చైనా పాలకుల పాలసీలపై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న అలీబాబా తెగించేసింది. చైనా ఫిన్ టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. యాంట్ గ్రూప్‌ను నియంత్రించే అధికారాన్ని వదులుకోడానికి సిద్దమయ్యారు. ఫిన్‌టెక్ కంపెనీలోని వాటాలను షేర్ హోల్డర్లకు సర్దుబాటు చేయబోతున్నారు. యాంట్ గ్రూప్‌లో జాక్ మా అలీబాబా గ్రూప్‌కు మూడో వంతు వాటా ఉంది. అయితే 2020లో 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి రెండు రోజుల ముందు ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులపై జాక్‌మా విమర్శలు చేశారు.
అలీబాబా తలెగరేయటంతో చైనా ప్రభుత్వ అధికారులు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా అడ్డుకున్నారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ మొదట యాంట్ గ్రూప్ లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత హాంకాంగ్ మార్కెట్ కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి చైనా పాలకులు చెక్ పెట్టినట్లయింది. చైనీస్ బ్యాంకులు పాన్ షాపుల్లాంటివని జాక్ మా చైనా ప్రభుత్వంపై చేసిన విమర్శలతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 2020 అక్టోబర్ చివరి నుంచి ఏడాది చివరిదాకా సుమారు 11 బిలియన్ డాలర్లను నష్టపోయారు అలీబాబా అధినేత. భారత కరెన్సీలో ఇది రూ.80వేల కోట్లకు పైమాటే.
యాంట్ గ్రూప్ అలీబాబా అనుబంధ సంస్థ. జాక్‌మానే యాంట్ గ్రూప్ ఫౌండర్. రెండేళ్ల క్రితం ప్రభుత్వ పెద్దలు, బ్యాంకింగ్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటినుంచీ జాక్‌మాకు చిక్కులు మొదలయ్యాయి. చివరికిది ఆయన స్థాపించిన యాంట్ గ్రూప్‌పై నియంత్రణ కోల్పోవడానికి కారణమయ్యాయి. యాంట్ గ్రూప్ ఓటింగ్ హక్కులను మార్చేస్తూ కంపెనీ వాటాదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంస్థపై జాక్‌మా పట్టు పూర్తిగా పోయినట్లేనంటున్నారు. అయితే ఈ నిర్ణయంతో సంస్థ వాటాదారుల ఆర్థిక ప్రయోజనాలకు ఎలాంటి ముప్పూ ఉండదంటోంది యాంట్ గ్రూప్ యాజమాన్యం.
యాంట్ గ్రూప్ ఓటింగ్ హక్కులు మార్చేయడం ద్వారా జాక్‌మాను మరింత కంట్రోల్ చేయాలన్నదే చైనా సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఓటింగ్ హక్కులు, నియంత్రణ హక్కుల మార్పుతో యాంట్ గ్రూప్ ఐపీవోకి ఇప్పట్లో మోక్షం లేనట్లే. ఎందుకంటే చైనాలో కంపెనీ ఓటింగ్ హక్కులు మారితే మూడేళ్లదాకా స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యే అవకాశం లేదు. హాంకాంగ్‌లో ఏడాదిపాటు ఐపీవోకు వెళ్లడానికి రూల్స్ ఒప్పుకోవు. ఈ పరిణామాలతో యాంట్ గ్రూప్ పూర్తిగా ఇండిపెండెంట్ డైరెక్టర్ల నియంత్రణలోకి వెళ్లనుంది. దీంతో జాక్‌మా ముందే యాంట్ గ్రూప్‌లోని 50 శాతానికి పైగా వాటాను వదులుకునేందుకు సిద్ధపడ్డారు.
అసలే చైనా. తుమ్మినా దగ్గినా అనుమతి తీసుకోవాలన్నట్లుంటాయి అక్కడి విధానాలు. తేడావస్తే శాల్తీనే గల్లంతు చేసే చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే అంత తేలిగ్గా వదిలిపెడతారా. కానీ జాక్‌మా కూడా ఏదయితే అది జరుగుతుందని తెగించేశారు. బ్యాంకింగ్ రూల్స్ ఓల్డ్‌మ్యాన్స్ క్లబ్‌లా ఉన్నాయని దుమ్మెత్తిపోశారు. దీంతో చైనా పాలకులు జాక్‌మాని లక్ష్యం చేసుకున్నారు. యాంట్‌గ్రూప్ ఐపీవోకి ప్రభుత్వం అడ్డుపుల్లలు వేశాక కొన్ని నెలల పాటు జాక్‌మా బయటి ప్రపంచానికి కనిపించలేదు. జాక్ మా దాదాపు 6 నెలలుగా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నారు. కొంతకాలంగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను చాలాసార్లు సందర్శించారు.
జీ జిన్‌పింగ్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టాక చాలా మంది సంపన్నులు చైనా నుంచి పారిపోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. కమ్యూనిస్టు పాలకులు తమపై కక్షసాధింపు చర్యలకు దిగుతారని భయపడుతున్నారు. యాంట్‌గ్రూప్ పరిణామాలను జాక్‌మా ముందే ఊహించి అందుకు సిద్ధపడ్డా చైనా ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు. అలీబాబా ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా చైనా ప్రభుత్వం విడిచిపెట్టదు. మరొకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే సాహసం చేయకూడదన్నదే చైనా పాలకుల టార్గెట్. ఈ పరిస్థితుల్లో అలీబాబా వ్యవస్థాపకుడు పూర్తిగా చైనాని వీడతారా లేదంటే కాళ్లబేరానికొస్తారో కాలమే నిర్ణయించబోతోంది.