చంద్రబాబు నాయుడి అరెస్ట్ విషయంలో అసలు విలన్ ఎవరనేది త్వరలోనే వెలుగులోకి వస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కువగా టిడిపికి చెందిన వారు సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కుట్రదారు ఎవరో త్వరలోనే బయట పడుతుందని వారు నర్మగర్భంగా అంటున్నారు. టిడిపికి మద్దతు పలికిన కొన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి కుట్ర ఉందని ఆరోపించారు. అదే విధంగా టిడిపికి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ఏపీలో ఏం జరుగుతోందో కేంద్రంలోని బిజెపికి తెలీదా? అని నిలదీస్తూనే మీరే చేయిస్తున్నారు కాబట్టి మౌనంగా ఉన్నారా? అని నిలదీశారు.
చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ముఖ్యమంత్రి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుణ్ని అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపారని టిడిపి నేతలు విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తూ రాజ్యాంగపు విలువలకు తూట్లు పొడిచారని కూడా వారు ఆరోపించారు. తాను కేసుల్లో దొరికిపోయానన్న అక్కసుతోనే జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అవినీతి మరక అంటించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే సమయానికి జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే లేరు. ఆయన ఈ నెల రెండో తేదీన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ వెళ్లారు. అయితే ఒక వ్యూహం ప్రకారమే ఆయన లండన్ వెళ్లి..అక్కడి నుంచే చంద్రబాబును అరెస్ట్ చేసేలా అధికారులను పర్యవేక్షించారని టిడిపి ఆరోపించింది. అయితే చంద్రబాబు నాయుడి అరెస్టుకు వై.ఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీకీ సంబంధమే లేదని పాలక పక్ష నేతలు వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆర్ధిక నేరాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్తే ప్రభుత్వంపై బురద జల్లడం ఏంటని ఏపీ మంత్రులు ధ్వజమెత్తారు.
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత రోజులు గడుస్తోన్న కొద్దీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో అనుమానాలు మారుతున్నాయి. మొదట్లో జగన్ మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తిన టిడిపి నేతలే దీని వెనుక కేంద్రంలోని బిజెపి ఉందని అనుమానాలు వ్యక్తం చేయడం మొదలైంది. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కేంద్రాన్ని ఉద్దేశించి ఏపీలో ఇన్ని అరాచకాలు జరుగుతోంటే మీకు కనపడ్డం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఈ అరాచకాల వెనుక ఉన్నది మీరు కాబట్టే మౌనంగా ఉన్నారా? అని కూడా అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగారు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ ను ఖండిoచిన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా చంద్రబాబు అరెస్ట్ బిజెపి స్కెచ్చే అని ఆరోపించారు. మరి కొందరు విపక్ష నేతలు కూడా కేంద్రంలోని బిజెపియే పకడ్బందీగా కుట్ర అమలు చేసిందని ఆరోపించారు. అయితే చంద్రబాబు నాయుడిపై బిజెపికి అంత పగ ఉండాల్సిన అవసరం ఏముందని కమలనాథులు నిలదీస్తున్నారు. నిజానికి బిజెపి జాతీయ నేతల్లో చాలా మంది చంద్రబాబు నాయుడికి సన్నిహితులే. చంద్రబాబు నాయుడిపై కోపం ఉండాల్సిన అవసరం ఎవరికి ఉందన్న ప్రశ్నలు వస్తున్నాయి
అమిత్ షా కాకపోతే ఇంకెవరు? ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నా చంద్రబాబు పై ప్రతీకారం తీర్చుకున్నారా? అని కొందరు అనుమానిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గతంలో గోధ్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీపై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. 2018 లో ఎన్డీయే నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోదీపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు చంద్రబాబు మోదీని గుజరాత్ పంపేస్తానని శపథం చేశారు. వీటిపైనే మోదీ మనసులోనే కక్ష పెట్టేసుకుని ఉంటారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. ఆ కక్షతోనే ఇపుడు చంద్రబాబును జైలుకు పంపి ఉండచ్చని వారు అంటున్నారు.
Watch this video for Full Story