అరెస్టుతో చంద్రబాబుకు సానుభూతి – సర్వే రిపోర్ట్

By KTV Telugu On 22 September, 2023
image

చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోతున్నాయా. టీడీపీ అధినేతను జైల్లో పెట్టడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిందేమిటి. చంద్రబాబుకు సింపథీ వచ్చిందా. తాజా సర్వే చెబుతున్నదేమిటి . వైసీపీలో టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు సీ – ఓటర్ పెరిగాయి..

ప్రజల నాడిని తెలుసుకునేందుకు ఎన్నికల సమయంలో మాత్రమే నిర్వహించే సర్వేలు ఇప్పుడు నిత్యం నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన రెండు రోజులకే సీ ఓటర్ సంస్థ ఓ సర్వే చేసింది. అందులో విస్తుపోయే నిజాలు బయట పడటంతో పాటు.. చంద్రబాబుకు పెరుగుతున్న సానుభూతిని సర్వే వెల్లడించింది.

కాస్తో కూస్తో విశ్వసనీయత ఉన్న సంస్థగా సీ ఓటర్ కు పేరుందనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,809 మందిని సీ ఓటర్ సంస్థ సర్వే చేసింది. అందులో బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ సానుభూతిపరులతో పాటు.. ఏ పార్టీకి చెందని ఓటర్లు కూడా ఉన్నారు. సీ ఓటర్ స్నాప్ పోల్ కొన్ని ఆసక్తికరమైన అంశాలనే ఆవిష్కరించింది. చంద్రబాబు అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందా అంటే బీజేపీ సానుభూతిపరుల్లో 26 పాయింట్ 3 శాతం మంది అవునని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సానుభూతిపరుల్లో 36 పాయింట్ 8 శాతం మంది అవునన్నారు. వైసీపీ సానుభూతిపరుల్లో 48 పాయింట్ 1 శాతం మంది అవునన్నారు. అంటే అరెస్టు చట్టబద్ధమేనని వైసీపీ జనంలో సగం మంది కూడా విశ్వసించడం లేదనుకోవాలి. టీడీపీ సానుభూతి పరుల్లో కేవలం 11 పాయింట్ 9 శాతం మంది చట్టప్రకారం అరెస్టు జరిగిందని భావిస్తుండగా, చంద్రబాబును చట్టవ్యతిరేకంగా అరెస్టు చేశారని 88 శాతం మంది టీడీపీ సానుభూతిపరులు లెక్కగట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని 68 పాయింట్ 4 శాతం మంది బీజేపీ సానుభూతి పరులు, 47.6 శాతం మంది కాంగ్రెస్ మద్దతుదారులు, 77 పాయింట్ 6 శాతం మంది టీడీపీ సానుభూతిపరులు నమ్ముతున్నారు. ఇదీ ముమ్మాటికి కక్షసాధింపేనని వైసీపీలోని 31 శాతం మంది నమ్ముతున్నారని సీ ఓటర్ సర్వే నిగ్గుతేల్చడం విశేషం

అరెస్టు వల్ల చంద్రబాబుకు సానుభూతి పెరుగుతుందని 73 పాయింట్ 3 శాతం మంది టీడీపీ అభిమానులు భావిస్తుండగా, అరెస్టుకు – సానుభూతికి సంబంధం లేదని 16 పాయింట్ 2 శాతం మంది తేల్చిచెప్పారు. బాబుకు సానుభూతి వస్తుందని బీజేపీలో 62 పాయింట్ రెండు శాతం మంది, కాంగ్రెస్ లో 41 పాయింట్ రెండు శాతం మంది, వైసీపీలో 38.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డిలో భయం, ఆందోళన, అభద్రతాభావం పెరిగాయని అందుకే చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీలో 86 పాయింట్ 7 శాతం మంది భావిస్తున్నారు. అలా అనుకునే వారిలో 36 పాయింట్ 3 శాతం వైసీపీ వాళ్లు కూడా ఉండటం విశేషంగానే చెప్పుకోవాలి. జగన్ కు అభద్రతాభావం పెరిగిందని బీజేపీ మద్దతుదారుల్లో 66 పాయింట్ 7 శాతం మంది నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఎన్నికలపై ఉంటుందని చంద్రబాబు విజయానికి అది పనికొస్తుందని టీడీపీలో 84 శాతం మంది, బీజేపీలో 61 శాతం మంది చెబుతున్నారు. అరెస్టు జగన్ కు ఉపయోగపడుతుందని వైసీపీలో కేవలం 36 శాతం మంది విశ్వసిస్తున్నారు. టీడీపీ-జనసేన పొత్తు తమ విజయానికి నాంది పలుకుతుందని తెలుగుదేశంలో 87 పాయింట్ 3 శాతం మంది పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ దెబ్బకు వైసీపీ ఓడి పోవడం ఖాయమని ఆ పార్టీలోనే 39 శాతం మంది నమ్ముతున్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీలో పెరిగిన ఐక్యతను సీ ఓటర్ సర్వే తేటతెల్లం చేసిందని అనుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు పట్ల ఏపీ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు కూడా ఇది నిదర్శనంగా నిలుస్తోంది. పైగా జగన్ లో అభద్రతాభావం పెరిగిందని జనం నమ్మడం నిజంగా మార్పు దిశగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయని నమ్మడానికి ఉపయోగపడుతుందనే చెప్పాలి. చంద్రబాబును ఒక విజన్ ఉన్న నాయకుడిగానూ, ఆయన చేసిన అభివృద్ధిని మరిచిపోయి జైల్లో పెట్టారని టీడీపీ వాళ్లు చేస్తున్న ప్రచారానికి సీ ఓటర్ … విశ్వసనీయతను కల్పించిందని చెప్పక తప్పదు