“అదానీ” ఈ పేరు రెండు రోజులుగా దేశం మొత్తం సంచలనం సృష్టిస్తోంది. దీనికి కారణం ఆయన గాలిమేడల్లా సృష్టించిన కంపెనీల గాలి పోతూండటమే. అదానీ ప్రపంచంలో అత్యంత కుబేరునిగా ఎదగడానికి ఎలా గాలి మేడలు కట్టారో ఆ గాలి మేడల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి ఎలా ప్రజా ధనాన్ని రుణాలుగా తీసుకున్నా హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించింది. నిజానికి ఇదంతా బహిరంగ రహస్యం. ఇండియాలో మార్కెట్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ కంపెనీ షేర్లు గాలి బుడగలేనని ఎప్పుడైనా పేలిపోవచ్చని అనుకుంటూనే ఉన్నారు. కానీ దేనికైనా సమయం రావాలన్నట్లుగా ఇప్పుడు అమెరికా నుంచి వెలువడిన ఓ సంచలన నివేదిక దేశం కళ్లు తెరిపిస్తోంది.
గౌతమ్ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.78 లక్షల కోట్లు)గా ఉంది. మూడేళ్ల క్రితం ఇది 20 బిలియన్ డాలర్లు (రూ.1.62 లక్షల కోట్లు)గా ఉండేది. గత మూడేళ్లలోనే తన గ్రూప్‌నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి షేర్ల విలువను కత్రిమంగా పెంచి ఆదానీ మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేళ్లలోనే అదానీ సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా (రూ. 8.1 లక్షల కోట్లు) పెరిగింది. ఈ ఏడు కంపెనీలు 85 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్‌జోన్‌లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదు. నష్టాలతో ట్రేడ్ అవుతున్న ఆ కంపెనీల వాటాలను తనఖా పెట్టి అదానీ గ్రూప్ భారీగా రుణాలను పొందింది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత మనీలాండరింగ్ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. కార్పొరేట్ ప్రపంచ చరిత్రలో ఇదో అతిపెద్ద కుట్ర.
అదానీ కంపెనీలన్నీ గాలి మేడలని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రకటించిన రిపోర్టు విషయంలో అదానీ సంస్థలు ఎదురుదాడి చేయడంలో విఫలం కావడంతో ఇన్వెస్టర్లలో ఒక్క సారిగా ఆందోళన ప్రారంభమయింది. రీసెర్చి తాము ప్రకటించిన వివరాలు తప్పయితే తమపై న్యాయపోరాటం చేయాలని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సవాల్ చేసింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. దీంతో ఇన్వెస్టర్ల నమ్మకం సన్నగిల్లింది. ఇప్పుడు అదానీ ఆ రిపోర్టు తప్పు అని కోర్టుకెళ్తే అసలు నిజమేంటో చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆధారాలు బయట పెట్టాలి. అవే బయట పెడితే నిజాలెంటో వెలగులోకి వస్తాయి. అప్పుడు హిండెన్ బెర్గ్ ప్రకటించిన దాని కన్నా అదానీ పరిస్థితి ఘోరంగా ఉండొచ్చు. అది మరింత ప్రమాదకరం.
అదానీ కంపెనీల గురించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పిన వివరాలు నిజం కాదని వాదించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. ఇప్పుడు అవి తప్పు అని అమెరికా లేదా ఇండియా కోర్టుల్లో దావా వేస్తే అసలు నిజం ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. అదానీ అంత ధైర్యం చేయడం కష్టం. ఎందుకంటే అదానీ కంపెనీల గురించి అందరికీ తెలుసు. గతంలోనూ టాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి లెక్కా పత్రం లేకుండా వేల కోట్లు తెచ్చినట్లుగా తేలింది. ఆ కేసును సెబీ ఏం చేసిందో ఇంత వరకూ తెలియదు. అదానీ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలితే అంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు. ఇప్పటికే ఎల్ఐసీ సొమ్ము పదహారు వేల కోట్లు హరించుకుపోయిందని చెబుతున్నారు. అదానీ షేర్లను తనఖా పెట్టుకున్న బ్యాంకులు మరింత మునిగిపోతాయి. అదానీ కంపెనీలు నేరుగా చేసే వ్యాపారం పరిమితం వాటి వాస్తవ విలువకు షేర్ విలువకూ పొంతన ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకోపేత దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది.
ప్రస్తుతం అదానీ విషయంల కేంద్రం అత్యంత కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆదానీ పై విచారణ చేయాలని ఇండియాలో డిమండ్లు కూడా పెద్దగా వినిపించడం లేదు. అది అదానీకి ఉన్న పొలిటికల్ పవర్ కావొచ్చు. కానీ ఆ సంస్థ మునిగిపోతే నష్టపోయేది మాత్రం అదానీ మాత్రమే కాదు దేశం కూడా. ఎందుకంటే అదానీ వ్యాపారం చేస్తోంది దేశ ప్రజల సంపదతోనే. ఆ కంపెనీ మునిగిపోతే దేశ ప్రజలు మదుపుదారులు మునిగిపోతారు. అదే జరిగితే అంత కన్నా దేశద్రోహం మరొకటి ఉండదు. మరి కేంద్రం ఎప్పటికైనా మేలుకుంటుందా..