బ్రాహ్మణికి అంత సీన్ ఉందా!

By KTV Telugu On 21 September, 2023
image

నారా బ్రాహ్మణికి నిజంగా నాయకత్వ లక్షణాలున్నాయా.. తాత నుంచి. తండ్రి నుంచి, మామ నుంచి ఆమెకు సహజంగా నాయకత్వం ప్రాప్తించిందా. ఇప్పుడు టీడీపీ బాధ్యతలు తన చేతిలోకి తీసుకునే స్థాయికి ఆమె ఎదిగారా. లేకపోతే కావాలనే మీడియా ఆమెను ప్రొజెక్టు చేస్తుందా. మహిళ అయితే పార్టీ మనుగడ సాధ్యమన్న విశ్వాసంతో ఆమెను రాజకీయ యవనికపై నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందా…

ఒక స్పీచ్ తోనే నాయకులైపోతారా. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే అటామేటిగ్గా నాయకత్వం వచ్చేస్తుందా.. నిజం చెప్పాలంటే రాజమండ్రిలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియాతో చాలా చక్కగా మాట్లాడారు. దానిని ఎవరూ కాదనలేరు. అంతమాత్రానికే ఆమెకు నాయకత్వ లక్షణం వచ్చిందా అంటే అవునని చెప్పలేం. అమె జనంలో తిరిగింది లేదు, ఎన్నికల్లో పోటీ చేసినదీ లేదు. ఐనా సరే నారా బ్రాహ్మణికి ఒక అడ్వాంటేజ్ ఉంది. నారా, నందమూరి కుటుంబాల నాయకత్వ లక్షణాలే ఆమె బలమని చెప్పుకోవచ్చు…

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలున్నట్లు తెలిసినప్పటికీ వాట్ నెక్ట్స్ అని కథనాలు వండి వార్చే మీడియా ఎక్కువైపోయింది. యువగళం సారథి నారా లోకేష్ క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆయన్ను కూడా అరెస్టు చేస్తుందన్న అనుమానాలు నడుమ.. తెలుగుదేశానికి దిక్కేవరన్న చర్చను కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి వారమ్మాయి.. నారా బ్రాహ్మణి పేరు తెరమీదకు వచ్చింది. అలా అనేకంటే కొందరు ఆమెను ప్రమోట్ చేశారని చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ వెళ్లి టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు కుర్చీలో కూర్చున్న తర్వాతే బ్రాహ్మణి నాయకత్వ చర్చ తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. బాలయ్య ముక్కోపి కావచ్చు, చేయి ఝాడించే తత్వమున్న వ్యక్తి కూడా కావచ్చు. ఐనా పార్టీ లైన్ దాటకుండా, పార్టీ కోసం పని చేసే నాయకుడేనని బాలయ్య గురించి చెప్పుకోవాల్సిందే కదా.. బహుశా యువ నాయకత్వం, అందులోనూ మహిళ అయితే బావుంటుందన్న ఆలోచనతో బాలయ్యను పక్కకు తోసి బ్రాహ్మణి పేరుతో ఈ ప్రచారం మొదలు పట్టి ఉండొచ్చు. కేసుల గొడవల కంటే చాలా ముందే లోకేష్ ఏపీలోనూ, బ్రాహ్మణి తెలంగాణలోనూ రాజకీయాలు చేస్తే బావుంటుందన్న చర్చ జరిగిన మాట వాస్తవమని మరిచిపోకూడదు.

టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీలో చాలా మంది డీలా పడిపోయారు.అధికారం లేకుండా ఉండలేమన్న స్థితికి దిగజారి పోయారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడయితే పార్టీనా..తొక్కనా అని కూడా కామెంట్ చేశారు. ఐనా సరే టీడీపీ కోసం వాళ్లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు తర్వాత నిరాశలో జారుకున్న పార్టీ నేతలు, కేడర్ ను ఉత్తేజ పరిచేందుకు అనుకూల మీడియా ప్రయత్నించాల్సి ఉంది. వారికి ఉత్ప్రేకరంగా పనిచేయాల్సిన అనివార్యత ఉంది. అలాంటిది వదిలేసి తదుపరి నాయకులెవ్వరన్న చర్చతో మొత్తం వ్యవహారం పక్కతోవ పట్టే ప్రమాదం ఉంది. వాళ్లు చెప్పినట్లుగా చూసినా నారా బ్రాహ్మణికి నాయకత్వ లక్షణాలున్నట్లు ఒప్పుకోవాల్సిందే. ఆ మధ్య లద్దాక్ లో మోటార్ రేస్ ద్వారా తాను సాహసం చేయగలనని కూడా ఆమె నిరూపించారు. నిజానికి రాష్ట్ర రాజకీయాలు చూస్తూ పెరిగినందున ఎప్పుడు ఏ స్టెప్ వెయ్యాలో ఆమెకు బాగానే తెలుసని సన్నిహితంగా మెలిగిన వాళ్లు చెబుతున్నారు. అవకాశం వస్తే రాజకీయాల్లో రాణిస్తారని, అందరనీ కలుపుకుపోతూ పార్టీ కేడర్ కు కొత్త ధైర్యం చెప్పగలరని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

రాశి, వాసే కాదు టైమింగ్ కూడా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధినేత కోసం పార్టీ శ్రేణులంతా కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కొత్త నాయకత్వంపై చర్చ అప్రస్తుతమవుతుంది. పార్టీని విడదీసి, విభజించే ప్రయత్నమే అవుతుంది. కొత్త సమస్యలకు బీజం వేసినట్లవుతుంది. రాజకీయాల్లోకి వస్తే బ్రాహ్మణి మంచి నాయకురాలు అవుతారని, పార్టీకి మంచి జరుగుతుందని ఎవరైనా అంగీకరిస్తారు. కాకపోతే దానికి ఇంకా టైమ్ ఉంది. ఇప్పటి నుంచే ఎదురు చూపులు అవసరం లేదని గుర్తించాలి.

 

Watch this Video for Full Story