నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చానంటూ సమరసింహారెడ్డి తొడగొడితే ఆడియెన్స్ వన్స్‌మోర్ అన్నారు. ఒంట్లో రక్తం పోతున్నా సింహా సింగిల్‌గా గొడ్డలితో పదులమందిని తెగనరుకుతుంటే ఆవేశంతో ఊగిపోయారు. శూలంతో అఖండ శత్రువులను ఏరేస్తుంటే అదీ మా బాలయ్య రేంజ్ అని మురిసిపోయారు. హిట్ ఫార్ములా దొరికిందని ఎంతసేపూ ఇక అదే మసాలానా? అందుకే వీరసింహారెడ్డి నరుకుడు చూసి ఎప్పుడూ ఊచకోతలేనా అంటున్నారు. కాంతారాలాంటి సిన్మాల తర్వాత కూడా మనం మారడం లేదని ప్రేక్షకులు బాధపడుతున్నారు. రాయలసీమంటే నరరూప రాక్షసులు, రక్తదాహంతో వీరంగం వేసే ఫ్యాక్షనిస్టులన్నట్లు మారిపోతున్నాయి బాలయ్య సిన్మాలు. బాలయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా సీమనుంచే.
తనకు కనిపించని పగలను వెండితెరపై అంత క్రూరంగా చూపించాలా? సీమను నెత్తుటి రుచిమరిగిన క్రూరమృగంలా చిత్రీకరించాలా? వీరసింహారెడ్డి సిన్మాలో సీమవాసుల మనోభావాలు గాయపరిచే దృశ్యాలు చాలా ఉన్నాయి. తలలు పుచ్చకాయల్లా తెగిపడుతుంటాయి. నెత్తురు ఫౌంటెన్‌లా చిమ్ముతుంటుంది. భర్త కళ్లెదుటే భార్యని రేప్‌చేయడంలాంటి దృశ్యాలతో సీమను రాక్షసగడ్డగా చూపించడమే తప్పయితే తగుదునమ్మా అంటూ దానికి U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్‌బోర్డ్‌ని ఇంకేమనాలి. బాలకృష్ణ, వియ్యకుండైన ఆయన బావ ఇద్దరూ సీమ నేతలే. చంద్రబాబు అయితే దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సీమ ఫ్యాక్షన్ ఎన్ని తలలు నరికిందో ఎన్ని రక్తపుటేరులు పారించిందో వాళ్లే చెప్పాలి. కొన్ని హత్యలు, ప్రతీకార హత్యలు జరిగుండొచ్చు, జరుగుతుండొచ్చు. అంతమాత్రాన సీమని ఇంత భీకరంగా చూపించాల్సిన అవసరం ఉందా? సీమంటేనే ఫ్యాక్షన్ అనీ, అనాగరికుల్లా వ్యవహరిస్తారని, పోలీసులు ఏమీ చేయలేరని ఊరిపెద్ద ఊచకోత కోస్తుంటాడని రాతియుగం నాటి భావాలతో కల్పిత కథలు రాసుకోవడం, బాలయ్య బీభత్స నటనతో అది తెరకెక్కడం ఇంకా ఎన్నేళ్లిలా బాలయ్యంటేనే బీభత్సరసం అని ప్రొడ్యూసర్లూ డైరెక్టర్లు అనుకోవచ్చు. కానీ ఎప్పుడూ సీమ రక్తపాతమేనా అన్న ఆలోచన బాలయ్యకెందుకు రాదు బాలయ్యా..నువ్విక మారాలయ్యా!