జగన్ సోషల్ ఇంజనీరింగ్ వర్కవుట్ అవుతుందా? – YSRCP – TDP – JSP – BJP -Modi – CM Jagan – BABU – Pavan

By KTV Telugu On 19 March, 2024
image

KTV TELUGU :-

ఎన్నికల నగారా మోగడానికి ముందే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్   పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్ధుల జాబితాను ఒకే సారి విడుదల చేసింది. ఒక్క అనకాపల్లి లోక్ సభ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 175 అసెంబ్లీ 24 లోక్ సభ స్థానాల అభ్యర్ధులను ప్రకటించేశారు. జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే సామాజిక న్యాయానికి అనుగుణంగానే  అభ్యర్ధుల ఎంపిక చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తం మీద సగానికి సగం స్థానాలను బడుగు వర్గాలకే కేటాయించి ఒక విధంగా సాహసానికి పూనుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. గతంలో ఏ రాజకీయ  పార్టీ కూడా బహుజనులకు ఇన్ని స్థానాలు కేటాయించలేదు.

సమాజంలో మెజారిటీగా ఉన్న బడుగు వర్గాలకు ప్రాధాన్యతనిస్తే  వారు తమ పార్టీ వెన్నంటే ఉంటారని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుంది. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత  స్థానిక ఎన్నికల్లో, నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పనుల్లో  బడుగు వర్గాలకు  అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు రాజ్యసభ స్థానాల్లో  బహుజనులకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఇపుడు ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికలోనూ ఇదే సూత్రాన్ని అమలు చేశారు.

బడుగు వర్గాల ఓట్లు గంప గుత్తగా వైసీపీకే పడాలన్న  ఆశ ఈ  నిర్ణయం వెనుక ఉండి ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. అయితే జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారా? అంటే ఇపుడే చెప్పలేం అంటున్నారు వారు.

ఏపీలో 175 అసెంబ్లీ నియోజక వర్గాలు 25 లోక్ సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 200 మంది అభ్యర్ధులు ఆ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతారు. ఇందులో బడుగు బలహీన వర్గాలకు సగం వాటా ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే ..ఎంపీ స్థానాలు కలుపుకుని బీసీలకు 59 స్థానాలు  కట్టబెట్టారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 41 స్థానాలు కేటాయించారు. మొత్తం మీద 200 స్థానాల్లో 100 స్థానాలు  బహుజనుల అభ్యర్ధులకు అవకాశాలు కల్పించి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఏపీలోనే కాదు ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇన్ని స్థానాలు కేటాయించనే లేదు.

సామాజిక సమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి మహిళలకూ గత ఎన్నికలకంటే ఎక్కువ స్థానాలు ఇచ్చారు. సామాజిక న్యాయాన్ని మాటల్లో అందరూ చూపిస్తారని..కానీ తాము చేతల్లోనూ చూపిస్తున్నామని జాబితాల విడుదల సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎనభైలలో ఎన్టీయార్ బీసీలకు పెద్ద పీట వేశారు. అందుకే  బీసీలు టిడిపి వెన్నంటి ఉండేవారు. అయితే  చంద్రబాబు నాయుడి హయాం వచ్చాక బీసీలకు ప్రాధాన్యత తగ్గిందన్న  విమర్శలు ఉన్నాయి. ఈ  తరుణంలోనే జగన్ మోహన్ రెడ్డి బీసీలపై దృష్టి సారించి వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పేరుతో ఏం చేసినా.. బీసీలు తమకే అండగా ఉంటారని టిడిపి నాయకులు అంటున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిందే టిడిపి అన్న సంగతిని బీసీలు ఎప్పటికీ మరచిపోరని టిడిపి అంటోంది. అయితే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత గత అయిదేళ్లలో ఏపీలో జరిగిన అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప  ఎన్నికల్లోనూ బీసీలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచినట్లు ఫలితాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు తిరిగి టిడిపి వైపు తరలి వచ్చేస్తారని  టిడిపి నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

బహుజనులకు 50 శాతం వాటా ఇచ్చిన జగన్  81 అసెంబ్లీ 18 లోక్ సభ నియోజక వర్గాల్లో అభ్యర్ధులనూ మార్చారు. ఇది సాహసమే అంటున్నారు రాజకీయ పండితులు.టిడిపి-జనసేనలు బిజెపితో జట్టు కట్టడంతో మైనారిటీ వర్గాలు  కూటమికి ఓటు వేసే పరిస్థితే ఉండదని   రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

బిజెపితో జట్టు కట్టడం వల్ల ముస్లింలు, క్రైస్తవులు కూటమికి దూరం జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అయితే దీన్ని  కమలనాథులు ఖండిస్తున్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ హయాంలో జరగని సంక్షేమం తమ హయాంలోనే జరిగిందని.. అంచేత ఆ వర్గాలు కూడా తమకే మద్దతు ఇస్తాయని బిజెపి నేతలు అంటున్నారు. మొత్తం మీద సోషల్ ఇంజనీరింగ్ తో  బహుజనుల మనసులు దోచే ప్రయత్నం అయితే చేశారు జగన్ మోహన్ రెడ్డి.   దీన్ని టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఎలా తిప్పికొడుతుందో చూడాలంటున్నారు రాజకీయ పండితులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి