కాకిలా కలకాలం బతికేకంటే కోయిలా కొన్నాళ్లున్నా చాలంటారు. కానీ ఆమె కోయిలలాగే సంపూర్ణ జీవితాన్ని గడిపింది. ఆస్పత్రులు వెంటిలేటర్లతో పన్లేకుండా నిద్రలోకి జారుకున్నట్టు ఈ లోకంనుంచి నిష్క్రమించింది. 86 ఏళ్ల వయసులో కన్నుమూసిన అలనాటి కథానాయిక జముననుంచి ఈ తరం నటీమణులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందం ఉంది. నటన ఉంది. అంతకుమించిన ఆత్మాభిమానం జమున సొంతం. పాత్రలకోసం అవకాశాలకోసం తనెప్పుడూ తగ్గిందిలేదు. ఎవరి ముందూ తలవంచింది లేదు.
సత్యభామ అనగానే ముందుకు గుర్తుకొచ్చేది జమునే. సత్యభామలా తనకు కూడా పొగరెక్కువ. పొగరు అనకూడదు అది ఆత్మాభిమానం. ఎవరిదగ్గరా రాజీపడని తత్వం. ఎక్కడో హంపిలో పుట్టినా తెలుగమ్మాయిలాగే పెరిగింది. తెలుగు వెండితెరపై దశాబ్దాలపాటు అలరించింది. తనెవరినీ లెక్కచేయదు. ధిక్కారస్వరం. ఆ ధోరణే ఇద్దరు అగ్రనటుల అహంకారాన్ని కూడా తట్టుకుని నిలబడేలా చేసింది. దశాబ్దాలక్రితం తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మకుటం లేని మహారాజులు. వారి ముందు ఎవరయినా సాగిలపడాల్సిందే. వారు కన్నెర్రచేస్తే ఎంతటివారైనా తెరమరుగైపోవాల్సిందే. అలాంటివారి సరసన నటించిన జమున రాజీలేని ధోరణి ప్రదర్శించి కొన్నేళ్లు వాళ్ల సరసన కనిపించకుండా పోయింది.
భానుమతి తర్వాత అదే టెంపర్‌మెంట్‌తో నిలుచుంది ఒక్క జమునే. తను కాస్త తగ్గి ఉంటే వినయవిధేయతలు ప్రదర్శించి ఉంటే మరిన్ని అవకాశాలు వచ్చుండేవేమో. కానీ అలా చేస్తే తను జమున ఎందుకవుతుంది. తనను తొక్కేయాలనుకున్నా అవకాశాలు రాకుండా అడ్డుపడాలనుకున్నా జమున తెరమరుగు కాలేదు. కొత్త హీరోలు చిన్నవాళ్లతోనూ నటించింది. అలాంటి సిన్మాల్లో తనే హీరో. ఇద్దరు అగ్రహీరోలు లేకుండా దాదాపు 20 సిన్మాలు చేసింది జమున. అందులో 15 హిట్ అయ్యాయంటే అది జమున వల్లే. సిన్మాల్లోనే కాదు రాజకీయంగా ఎన్నో మెట్లు ఎక్కే అవకాశం ఉన్నా రాజీలేని ధోరణితోనే ఆమె ఇమడలేకపోయారు. తుదిశ్వాస దాకా తను తనలా బతికింది. తరచిచూడాలేగానీ తనో రోల్‌మోడల్. అందుకే ఆమెకు హృదయపూర్వక నివాళులు.