పుష్ప సినిమాలో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు తెచ్చుకున్నారు. అయితే దేశం మొత్తం సంతోషపడింది కానీ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే పుష్పలో అల్లు అర్జున్ నటన ఆ స్థాయిలో జన బాహుళ్యంలోకి వెళ్లిపోయింది. తగ్గేదే లే డైలాగ్ చెప్పిన విధానం… కాలు కాస్త కుంటుకుంటూ వేసిన స్టెప్ దేశవ్యాప్తంగా ఎంత మంది అనుకరించారో అంచనా వేయడం కష్టం. అలాంటి నటకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం తప్పనిసరి అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ ట్రాన్స్ ఫర్మేషన్ చూసిన వారికి మాత్రం ఆయన జర్నీ అద్భుతమే. తొలి సినిమా చూసినప్పుడు… డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమాలు తీస్తున్నారని… సెటైర్లు వేసిన వారు ఇప్పుడు అభినందిస్తున్నారు. అంత మార్పు సాధించారు కాబట్టే అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అయ్యారు.
మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది సమయంలోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. వైవిధ్యమైన కథలు, వరుస హిట్స్‌తో సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల జాబితాలోకి వెళ్లిపోయాడు. తన స్టైల్, సూపర్ డూపర్ డ్యాన్స్‌లతో యూత్ ఐకాన్‌గా ఎదిగాడు. ఇలా ఎదగడం వెనుక ఉన్న కష్టం … భరించిన అర్జున్ కు మాత్రమే తెలుసు.
2003లో అంటే.. ఇరవై ఏళ్ల క్రితం గంగోత్రి సినిమా విడుదల అయింది. అల్లు రామలింగయ్య మనవడు, డబ్బులున్న నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా మ్యూజికల్ గా హిట్ అయింది. కానీ అందులో హీరోగా చేసిన అల్లు అర్జున్ ను చాలా మంది ఎగతాలి చేశారు. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కానీ… పడాల్సిన అవమానాలన్నీ పడ్డారు. గంగోత్రి సినిమాలో కాసేపు ట్రాన్స్ జెండర్ గా చేసే కామెడీ బాగా సూటయిందని … విమర్శలు గుప్పించేవారు. నటన కూడా సరిగ్గా రాదని విశ్లేషణలు చేశారు. నిజానికి ఆ సినిమాలో అర్జున్ నటన తేలిపోయింది కూడా. రాఘవేంంద్రరావు వంటి దర్శకుడు లాంచ్ చేసిన సినిమా హిట్ అయింది కానీ.. అర్జున్ కు మాత్రం మైనస్ మార్కులే పడ్డాయి.
తనపై వచ్చిన విమర్శలతో అర్జున్ కుంగిపోలేదు. అలా కుంగిపోయి ఉంటే ఈనాడు జాతీయ ఉత్తమ నటుడు మన తెలుగు నుంచి ఆవిర్భవించి ఉండేవారు కాదేమో. తన నటననే కాదు.. తన బాడీని.. బాడీ లాంగ్వేజ్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ… ఇది కదా యాక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ అంటే అని అనిపించుకునేలా ముందడుగు వేశారు. రెండో సినిమా ఆర్యతో తనపై విమర్శలు చేసిన చాలా మందికి సమాధానం చెప్పారు. అప్పట్నుంచి తిరిగి చూసుకోలేదు అల్లు అర్జున్.
అర్జున్ కెరీర్ ని నిర్మించుకున్న విధానం చూస్తే… ఎవరికైనా అబ్బురం అనిపిస్తుంది. ఓ వైపు నటనలో మెరుగుపడుతూనే భిన్నమైన క్యారెక్టర్లు ఎంపిక చేసుకున్నారు. కేవలం మాస్ మసాలా సినిమాలకే పరిమితం కావాలని అనుకోలేదు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. పరుగు సినిమా అప్పటి వరకూ చేసిన సినిమాలకు భిన్నం. కాని సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు . దాంతో అర్జున్ నటనలో వంక పెట్టాల్సిన స్థాయికి చేరుకున్నారని సినీ విమర్శలకూ అర్థం అయింది. ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా.. తాను హీరో ను కాకపోయినా… దొంగ లాంటి క్యారెక్టర్ అయినా వేదం సినిమాలో కేబుల్ రాజు పాత్రను ఒప్పుకుని… తాను స్టార్ కన్నా ముందు నటుడిని అని నిరూపించుకున్నారు.నటుడి విజయం…. ముఖ్యంగా హీరోల విజయం ఆయన నటన మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఆయన సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయితే అందరూ గుర్తుంచుకుంటారు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటారు. అందుకే ఆయన సాధించిన విజయాలే నిదర్శనం.
మొదటి సినిమా గంగోత్రి సొంత బ్యానర్ లో తీసినా… రెండో సినిమా మాత్రం దిల్ రాజు తీశారు. రెండో సినిమాకే చక్కని మార్పుతో కమర్షియల్ హీరోగా ఎదిగారు. నాలుగు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా ముఫ్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదే సమయంలో ఆ సినిమాలో బన్నీ నటనకు యువత ఫిదా అయింది. ఆయన ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఒక్క సారిగా స్టార్ యువ హీరోల జాబితాలోకి చేరిపోయారు. దేశ ముదురుతో టాప్ లీగ్‌లోకి వచ్చేశారు.
ఆ తర్వాత కొన్ని సినిమాలు కమర్షియల్ గా ఫెయిలయినప్పటికీ… అవేమీ బన్నీ కెరీర్ కు రిమార్కులు తెచ్చి పెట్టలేదు. ఓ అడుగు ముందుకు వేస్తూనే వెళ్లారు. దర్శకుడు త్రివిక్రమ్ తో వేవ్ లెంగ్త్ కలిసిన తర్వాత ఆయన కెరీర్ మరో రేంజ్ కు వెళ్లింది. క్లాస్ సినిమాలను తీయడంలో తనదైన ముద్ర వేసుకున్న త్రివిక్రమ్ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం సినిమాలో బన్నీలో సెటిల్డ్ యాక్టర్ ను బయటకు తీసి భారీ కమర్షియల్ విజయాలను సంపాదించుకున్నారు. ఇక బ న్నీ కేరీర్ లో పుష్ప దర్శకుడు సుకుమార్ దీ ప్రత్యేక ముద్ర. ఆర్య సినిమాతో ఓ ఇమేజ్ తెప్పించడమే కాకుండా.. పుష్పతో. జాతీయ ఉత్తమ నటుడిగా కూడా అవార్డు వచ్చే సినిమా చేశారు. ఇప్పుడు పుష్ప టు సినిమా చేస్తారు.
మొత్తంగా రెండు దశాబ్దాల కాలంలో నటనేమీ రాదనే స్థాయి నుంచి.. జాతీయ ఉత్తమ నటుడిగా ఎదగడం అనేది చిన్న విషయం కాదు. దాని వెనుక ఉన్న శ్రమను మాటల్లో చెప్పలేం . అలాగని శ్రమ పడిన వారందరికీ ఈ స్థాయి వస్తుందని చెప్పలేం… శ్రమతో పాటు టాలెంట్… కెరీర్ ను తీర్చిదిద్దుకునే తెలివి తేటలు కూడా ఉండాలి. అవన్నీ అల్లు అర్జున్ కు ఉన్నాయి కాబట్టే.. మనం నేడు ఆయన ఆయనను జాతీ ఉత్తమ నటుడిగా గుర్తించడమే కాదు ప్రశంసిస్తున్నాం.
సినిమా రంగంలో బన్నీది ప్రత్యేకశైలి. ఆయన అల్లు రామలింగ య్య వారసుడు. అయితే వారి కుటుంబంలో మెగాస్టార్ కూడా భాగం. అందుకే మెగా హీరోగానే చూస్తారు. కానీ అది మొదటి కొన్ని సినిమాలకు మాత్రమే . ఇప్పుడు అర్జున్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అర్జున్ మాత్రం ఎప్పుడూ తన మూలాల్ని మర్చిపోరు. తాను ఎప్పటికీ మెగాస్టార్ వీరాభిమానినేనని చెబుతూంటారు.
బన్నీగా ఇంట్లో వారితోనే కాదు ప్రేక్షకులతోనూ ముద్దుగా పిలిపించుకునే హీరో అల్లు అర్జున్ .. ఇంత వరకూ ఏ దిగ్గజ నటుడు సాధించలేని జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సాధించారు . దీనర్థం వారందరి కన్నా అర్జునే గొప్ప నటుడు అని కాకపోవచ్చు. కానీ నిస్సంందేహంగా మంచి నటుడు. ప్రజల్ని ఎంటర్ టైన్ చేయగల నటుడు. ఇప్పుడున్న వారిలో ఉత్తమ నటుడు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…