నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న కీరవాణి

By KTV Telugu On 12 January, 2023
image

మన తెలుగువారి ప్రతిభకు గోల్డెన్ గ్లోబ్ ఫిదా అయిపోయి మొదటి చూపులోనే వరించేసింది. వెస్టర్న్ పాప్ సింగర్స్ ను వెనక్కి నెట్టి మన కీరవాణి బాణీ కట్టిన నాటు నాటు పాటకు అంతర్జాతీయ సమాజం జై కొట్టింది. ఇదే దూకుడుతో వచ్చే మార్చిలో ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకునే దిశంగా ట్రిపుల్ ఆర్ వెలిగిపోతోంది. ఇది ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ విజయం. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలు సత్తా చాటడం ఇదే మొదటి సారి కాదు.1962లోనే అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మొట్ట మొదటి భారతీయ కళాకారుడిగా మన ఎస్వీ రంగారావు జెండా ఎగరేశారు. ఆ తర్వాత మరి కొందరు అద్భుత విజయాలతో అదరగొట్టారు. మును ముందు మరిన్ని విజయాలు ఖాయమని విమర్శకులు అంటున్నారు.

ప్రపంచంలో ఆస్కార్ అవార్డు తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డు.
అటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు మన తెలుగు సినిమా ఎంపిపై అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడి పవర్ ఏంటో చాటి చెప్పింది. కొన్ని నెలలుగా ప్రపంచ మంతా ఒక పాటకు ఫిదా అయిపోయింది.
వివిధ రంగాల్లో ప్రముఖులు ఆ పాట విని డ్యాన్సులు చేసేశారు. పూనకం వచ్చినట్లు స్టెప్పులేశారు.
కోట్లాది మందిలో అంతటి ఉత్సాహాన్ని నింపిన ఆ పాట మన తెలుగు వారి సృష్టి కావడం మనందరికీ గర్వకారణం. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఏ దేశమేగినా ట్రిపుల్ ఆర్ గొప్పతనంగురించే చెప్పుకుంటున్నారు. ఆ సినిమాలోని నాటు నాటు పాటనే ఇపుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించింది.
ఆస్కార్ కు నామినీ అయిన ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపిక అయ్యింది. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ అవార్డును అందుకుని మురిసిపోయారు. ఇదేమీ ఆషామాషీ కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రిహన్న, లేడీగాగా, టేలర్ స్విఫ్ట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవటం విశేషం. అవార్డు ఫంక్షన్ కు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు నటులు ఎన్టీయార్, రామ్ చరణ్ లు భార్యా సమేతంగా కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు వెలుగు కీరవాణి అవార్డును అందుకోగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు.
ట్రిపుల్ ఆరే కాదు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. అవార్డుకు ఎంపిక కాకపోయినా బాహు బలి సినిమాని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్నాయి. హాలీవుడ్ ప్రముఖులైతే బాహుబలి ఓ వండర్ అని కొనియాడారు.

ఇపుడు ప్రపంచ మంతా ట్రిపుల్ ఆర్ గురించే మాట్లాడుతోంది. ప్రత్యేకించి నాటు నాటు పాట గురించే చర్చించుకుంటోంది. అందులో ఎన్టీయార్-రామ్ చరణ్ ల నాటు స్టెప్పుల గురించే మాట్లాడుకుంటోంది. కొన్నేళ్లుగా మన తెలుగు సినిమా ఆకాశమే హద్దుగా సత్తా చాటుతూ వస్తోంది. ఇది తెలుగు సినిమా విజయం అనే కన్నా భారతీయ సినిమా వైభవం అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య దక్షిణాది సినిమాలన్నీ కూడా సరిహద్దులను చెరిపేసి ప్యాన్ ఇండియా సినిమాలుగా అవతరించి కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాయి.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలోనూ ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న వారే ఆస్కార్ అవార్డును గెలుచుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇపుడు కీరవాణి అవార్డుతో మురిసారు. దీనికి ముందు 2009లో మరో భారతీయుడు గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డులతో మెరిశారు. అప్పట్లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు రెండూ దక్కాయి. ఆ సినిమాకి సంగీతాన్ని అందించింది తమిళ నాడుకు చెందిన సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్.
ఈ అవార్డులు ఏం చెబుతున్నాయి? మన సినిమా అల్లాటప్పా సినిమా ఏమీ కాదని చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీనివ్వడమే కాక అవార్డులను సొంతం చేసుకోగల ప్రతిభ మనోళ్ల సొంతం అని చాటి చెబుతున్నాయి. ఏ.ఆర్.రెహ్మాన్ కు ముందు 1992లో బెంగాలీ దిగ్గజ దర్శకుడు భారత రత్న సత్యజిత్ రే ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన అతి కొద్ది మందిలో అగ్రగణ్యుడు సత్యజిత్ రే.
ఆయన సినిమాలన్నీ కూడా సహజత్వంతో మట్టి పరిమళంతో తీసిన దృశ్య కావ్యాలే.

పథేర్ పాంచాలి, అపూర్ సంసార్, అపరాజితో, దేవి, శతరంజ్ కే ఖిలాడీ వంటి ఎన్నో కళాత్మక సినిమాలు ఆవిష్కరించిన సత్యజిత్ రేకు 1992లో ఆస్కార్ అవార్డు వచ్చింది. అయితే ఆ అవార్డు తీసుకోడానికి ఆయన దేశం విడిచి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే అపుడు ఆయన ఆసుపత్రిలో అస్వస్థతతో ఉన్నారు. ఆసుపత్రికే అవార్డు పంపారు. అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సత్యజిత్ రే అమెరికా సినిమానుంచే తాను చాలా నేర్చుకున్నానని వినయంగా చెప్పారు. ఈ అవార్డే కాదు సత్య జిత్ రే తన కెరీర్ లో లెక్కకు మించి అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. హలీవుడ్ ప్రముఖులకు భారత దేశం అనగానే సత్యజిత్ రే పేరే గుర్తుకొచ్చేది. నలభై వరకు జాతీయ అవార్డులూ అందుకున్న రే అరుదైన మేథావి. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లే కాదు ఎడిటింగ్, మ్యూజిక్ డైరెక్షన్ వంటి ఇతర క్రాఫ్ట్స్ లోనూ రే ది ప్రత్యేక బాణీ.
మన కన్న ఎంతో చిన్న చిన్న దేశాలు తరచుగా ఆస్కార్ అవార్డులు ఎగరేసుకుపోతూ ఉంటే ఇండియన్ సినిమా పాతాళంలోనే ఉందన్న విమర్శలు లేకపోలేదు. కాకపోతే మన సినిమా మరీ అంత అధ్వాన్నంగా ఏమీ లేదని అప్పుడప్పుడు మనోళ్లు చాటుకుంటూనే ఉన్నారు. అసలు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డు అందుకున్న తొలి భారతీయ నటుడు మన తెలుగువాడే అన్న సంగతి చాలా మందికి తెలీకపోవచ్చు. 1962లో మన తెలుగోడు ఎస్వీ రంగారావు ఆ ఘనత సాధించారు.
జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్ లో 1962లో మన దేశం నుండి నామినీ దక్కించుకున్న ఏకైక సినిమా నర్తన శాల.
ఎన్టీయార్, ఎస్వీయార్,సావిత్రి వంటి దిగ్గజాలు నటించిన ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ఎంపిక చేసిన వెంటనే ఎన్టీయార్ కే ఆ అవార్డు దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఇందులో కీచకుడి పాత్ర పోషించిన ఎస్వీరంగారావును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో కీచకుడు అద్దం ముందు నిలబడి స్వగతంలో మాట్లాడుకునే సీన్ లో ఎస్వీయార్ నటకు విమర్శకులు ప్రశంసలు అందాయి.

1962 తర్వాత ఇంచుమించు 30 ఏళ్లకి సత్యజిత్ రే అత్యుత్తమ అవార్డు అందుకున్నారు. ఎక్కడో ఇండోనేషియాలో ఉన్న వాళ్లు ఎస్వీయార్ ను గుర్తించారు కానీ మనోళ్లు మాత్రం ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం గుర్తింపు ఇవ్వలేదన్ని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఎస్వీయార్ కూడా అసంతృప్తితో ఉండేవారని అంటారు. అంతకు పదేళ్ల ముందే బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన మల్లీశ్వరి, కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవి కూడా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని సత్తాచాటాయి. ట్రిపుల్ ఆరే కాదు తాజాగా పెను సంచలనం సృష్టించిన కాంతారా సినిమా కూడా ఆస్కార్ రేసులో ఉంది. ఇప్పటికే కలెక్షన్లలో కాంతారా దేశ వ్యాప్తంగా దుమ్మురేపిన సంగతి తెలిసిందే.
వీటితో పాటు మరో పది సినిమాలు అత్యుత్తమ అవార్డు రేసులో ఉన్నాయి. తమిళలో వచ్చిన రాకెట్రీ సినిమా కూడా అవార్డు దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లతో పాటు వివాదాలను పోగు చేసుకుంది. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరాఠీ సినిమా మీ వసంతరావ్ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇది కూడా రేసులో ఉంది. గుజరాతీ సినిమా చెల్లో షో విమర్శకుల ప్రశంసలు పొంది ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇపుడు ఆస్కార్ బరిలో సత్తా చాటుకోడానికి వెళ్లింది.
తమిళ సినీ పరిశ్రమనుంచే వచ్చిన ఇరివన్ నిళల్ కూడా ఆస్కార్ ధీమాతో ఉంది. భారతీయ సినిమాలు రాశిలో కొండంత ఉన్నా వాసిలో గుప్పెడంత కూడా లేవని విమర్శులు అంటూ ఉంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే కొన్నేళ్లుగా మన సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోతోందన్నది కూడా నిజమే. మును ముందు భారతీయ సినిమా హాలీవుడ్ ను ఆశ్చర్య పరిచే రీతిలో అద్భుతాలు సాధించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. కొత్త దర్శకులు కొత్త టాలెంట్ రావడంతోనే మన సినిమా దశ దిశ మారిపోయాయని వారంటున్నారు. సో మనోళ్లు సూపరే మరి.