సిన్మాకే సిన్మా కష్టాలొస్తే ఎలా ఉంటుందంటే ఆదిపురుష్ ప్రాజెక్టుని చూపాల్సి ఉంటుంది. సిన్మా మొదలుపెట్టిన వేళావిశేషం బాలేదో ఏవో ఒక విఘ్నాలు ఎందుకు ఎదురవుతున్నాయోగానీ డాళింగ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆదిపురుష్ సిన్మా టీజర్ రిలీజైనప్పుడూ వివాదమే. ఇప్పుడు పోస్టర్ రిలీజ్ అయ్యాక కూడా రాద్ధాంతమే. కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కుతున్న ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌ని ఏవో ఒక వివాదాలు నీడలా వెంటాడుతున్నాయి. మొదట్నించీ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇటీవల వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన చిత్ర యూనిట్ ప్రత్యేక పూజల తర్వాత శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ పోస్టర్ విడుదల చేసింది. దానికోసమే కాచుకుని కూర్చున్నట్లు వెంటనే మరో వివాదం మొదలైంది. ఆదిపురుష్ తాజా పోస్టర్లో రాముడికి యజ్ఞోపవీతం సీతకు సింధూరం ఏమయ్యాయంటూ హిందూ సంఘాలు ఫైర్ అయ్యాయి. హిందువుల మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసే అంశాలు ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కుంటోంది ఆదిపురుష్ పోస్టర్ విమర్శలతోనే ఆగలేదు. ఈ సినిమా నటీనటులు దర్శకనిర్మాతలపై ముంబై సకినక పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ 295(ఎ), 298, 500, 34 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సంజయ్ దిననాథ్ తివారి తరఫున ముంబై హైకోర్టు లాయర్లు ఆశిష్ రాజ్ పంకజ్ మిశ్రా ఈ కేసు వేశారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునే ఉద్దేశంతోనే కేసు పెట్టినట్లు వారు చెబుతున్నారు.
ఆదిపురుష్ సినిమాపై మొదటి నుంచి వివాదాల పరంపర కొనసాగుతోంది. పోయిన ఏడాది దసరాకు విడుదలైన టీజర్ మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. విజువల్ వండర్‌గా ఉండేందుకు కోట్లు ఖర్చు పెట్టినా గ్రాఫిక్స్ యానిమేటెడ్ సిన్మాలా ఉన్నాయని విమర్శకులు తేల్చేశారు. సిన్మా టీజర్లో ప్రభాస్ లుక్ మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గ్రాఫిక్స్ మారూస్తూ మూవీ టీం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆదిపురుష్ సినిమాను హీరో ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఏవో ఒక సమస్యలు వచ్చిపడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఆదిపురుష్ విడుదల కావాల్సి ఉంది. అయితే VFX పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో జూన్ 16న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెంచేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా అనుకున్నంత క్రేజ్ రావటం లేదు. రామాయణం ఆధారంగా తీసిన ఈ భారీ సినిమాకి మంచి హైప్ వస్తుందనుకున్నా టీజర్ పోస్టర్‌తోనే అంచనాలు తలకిందులవుతున్నాయి. శ్రీరామనవమికి ముహూర్తంచూసుకుని పోస్టర్ రిలీజ్ చేసినా శ్రీరాముడు కనికరించలేదు. మరోవైపు ఆదిపురుష్ సినిమాని ఓవర్సీస్లో కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లెవరూ ముందుకు రావటంలేదని వార్తలు వస్తున్నాయి. ఔట్పుట్ ఫీడ్‌బ్యాక్‌తో పాటు సిన్మాకి చెబుతున్న రేటుతో డిస్ట్రిబ్యూటర్లు అంత ఆసక్తిగా చూపడంలేదన్నది ఇండస్ట్రీలో ఉన్న టాక్. దీంతో ఈసారి టీజర్ అయినా మరో ప్రమోషన్ అయినా అదిరిపోయేలా ప్లాన్ చేసుకోవాలనుకుంటోంది ఆదిపురుష్ టీమ్. వాళ్లు అదరగొడతారో చూసేవాళ్లు బెదిరిపోతారో ఈసారొచ్చే ఔట్‌పుట్‌ని బట్టే ఉంటుంది.