పవన్‌కల్యాణ్ సిన్మాల్లోనే స్టార్. రాజకీయాల్లో కాదు. విమర్శలు చేస్తూనే అప్పుడప్పుడూ వైసీపీ నేతలు ఇచ్చే కితాబు ఇది. వాళ్లదాకా ఎందుకు పాలిటిక్స్‌లో తనది ఫెయిల్యూర్ స్టోరీ అని ఆమధ్య పవర్‌స్టారే స్వయంగా ఒప్పుకున్నారు. సేమ్ టైమ్ అది విజయానికి సగందూరం ప్రయాణమని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అన్నలాగే తన రాజకీయజీవితం అర్ధంతరంగా ముగిసిపోకూడదన్న పట్టుదలైతే పవన్‌కళ్యాణ్‌లో ఉంది. అందుకే ఆవేశపడిపోకుండా ఆలోచనలు చేస్తున్నారు. వారాహిని సిద్ధంచేసి 2023 జనవరినుంచి జనంలోనే ఉండబోతున్నారు. వారాహి కాదు నారాహి అంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు ప్రయోజనాలకోసమే పవన్‌కళ్యాణ్ పనిచేస్తున్నారని దెప్పిపొడుస్తున్నారు.
అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోలేదు జనసేనాని. పైగా విశాఖలో ప్రధాని మోడీతో మీటింగ్ తర్వాత కమలంతో అనుబంధం ఇంకాస్త పెరిగింది. అదే సమయంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఫోకస్పెట్టింది. పార్టీలకతీతంగా జరుగుతున్న కాపునాడు కూడా పవన్‌కళ్యాణ్ నాయకత్వానికి మద్దతిస్తోందన్న సంకేతాలున్నాయి. సీఎం అభ్యర్థిగా పవన్‌కళ్యాణ్‌ని తెరపైకి తేవడం బీజేపీకి అనివార్యమయ్యేలా ఉంది.
175 సీట్లు కొట్టాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గుండుసున్నాయేనంటోంది. పోయినసారి 23 సీట్లొచ్చిన టీడీపీకి ఈసారి ప్రాతినిధ్యమే ఉండదన్నంత నమ్మకం ఉన్నప్పుడు ఒకే సీటు గెలిచిన జనసేన గురించి అంత గుబులెందుకు? ఆ గెలిచిన సీటు కూడా వైసీపీ తలుపుతట్టింది. పోటీచేసిన రెండుసీట్లలో పవన్‌కల్యాణ్ ఓడిపోయారు. అయినా తరచూ పవన్‌కల్యాణ్‌ని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ హైప్ పెంచుతోంది. 175 సీట్లలో పోటీచేస్తానని జనసేనాని చెప్పగలరా అని సజ్జల ప్రశ్నిస్తున్నారు. బీజేపీతోనో, టీడీపీతోనో పొత్తు కుదిరితే అన్ని సీట్లలో పవన్‌కళ్యాణ్ పార్టీనే ఎలా పోటీచేస్తుంది?
ఇళ్లు కూలిస్తే పవన్‌కళ్యాణ్ పరిహారమిచ్చారు. కౌలురైతులకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అన్న నినాదంతో జనంలోకి వెళ్లబోతున్నారు. సీఎం అభ్యర్థి ఆయనేనని పొత్తుపెట్టుకునే పార్టీలు ప్రకటించాయంటే కాపు ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి. ఎప్పుడూ వేరేవారి పల్లకీ మోయడమేనా? మనం కూర్చునేదెప్పుడన్న సంఘర్షణ కాపుల్లో మొదలైంది. యువత, మహిళల ఓట్లు కలిసొస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకుంటే గెలుపు గుర్రం ఎక్కొచ్చనుకుంటున్నారు గబ్బర్‌సింగ్. కాస్త తిక్కుందేమోగానీ వచ్చే ఎన్నికలపై ఆయన లెక్క ఆయనకుంది. పదేపదే పవన్‌ని టార్గెట్ చేయడం ద్వారా ఆయనే ప్రధాన ప్రత్యర్థి అన్నట్లు వైసీపీ భయపడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.