సినిమాల్లో కట్నం కోసం కోడళ్లను వేధించే అత్తింటివారిని చూసి మనుషులు అంత క్రూరంగా ఉంటారా అనుకుంటారు ప్రేక్షకులు. అదంతా నటన అని సరిపెట్టుకుంటారు. కానీ సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా కొందరు కట్నం కోసం కోడళ్లను చిత్రహింసలు పెట్టేవారున్నారు. అదే కోవలోకి వస్తారు కన్నడ సీనియర్ నటి అభినయ. వరకట్నం వేధింపుల కేసులో ఈమెను కర్ణాటక హైకోర్టు దోషిగా తేల్చింది. అందుకుగాను ఆమెకు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆమె సోదరుడు శ్రీనివాస్‌కు మూడు సంవత్సరాలు, ఆమె తల్లి జయమ్మకు ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
అసలేమైందంటే 1998లో అభినయ సోదరుడు శ్రీనివాస్ కి లక్ష్మీదేవితో వివాహం జరిగింది. ఆ సమయంలో లాంఛనాల రూపంలో రూ. 80 వేల నగదు, 250 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నారు. ఆ తర్వాతి నుంచి లక్ష్మీదేవిపై వేధింపులు మొదలయ్యాయి. అదనంగా మరో లక్ష రూపాయల కట్నం తీసుకురావాలంటూ అభినయ తన ఒదినను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో లక్ష్మీదేవి 2002లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తింట్లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అభినయ అప్పట్లో హీరోయిన్ కావడంతో ఇంటికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు వచ్చేవారని వారి వద్దకు వెళ్లాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చే వారని ఆరోపించారు. అయితే ఆ కేసును బెంగళూరు నగర జిల్లా న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం అభినయ, శ్రీనివాస్, జయమ్మ, చెలువరాజును దోషులుగా నిర్ధారించి జైలు శిక్షలు ఖరారు చేసింది.