ నమ్మకంగా ఉన్నారు. నిజంగా ఆయన గెలిస్తే మాత్రం తిరుగులేని లీడర్ అనుకోవచ్చు. ఆయనకు ఇక ఎదురు ఉండకపోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీ పోరు సాగుతోంది. రాజకీయాల్లో బలం, బలగం కీలకం. ఒక్క వ్యక్తి ఎంత బలవంతుడైనా రాజకీయాలకు ఆ బలం సరిపోదు. ఎందుకంటే పది మంది కలిస్తేనే బలం పెరిగేది రాజకీయం. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆనేక శక్తులు పని చేస్తున్నాయి. ఒక్కడిపై యుద్ధానికి అందరూ కలిసి వస్తున్నారు అని జగన్ అంటున్నారు. అది నిజం కూడా. జగన్ ఇప్పుడు ఒంటరి. ఎందుకంటే 2019లో పక్కన ఉన్నవాళ్లు ఇప్పుడు ఎవ్వరూ లేరు. పీకే లేడు. షర్మిల లేదు. ప్రముఖ ఎంపీలు, ఊపు తెచ్చిన మాగుంట వేమిరెడ్డి లాంటోళ్లు లేరు. తనకు స్వచ్చందంగా మద్దతిచ్చిన ఎంతో దూరమయ్యారు. పరోక్షంగా సహకరించిన వారూ కనిపించడం లేదు. కుటుంబంలోనూ ఆయనకు మద్దతు లేకపోవడం.. అతి పెద్ద మైనస్.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన వెంట అందరూ ఉన్నారు. తల్లీ విజయలక్ష్మి, చెల్లి షర్మిల కలసికట్టుగా ప్రచారం చేశారు. కుటుంబం అంతా వెంట ఉంది. వివేకా హత్య సమయంలో సునీత కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడారు. ఇక పరోక్షంగా ఎంతో మంది సాయం చేశారు. అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులు ఆయనతో టచ్ లో ఉండేవారు. మీరు అధికారంలోకి రావాలి సర్ అని ఆయన వెంట పడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అధికారంలోకి రాక ముందే ఆయనను పల్లకీలో ఊరేగించిన వారు ఉన్నారు. వారంతా ఇప్పుడు జగన్ కు దగ్గరగా లేరు. వారే కాదు ఎంతో మంది ఆత్మీయులు జగన్‌కు దూరం వెళ్లిపోయారు. వ్యతిరేకమయ్యారు. వెళ్లిపోయారు అనడం కన్నా దూరం చేసుకున్నారు అనుకోవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ పెద్దగా ఉన్ననప్పుడు ఉన్నప్పుడు యొదుగూరి సందింటి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తే బయటకు రాలేదు. ఇప్పుడు కుటుంబం రెండు వర్గాలుగా చీలి ఎలా ఆరోపణలు చేసుకుంటున్నారో కళ్ల ముందే ఉంది. కుటుంబం.. పార్టీ .. ఆత్మీయులు.. కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా దూరమయ్యారు.
తనకు దగ్గరగా ఉన్న వారిని దూరం చేసుకోవడం ఒకటి అయితే తన ప్రత్యర్థుల్ని ఏకం చేసేందుకు రాజకీయ వ్యూహాలు పన్నడం జగన్మోహన్ రెడ్డి చేసిన మరో రాజకీయం. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేసి.. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను ఓడించాలని.. పట్టుదలతో ఓట్లు చీలకూడదన్న లక్ష్యంతో పొత్తులు ఖరారు చేయించారు. ఫలితంగా గత ఎన్నికల్లో పరోక్షంగా సహకరించిన బీజేపీ కూడా ఇప్పుడు దూరం అయింది. టీడీపీతో జత కట్టింది. ఐదేళ్లుగా బీజేపీకి ఎంత సహకారం ఇచ్చినా టీడీపీతో జత కట్టడానికి బీజేపీ ఏ మాత్రం ఆలోచించలేదు. రాజకీయంగా తనను విబేధిస్తున్న వారు అంతా ఏకమయ్యారు. సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని జగన్ ను ఓడించడమే లక్ష్యంగ ాపని చేస్తున్నారు.
అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మందిని దూరం చేసుకున్నారు.. అలాగే ప్రత్యర్థులు ఏకమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను దూరం చేసుకోకపోతే జగన్ కు వచ్చే నష్టమేం లేదు. తన పాలన ద్వారా ఓటర్లకు దగ్గరయ్యానని ఆయన అనుకుంటున్నారు. కానీ మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ నమ్మకం కూడా ఉత్తదేనని తేలింది. కానీ తమ ఓటర్లు వేరేనని చెప్పుకుని .. అసలు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.
ఓటర్లు దూరమయ్యారా లేదా అన్నది ఎన్నికల్లో తెలుతుంది. కానీ ఆయన వైపు ప్రజలు ఉన్నారని ఫలితం వస్తే మాత్రం.. ఆయనను మించిన బలమైన నేత ఉండరు. ఎందుకంటే.. ఓ వైపు చంద్రబాబు, పవన్, మోదీ, షర్మిల అందరూ కలిసి ఓడించేందుకు గెలిస్తే.. ఏపీ వరకూ ఆయనను మించిన బలవంతుడు లేడనే కదా అర్థం. ఇంత మంది సమూహాన్ని ఎదుర్కొని గెలిచిన తర్వాత జగన్ ఇమేజ్ కూడా అమాంతం పెరుగుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…