యాత్ర‌కు ముగింపున‌కు షార్ట్ క‌ట్

By KTV Telugu On 9 December, 2023
image

KTV TELUGU :-

లోకేష్ పాదయాత్రను వీలైనంత త్వరగా  ముగించేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. ముందుగా అనుకున్న విధంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా యాత్ర చేయకుండా విశాఖ జిల్లా భీమిలితోనే యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టేసి మమ అనిపించాలని డిసైడ్ అయిపోయారు. ముగింపు సభకు చంద్రబాబు తో పాటు, పవన్  కళ్యాణ్ కూడా హాజరవుతారని  చెబుతున్నారు. యాత్ర ఎక్కువ కాలం కొనసాగించడానికి లోకేష్ కూడా ఆసక్తి చూపకపోవడం..యాత్రకు  అనుకున్నంత‌గా  స్పందన రాకపోవడంతో యాత్రకు ముగింపు వాక్యం పలకాలని నిశ్చయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పాదయాత్రల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తానని చెప్పి నారా లోకేష్ ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు.ఆదిలోనే హంసపాదులా యాత్రకు శ్రీకారం చుట్టిన రోజునే  లోకేష్ కు మద్దతుగా  వచ్చిన  సినీ నటుడు నందమూరి తారక్ గుండె పోటుతో  కుప్పకూలిపోయారు. ఆయన్ను బెంగళూరు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినా లాభం లేకపోయింది. ఈ విషాద ఘటనతో ఆరంభమైన యాత్రకు మ‌ధ్య‌లో కొంత ఆద‌ర‌ణ క‌నిపించినా  రాను రాను అది త‌గ్గిపోయింది.400రోజుల పాటు నిర్వహించే పాదయాత్రలో నాలుగువేల కిలోమీటర్ల దూరం యాత్ర చేయాలన్నది  టిడిపి  ప్లాన్.

రాయలసీమ లో మొదలైన యాత్రకు జనం రాకపోవడంతో ఓ దశలో  ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు చిత్తూరు జిల్లా పార్టీ నేతలకు ఫోన్ చేసి లోకేష్ యాత్రకు అస్సలు జనం రావడం లేదు..పెద్దాయన బాధ పడుతున్నాడు..మీరంతా ఏం చేస్తున్నారు? అంటూ  క్లాస్ పీకారు. జనాన్ని తరలించడానికి డబ్బులు ఇస్తున్నాం సార్..రేపట్నుంచీ చూడండి అదిరిపోతుందని ఆ నాయకుడు అచ్చెన్నకు  భరోసా ఇచ్చాడు. అయితే  ఆ తర్వాత కూడా యాత్రకు ఎక్కడా స్పందన లేకపోయింది.నిజానికి యువ‌గ‌ళం యాత్ర తో లోకేష్ లో చాలా మార్పు వ‌చ్చింది. రాజ‌కీయంగానూ ప‌రిణ‌తి వ‌చ్చింది. గ‌తంతో పోలిస్తే ఆయ‌న అన్ని విష‌యాల‌పైనా అవ‌గాహ‌న‌తో మాట్లాడుతున్నారు. కాక‌పోతే జ‌న‌మే అనుకున్నంత‌గా రాలేద‌న్న‌ది టిడిపి వ్యూహ‌క‌ర్త‌ల భావ‌న‌.

రోజులు గడిచే కొద్దీ అయినా యాత్రకు స్పందన పెరుగుతుందని ఆశపడ్డారు. అయితే అదీ జరగలేదు.  యాత్ర సాగుతుండగానే సెప్టెంబరు 9న   371 కోట్ల రూపాయల స్కిల్ స్కాం లో చంద్రబాబు నాయుణ్ని  సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాంతో  లోకేష్ యాత్రను నిలిపివేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చే వరకు యాత్ర చేయనన్నారు. చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైల్లో ఉండి ఆరోగ్య కారణాలు చూపి మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లోకేష్  యాత్రను తిరిగి ప్రారంభించారు.

చంద్రబాబు జైలుకెళ్లి విడుదల అయిన తర్వాత మొదలు పెట్టిన యాత్రకు ప్రజల నుండి బొత్తిగా ఆదరణ లేకపోయింది. దీంతో మిత్ర పక్షమైన జనసేన అభిమానులు కార్యకర్తలను లోకేష్ యాత్రకు తరలించడం మొదలు పెట్టారు. మిగతా జనాలను తరలించడానికి డబ్బులు కూడా పంచి పెట్టారు. అయినా  యాత్ర హిట్ కాలేదు. ఇక ఈ యాత్ర  చేయలేనని ఓ దశలో నారా లోకేష్ చేతులెత్తేసినట్లు  పార్టీ వర్గాల సమాచారం. అయితే అలా మధ్యలో ఆపేస్తే  పరువు పోతుందని భావించిన చంద్రబాబు నాయుడు  ఈ నెల 17 వరకు యాత్ర చేసి భీమిలి చేరుకున్న తర్వాత ముగించేయమని చెప్పారట.

400 రోజులు చేస్తానన్న యాత్ర మూడు వందల రోజులు కాకుండానే ముగించేస్తున్నారు. నాలుగువేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించి చరిత్ర సృష్టిస్తామని ఇపుడు మూడు వేల కిలోమీటర్లకు యాత్రను చుట్టేయడానికి రెడీ అయిపోయారు.  ఇచ్ఛాపురం దాకా చేస్తామన్న యాత్రను భీమిలితో ఆపేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. విశాఖ ను కార్యనిర్వాహక రాజధానిగా  ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని చంద్రబాబు నాయుడి పార్టీ వ్యతిరేకస్తోంది. దాంతో ఉత్తరాంధ్ర ప్రజలు టిడిపి పట్ల ఆగ్రహంతో ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  అందుకే శ్రీకాకుళం దాకా యాత్ర చేస్తే   ఉత్తరాంధ్ర ప్రజలు నిరసనలు తెలిపే అవకాశాలున్నాయన్న  కార‌ణంతోనే  భీమిలి తో యాత్రకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి