సీఎం జగన్ కోరిక నెరవేరలేదు. వైసీపీ అనుకున్నది జరగలేదు. చంద్రబాబును జైల్లో పెట్టి ఏదో సాధించామన్న ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. చంద్రబాబు అవినీతిపరుడని నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని తెలిపోయింది. దానితో ఇప్పుడు వైసీపీ రూటు మార్చాల్సి వస్తోంది. అది వారి స్వయంకృతాపరాథం, అదీ వారి అనివార్యత
డైవర్షన్ కోసం చేశారో.. కసి కొద్ది చేశారో… మొత్తానికి జగన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. చంద్రబాబును అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చి రిమాండ్ వేయించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అవినీతి జరిగిందని నిరూపించేందుకు చేసిన ప్రయత్నంలో ఏదో లింక్ లోపించిందని మాత్రం జనానికి అర్థమైపోయింది. ఎక్కడా చంద్రబాబు పేరు లేకపోవడం, తొలుత వచ్చిన ఎఫ్ఐఆర్లో కూడా మాజీ సీఎం పేరు లేకపోవడంతో చంద్రబాబు అభిమానులకే కాదు.. ఆయన వ్యతిరేకులకు కూడా అనేక అనుమానాలు మొదలయ్యాయి. మసి పూసి మారేడు కాయ చేసి కేసు వేసే ప్రయత్నంలో అనేక పర్యాయాలు తప్పులో కాలేసిన జగన్ సర్కారు.. పంతం పట్టి చంద్రబాబును అరెస్టు చేసినట్లుగానే ఉంది. టీడీపీ అధినేత తప్పు చేశారని సగటు ఓటరును వైసీపీ కన్విన్స్ చేయలేకపోతోంది.
జగన్ మొండి వాడు కావచ్చు. ఆయన మొండిగా ముందుకు సాగి చంద్రబాబును అరెస్టు చేయించి ఉండొచ్చు. వైసీపీ కేడర్లో మాత్రం అందరూ మొండివాళ్లు కాదు. జనం ఏమనుకుంటున్నారన్న భయం వారిలో కాస్తో కూస్తో ఉండనే ఉంది. జగన్ ఆయన చుట్టూ ఉన్న వాళ్లు తప్పు చేశారని క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలకు అనుమానమూ, భయమూ కలుగుతోంది. చంద్రబాబు అరెస్టుపై వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటుందనుకోలేదని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. చంద్రబాబును ఒక్క రోజైనా జైల్లో పెట్టాలన్న జగన్ లక్ష్యం మేరకు అరెస్టు చేశారన్న చర్చ మామూలు జనం కంటే వైసీపీ శ్రేణుల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది.
చంద్రబాబు విచారణ వీడియోలు, జైలులోకి వెళుతున్న ఫోటోలు బయటకు రావడం వల్ల చంద్రబాబుకు మరింత సింపతీ వచ్చిందని వైసీపీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. మొత్తం ఎపిసోడ్లో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని వైసీపీలో గుబులు పెరుగుతోంది. కక్షతోనే అరెస్టు చేశారనేది బాగా ఎస్టాబ్లిష్ అయ్యిందని కూడా వాళ్లు విశ్వసిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలు, శ్రేణులు ఏకమొత్తంగా బయటకు వచ్చారు. ఐకమత్యాన్ని ప్రదర్శిస్తూ చంద్రబాబుకు సంఘీభావంగా నిరసనలు చేపట్టారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ ను విఫలం చేసేందుకు పోలీసులు, వైసీపీ శ్రేణులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. పైగా బంద్ కు జనసేన, వామపక్షాలు, సామాన్య ప్రజలు మద్దతు పలకడంతో వైసీపీకి దిమ్మ తిరిగినట్లయ్యింది. జనంలో చంద్రబాబు ఇమేజ్ పెరిగిందని సగటు వైసీపీ శ్రేణులు కూడా నమ్ముతున్నట్లు తెలియడంతో వారిని దారికి తెచ్చుకునేందుకు పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలకు తెరతీయాల్సి వస్తోంది. ఇప్పుడు వాళ్లు రెండు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబును ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకూల మీడియాతో వార్తలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు జాతకం బాగోలేదని ప్రచారం చేయడం మరో వ్యూహం. టీడీపీ అధినేతకు మరో రెండేళ్ల పాటు టైమ్ బాగోలేదని, విజయవాడలో ఇంటి వాస్తు బాగోలేదని అందుకే అరెస్టయ్యారని కూడా వార్తలు రాయిస్తున్నారు.
వైసీపీ అగ్రనేతలకు పెద్ద సమస్య వచ్చి పడింది. చంద్రబాబును జైలు నుంచి బయటకు రాకుండా చూడడం కంటే.. వైసీపీ శ్రేణుల్లో మనోధైర్యం దెబ్బకునకుండా గేమ్ ఆడాల్సిన అనివార్యత వారిలో ఉంది, టీడీపీ శ్రేణులు దెబ్బతిన్న పులుల్లా ఎగబడుతుంటే… వైసీపీ జనం బక్కచిక్కి డిఫెన్స్ లో పడిపోయి ఉన్నారు. చంద్రబాబు ఎపిసోడ్ వల్ల క్షేత్రస్థాయిలో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రచారం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.. టీడీపీ శ్రేణుల ఆగ్రహం, ఉత్సాహం రోడ్ల మీద కనబడకుండా చేయాలి.. మరి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం అందుకు ఉపయోగపడుతుందో లేదో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…