దాడికి ప్రతి దాడే కరెక్టు సమాధానం. ఒకటి అంటే రెండు అనడమే కరెక్టు. ఇదీ రాజకీయాల్లో న్యూటన్ మూడో సిద్ధాంతం. అయితే చెబుతున్నది కరెక్టు సమాధానమా, ఇష్టం వచ్చిన సమాధానమా అంటే మాత్రం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతీ దాడి ఎటు వైపు నుంచైనా, ఎలాగైనా రావచ్చు. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు జరుగుతున్నదీ అదే.
సీఎం జగన్ పై ఆయన సోదరి షర్మిల ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. జగనన్న గారు అంటూనే తూర్పార పట్టేస్తున్నారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఏకరవు పెడుతున్నారు. ధర్నాలు నిర్వహిస్తున్నారు. చలో సెక్రటేరియట్ అంటూ నిరసనలతో నానా యాగీ చేస్తున్నారు. ఇవన్నీ షర్మిల సొంత తెలివితేటలు కాదని, ఎవరో బయట నుంచి చేయిస్తున్నారని టీమ్ జగన్ విశ్వసిస్తోంది. కొన్ని రోజులు మౌనంగా ఉన్నా ఇప్పుడిక వదిలిపెట్టకూడదని వైసీపీ నిర్ణయించింది. తమ ఫైర్ బ్రాండ్ టీముకు బాధ్యత అప్పగించింది. అవసరాన్ని బట్టి ఏదో అంశంలో స్పందించాలని రోజా, కొడాలి నాని లాంటి వారికి సూచనలిచ్చినట్లుగా చెబుతున్నారు. వాళ్లయితేనే షర్మిలను, చంద్రబాబును కలిపి తిట్టెయ్యగలరన్న విశ్వాసంతోనే బాధ్యతలు అప్పగించినట్లున్నారు. టీడీపీ,జనసేన, కాంగ్రెస్ ను మడతపెట్టెయ్యాలని ఆర్డర్స్ అందాయి. ఇప్పుడు కార్యాచరణ మొదలైనట్లేనని చెప్పుకోవాలి….
విమర్శించాలంటే విమర్శించాలి. రోజాలాంటి వారికి పెద్దగా టాపిక్ అవసరం లేదంతే. జగనన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామన్న ఫీలింగు కల్పించడమే రోజా ఉద్దేశం. అందుకోసం ఉచ్చనీచాలు వదిలేసి రోజా ఏదోకటి మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది..
రోజాకు మంత్రి పదవి రాకముందే ఎగిరెగిరి పడుతుండేవారు. పదవి వచ్చిన తర్వాత ఇక ఆమె రెచ్చిపోతున్నారనే చెప్పాలి. ఇప్పుడామె వైఎస్ కుటుంబ ఆస్తి వ్యవహారాలు జగన్ – షర్మిల మధ్య పంపకాలపై కామెంట్లు చేసేస్తున్నారు. షర్మిల ఎందుకు ఏపీకి వచ్చారో అందరికీ తెలుసని ఆరోపణలు సంధిస్తున్నారు. ఆస్తులు, అప్పులు.. అనేవి సీఎం జగన్, షర్మిల మధ్య లేనే లేవు. షర్మిలకు సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు. దివంగత వైఎస్సార్ జీవించి ఉన్నప్పు డే.. వీరికి ఆస్తులు పంచి ఇచ్చేశారు. ఈ విషయం మీడియా తెలియకపోయినా.. సీమ వాసులుగా మాకు తెలుసు. పత్రిక, మీడియాల్లో ఆమెకు వాటా లేదు. అవి సీఎం జగన్ సొంత వ్యాపారాలు అని రోజా వ్యాఖ్యానించారు. నిజానికి షర్మిల ఎక్కడా ఆస్తుల వ్యవహారం తీసుకు రాలేదు. ఏదోక రోజున అవే సర్దుకుంటాయని ఆమె అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు.ఆమె అన్నదల్లా తనకు కూడా సాక్షి మీడియాలో వాటా ఉన్నదని మాత్రమే. దానికి వేరే లెక్క ఉంది. సాక్షి మీడియా తన వార్తలను ప్రసారం చేయడం లేదన్న ఆగ్రహం అందులో ఉండి ఉండొచ్చు. రోజాకు మాత్రం ఆ సంగతి అర్థం కాక వైఎస్ ఆస్తులపై కామెంట్లు మొదలు పెట్టేశారు. ఈ విషయంలో కూడా రోజా సొంత పెత్తనం చేశారన్న చర్చ వైసీపీ వర్గాల్లో కలుగుతోంది. షర్మిలపై విమర్శలు చేయాలన్న ఆదేశాలు మాత్రమే రోజాకు అందాయి. దానికి రోజా కాస్త ఓవరాక్షన్ జోడించారన్న చర్చ జరుగుతోంది. అవసరానికి మించి మాట్లాడి ఇప్పుడు లేని సమస్యలు సృష్టించారని తాను షర్మిలతో సమానమని చెప్పుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నిజానికి షర్మిల కౌంటర్ అటాక్ మొదలు పెడితే రోజా తట్టుకోలేకపోవచ్చు.షర్మిల ఒక సారి మొదలు పెడితే ఇక రోజువారీ కోటింగ్ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు బయటకు తీసుకొచ్చి మరీ విమర్శలు సంధిస్తారు. ఆ సంగతి రోజాకు అర్థమైందో లేదో…పైగా రోజా అనవసరంగా తెలంగాణ వ్యవహారాలు ప్రస్తావిస్తున్నారు.
షర్మిల అధికారంలో లేరు, ఆమె ఎవరి మీదయినా విమర్శలు చేయగలరు. వైసీపీ అధికారంలో ఉంది. అధికారం అద్దాల మేడ లాంటిది. అద్దాల మేడలో కూర్చున్న వాళ్లు రోడ్డున పోయే వాళ్ల మీద రాళ్లు వేయకూడదు. ఎందుకంటే వాళ్లు తిరిగి రాళ్లు విసిరితే ఆ అద్దాల మేడ కూలిపోవడం ఖాయం. రోజా లాంటి వాళ్లు ఆ సంగతి గ్రహిస్తే మంచిది, లేదంటే కథ వేరుగా ఉంటుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…