మైకు పట్టుకుంటే వీరసింహారెడ్డి శివాలెత్తిపోతాడు. తన సంస్కృత పాండిత్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆయన నోటినుంచి తన్నుకువచ్చే పదకట్టు ప్రవాహంలో కొందరు నిస్సహాయంగా కొట్టుకుపోతుంటారు. అయినా గట్లు తెగిన కాలువలా ఆయన ప్రసంగం ఆగదు. శృతి తప్పినా అపశృతులు దొర్లినా ఆ రాగామృతాన్ని చచ్చినట్టు ఆస్వాదించాల్సిందే. ప్రాణత్యాగాలకు సిద్ధపడే ఆయన ఫ్యాన్స్ భరిస్తారు కానీ అందరూ అంత సాహసం ఎందుకు చేస్తారు. ఆయనేం మాట్లాడినా టేకిట్ గ్రాంట్ అనుకుంటే ప్రతీసారీ కుదరకపోవచ్చు. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వాగిన వాగుడుపై రియాక్షన్ థర్డ్ జనరేషన్నుంచి వచ్చింది.
వీరసింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో మరి ఆ రోజుల్లో అంటూ మొదలుపెట్టి ప్రసంగాన్ని దబిడిదిబిడి చేసేశారు బాలకృష్ణ. నేను తప్పితే ఇండస్ట్రీలో మరో పోటుగాడు లేరనుకున్నారో ఏమో అన్యాపదేశంగా అక్కినేని ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలుచేశారు. అక్కినేని తొక్కినేని అంటూ అసందర్భంగా నోరుజారటంతో బాలయ్యకు భారీగానే కౌంటర్లు పడుతున్నాయి. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున ఈ విషయంలో స్పందించలేదు. కానీ నాగ్ వారసులు బాలయ్య కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. అక్కినేని నాగచైతన్య, అఖిల్ సోషల్‌మీడియాలో బాలయ్య వ్యాఖ్యలను తప్పుపట్టారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేనని నాగార్జున కుమారులు ట్వీట్ చేశారు.
బాలయ్యలా నోరుపారేసుకోకుండా యువహీరోలు సంస్కారవంతంగా స్పందించారు. అక్కినేని అభిమానుల మనసుల్ని బాలయ్య వ్యాఖ్యలు గాయపరిచాయి. బాలకృష్ణ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన సూటిగా అడిగిన ప్రశ్న బాలయ్యకు హృదయమంటూ ఉంటే లోతుగా గుచ్చుకుని ఉండేది. నందమూరి కుటుంబం గురిచి అక్కినేని నాగార్జున ఇలా ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తిని చాటిన మహా నటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం సమంజసం కాదన్నారు సర్వేశ్వరరావు. దేవ బ్రాహ్మణులగురించి ఆ మధ్య అనుచిత వ్యాఖ్యలుచేసి తర్వాత లెంపలేసుకున్నారు బాలయ్య. ఈ వివాదం కూడా ముదరకముందే అక్కినేని కుటుంబానికి, అభిమానులకు క్షమాపణలు చెబితేనే కాస్త హుందాగా ఉంటుంది.