కోపమొస్తే చెంపమీద కొడుతుంటాడు. మైకుపట్టుకుంటే ఏదేదో మాట్లాడేస్తుంటాడు. కొట్టినా అదృష్టంగానే భావించే అరివీరభయంకర ఫ్యాన్స్ బాలయ్యసొంతం. అలాగని స్టేజీ ఎక్కి ఎవరినైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సంస్కారం అనిపించుకుంటుందా. ఆయన పెద్దరికానికి అది గౌరవాన్ని ఇస్తుందా. ఎవరేమన్నా అనుకోని బాలయ్య అలాగే మాట్లాడుతుంటాడు. మన చెవులు తుప్పు వదలాల్సిందేగానీ ఆయన స్టయిల్‌మాత్రం మారదు. తను సీనియర్ హీరో. పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదన్నా మాట్లాడేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. తానేం అన్నా చెల్లుతుందనుకుంటే అన్నీ మళ్లీ మన ఒళ్లోకొచ్చి వాలతాయి.
మైకు చూస్తే కొత్త హీరోకి కూడా అంత పూనకం రాదు. కానీ బాలయ్య స్టేజీ ఎక్కితే ఎక్కడ స్టార్ట్ అయి ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికీ అర్ధంకాదు. వీరసింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో అవీఇవీ కలిపికొట్టేస్తూ ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ నోరుజారేశారు బాలయ్య. అక్కినేని కుటుంబాన్ని కించపరిచేలా తొక్కినేని అని అనడం సభ్యతేనా. ఏదో ఫ్లోలో అలా వచ్చేసిందని నాలిక కర్చుకుంటారేమో అక్కడున్నవాళ్లు. ఆయనంతే అదోటైపని నవ్వేసుకున్నారు గానీ మరో సినీ కుటుంబాన్ని కించపరచాల్సిన అవసరం ఏమొచ్చిందని బాలయ్య ప్రశ్నించుకోవాలి. బాలయ్యలా అక్కినేని కుటుంబంలో ఆవేశపరులు ఎవరూలేరుకాబట్టి ఆ స్థాయికి దిగజారకపోవచ్చు.
అదే ఏ మోహన్‌బాబునో కెలుక్కుని ఉంటే కంపు కంపే. అక్కినేని తొక్కినేనితోనే ఆగలేదు బాలయ్య. నీతినిజాయితీగా గర్జించాలంటే తనలా సింహలా పుట్టాలట. తనని తాను సింహం అనుకోవచ్చు, గజరాజు అనుకోవచ్చు. కానీ పక్కవారిని చులకనచేసి మాట్లాడితే ఎలాగయ్యా బాలయ్యా. సిల్వర్‌స్క్రీన్‌మీద తలలు నరుకుతూ రక్తతర్పణంచేస్తున్న బాలయ్యకి మీ గొంతు సూపర్ అని ఎవరు చెప్పారోగానీ తరచూ భయపెట్టేస్తున్నారు. ఓటీటీలో తను చేస్తున్న అన్‌స్టాపబుల్‌కోసం తన గాత్రాన్ని మరోసారి సవరించుకున్నారు బాలయ్య. కొంతమంది అంతే తాము కారణజన్ములం అనుకుంటారు. హింసించడం తమ జన్మహక్కనుకుంటారు. బాలయ్య ఏ విన్యాసాలు చేసినా చచ్చినట్టు జనం భరించాల్సిందే!