బాలకృష్ణపై అక్కినేని మనవళ్లు ఫైర్

By KTV Telugu On 24 January, 2023
image

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నోటి దూల ఎక్కువ. నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తారు. అలవాటు కొద్దీ ఇటీవల ఆయన తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు అనదగిన ఎస్వీరంగారావు, అక్కినేని నాగేశ్వర్‌రావు పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో అక్కినేని అభిమానులు బాలయ్యపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే వీరసింహారెడ్డి సక్సెస్‌ మీట్‌లో బాలయ్య తన సహజ శైలిలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఆ రావుగారు ఈ అక్కినేని..తొక్కినేని అని అన్నారు. అక్కినేనిని తొక్కినేని అన్న బాలయ్యపై అక్కినేని అభిమానులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాలయ్యపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

బాలకృష్ణ తన తాత అక్కినేని నాగేశ్వర్‌రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన మనవళ్లు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్‌ స్పందించారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్ చేశారు. సీనియర్‌ హీరో అయిన బాలకృష్ణకు యువ హీరోలు కౌంటర్‌ ఇవ్వడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాలయ్యకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు.

వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేవ బ్రాహ్మణుల గురువు దేవళ మహర్షి అని వారి నాయకుడు రావణ బ్రహ్మ అని అన్నారు. దీనిపై ఆ వర్గానికి చెందినవాళ్లు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ చరిత్ర తెలియకుండా మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో దేవబ్రాహ్మణులకు బాలయ్య క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు అక్కినేని మీద నోరు జారి ఆయన మనవళ్లతో మాట అనిపించుకున్నారు. అయితే అక్కినేని నాగార్జున మాత్రం బాలయ్య వ్యాఖ్యలపై ఇంతవరకు స్పందించలేదు. దేవ బ్రాహ్మణులకు చెప్పినట్లు అక్కినేని అభిమానులకు కూడా బాలయ్య క్షమాపణలు చెబుతారా లేదా చూడాలి.