వైసీపీకి ఎదురు గాలి వీస్తోందా?-YSRCP-Leaders-Against-CM-Jagan Mohan Reddy

By KTV Telugu On 27 February, 2024
image

KTV TELUGU :-

కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు కోలుకోలేని షాకే అంటున్నారు రాజకీయ పండితులు. సిద్దం సభలతో దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో టికెట్ల విషయంలో అసంతృప్తితో రగులుతోన్న  ఎంపీలు పార్టీని వీడ్డం  రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేతలు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో   టిడిపి తరపున బరిలో దిగుతారని అంటున్నారు. ఇది వైసీపీకి ఎదురు దెబ్బే అని చెప్పక తప్పదు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో కొన్ని చోట్ల  సమన్వయ కర్తలను మారుస్తున్నారు. కొన్ని చోట్ల సిటింగులను వేరే నియోజక వర్గాలకు మారుస్తోంటే..కొన్ని చోట్ల  టికెట్లే లేవని స్పష్టం చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు  నేతలు పార్టీ నాయకత్వం వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, నరసరావు పేట ఎంపీ లావు కృష్ణ దేవరాయాలు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ లు పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కూడా పార్టీ వీడారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొంత కాలానికే పార్టీ నాయకత్వానికి దూరమైన  నరసాపురంఎంపీ రఘురామ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున బరిలో దిగాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

లావు కృష్ణ దేవరాయలకు చంద్రబాబు నుంచి భరోసా వచ్చినట్లు చెబుతున్నారు. బాలశౌరికి టిడిపి తరపున కానీ జనసేన తరపున కానీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రఘురామ కృష్ణం రాజు కూడా తాను టిడిపి,జనసేన,బిజెపిల్లో ఏదో ఒక పార్టీ తరపున నరసాపురం నుంచే పోటీ చేస్తానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇస్తుందనేది  ఇంత వరకు తేలలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కు  ఏ పార్టీ నుండి టికెట్ కి భరోసా వచ్చినట్లు లేదు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఆయన పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే  అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఎంపీలే కాదు  టికెట్ రాని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  ఎమ్మెల్యేలు కూడా  టిడిపి-జనసేనల వైపు చూస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ  జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అనకాపల్లికి చెందిన దాడి వీరభద్రరావు వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరగా  కొలుసు పార్ధసారధి కి  టిడిపి నూజివీడు నుండి టికెట్ ఖరారు చేసేసింది. ఇలా పార్టీని వీడిన వారితో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం ఉండి తీరుతుంది. అది టిడిపికి ఎంత అడ్వాంటేజ్ అవుతుందన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇటు అసంతృప్తి నేతలు పార్టీని వీడ్డం ఒక తలనొప్పి అయితే..జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరి జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం అయిన టిడిపిని మించిపోయి షర్మిల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పార బడుతున్నారు. తన తండ్రి హయాంలో అమలైన సంక్షేమ పథకాలను తన సోదరుడు  మంటగలిపారని ఆమె ఇప్పటికే ఆరోపించారు. ఏపీని పూర్తిగా అప్పుల్లో ముంచేశారని జగన్ మోహన్ రెడ్డిపై ఆమె విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో చెప్పుకోడానికి ఒక్క అభివృద్ధికూడా జరగలేదన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తాను ఏపీలోనే ఉంటానని కేంద్రంపై పోరాడతానని షర్మిల భీష్మించుకుని ఉన్నారు. షర్మిల ఎపిసోడ్  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మైనస్సే అంటున్నారు రాజకీయపరిశీలకులు.

వై నాట్ 175 అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. వై నాట్ పులివెందుల అంటున్నారు చంద్రబాబు నాయుడు. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపి తీరతామని శపథం చేశారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తామని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని షర్మిల అల్టిమేటం జారీ చేశారు. వీటన్నింటినీ అధిగమించి జగన్ మోహన్ రెడ్డి తన పార్టీని ఎన్నికలకు ఏ మేరకు సన్నద్ధం చేస్తారు? ఎన్నికల్లో ఏ మేరకు విజయాలు సాధిస్తారన్నది చూడాలంటున్నారు రాజకీయ పండితులు. టిడిపి-జనసేన కూటమి మాత్రం రాబోయేది తమ ప్రభుత్వమే అంటోంది. ఆ విషయంలో చంద్రబాబు కూడా చాలా ధీమాగా ఉన్నారు.మరి ఏపీ ఓటర్లు ఏం అనుకుంటున్నారన్నదే ముఖ్యం..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి