హిండెన్‌బర్గ్ దెబ్బకు అతలాకుతలమవుతోన్న అదానీ

By KTV Telugu On 1 February, 2023
image

అనతికాలంలోనే అత్యంత సంపన్నుడిగా మారిన భారతీయ పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచ కుబేరుడైన అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ గ్రాఫ్ ఇప్పుడు క్రమంగా పడిపోతోంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక దెబ్బకు అదానీ గ్రూప్ విలవిల్లాడుతున్నది. భార‌త్‌లోనే అత్యంత కుబేరుడు ప్ర‌పంచ బిలియ‌నీర్ల‌లో ఒకరైన గౌతం అదానీ ఆధ్వ‌ర్యంలోని అదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలు స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్‌ ఆ సంస్థ‌ల రుణ భారంపై గ‌త వారం వెలువ‌రించిన నివేదిక దేశీయ మార్కెట్ల‌ను షేక్ చేస్తోంది. ప్ర‌త్యేకించి విదేశీ స్వ‌దేశీ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌ను బ‌ల‌హీన ప‌రిచింది. ఇన్వెస్ట‌ర్లు అదానీ గ్రూప్ సంస్థ‌ల్లో వాటాల‌ను విక్ర‌యించ‌డంతో మూడు రోజుల్లో 72 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. అంతేకాదు బిలియనీర్ల సూచీలో టాప్‌ 10 నుంచి అదానీ ఔట్‌ అయ్యారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్ల జాబితాలో టాప్‌-10 నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన 11వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి భారీగా పతనం అవ్వడమే అందుకు కారణం.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక ప్రభావంతో మార్కెట్లలో భయం నెలకొంది. దాంతో సంపద ఆవిరైపోతోంది. ప్రస్తుతం అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు 10 శాతం విలువ కోల్పోయింది. దీంతోపాటు అదానీ విల్మర్‌ 5 శాతం అదానీ పవర్‌ లిమిటెడ్‌ 4.9 శాతం పతనం అయ్యాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 0.6 శాతం కుంగింది. నాలుగు ట్రేడింగ్‌ సెషన్లు కలిపి అదానీ టోటల్‌ గ్యాస్ విలువ 45 శాతం ఆవిరైపోయింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ రాకముందు అదానీ మూడో స్థానంలో ఉండేవారు. భారత్‌ నుంచి టాప్‌ 10 చోటు దక్కించుకున్న సంపన్నుడిగా కొన్నాళ్లు కొనసాగారు. అయితే ఆయన వ్యాపారం స్టాక్ మార్కెట్ల‌లో ట్రేడింగ్‌ రుణ భారంపై అమెరికాకు చెందిన హిండెన్‌బ‌ర్గ్ రీసెర్చ్ సంస్థ బ‌య‌ట‌పెట్టిన నివేదిక ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌ను బ‌ల‌హీన ప‌రిచింది. ఈ ఆరోపణలు నిరాధారమని అదానీ 413 పేజీల వివ‌ర‌ణ నివేదిక కూడా ఇన్వెస్ట‌ర్ల‌లో విశ్వాసం నింప‌లేక‌పోయింది. ఈ దెబ్బకు ఆ సంస్థ కీల‌క డాల‌ర్ బాండ్లు కూడా తాజా క‌నిష్ట స్థాయిని తాకాయి.

ఫైనాన్సియ‌ల్ సేవ‌ల‌పై హిండెన్ బ‌ర్గ్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవ‌లు అందిస్తున్న‌ది. వివిధ కార్పొరేట్ సంస్థ‌ల్లో మోసాలు నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌తో అవ‌కాశాల దుర్వినియోగం ర‌హ‌స్య లావాదేవీలు త‌దిత‌ర ఫ్రాడ్‌ల సంగ‌తి క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసి నివేదిక విడుద‌ల చేస్తూ ఉంటుంది. మోసాల‌కు పాల్ప‌డిన కంపెనీలు ల‌క్ష్యంగా చేసుకుంటుంది. షార్ట్ షెల్లింగ్‌తో స‌వాళ్లు విసురుతుంది. ఈ రీసెర్చ్ సంస్థ‌ను నాథ‌న్ అండ‌ర్స‌న్ అనే 38 ఏండ్ల కుర్రాడు న‌డుపుతున్నారు. అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా ప‌ని చేస్తున్న హిండెన్‌బ‌ర్గ్‌ను 2017లో స్థాపించారు. హిండెన్‌బ‌ర్గ్ ఇప్ప‌టి వ‌ర‌కు 16 కంపెనీల లావాదేవీల‌పై ద‌ర్యాప్తు జ‌రిపింది. హిండెన్ బర్గ్ వ్యవస్థాపకుడి నేపథ్యం గురించి తెలిస్తే అంతా అవాక్కవుతారు. క‌నెక్టివిటీ యూనివ‌ర్సిటీలో ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్ కోర్సు పూర్తి చేసిన అండర్సన్ ఇజ్రాయెల్‌లో కొన్నేళ్లపాటు అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికాలోని ఒక డేటా కంపెనీ ఫ్యాక్ట్ సెట్ రీసెర్చ్ సిస్ట‌మ్స్‌లో ప‌ని చేశాడు. ఏ కంపెనీలో ప‌ని చేసినా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాలు నేర్పేవాడు.