మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల సవాల్‌

By KTV Telugu On 24 March, 2023
image

శకునం చెప్పే బల్లి కుడితిలోపడ్డట్లుంది. పంచాయతీలు చేసే పెదరాయుడే రచ్చబండ ముందు చేతులు కట్టుకున్నట్లుంది. ఇండస్ట్రీలో అరిస్తే కరుస్తాననే మోహన్‌బాబు ఇంట్లో వారసులిద్దరూ రోడ్డునపడ్డారు. మంచు కుటుంబ పరువుని నడిరోడ్డుమీద కరిగించేస్తున్నారు. ఇద్దరు బ్రదర్స్ మధ్యా ఎప్పట్నించో వివాదాలున్నాయి. ఈమధ్య మంచు మనోజ్‌ రెండో పెళ్లి లోనూ అన్న విష్ణు ముభావంగానే ఉన్నాడు. తప్పదన్నట్లు వచ్చి నలుగురితో పాటు నిలుచున్నాడు. ఇప్పుడు ఇద్దరి మధ్యా గొడవ సోషల్‌మీడియాకి ఎక్కేదాకా రావటంతో మోహన్‌బాబు తలకొట్టేసినట్లయింది. ఎక్కడ తేడావచ్చిందో ఎందుకొచ్చిందోగానీ రాత్రి 10తర్వాత ఓ ఇంటికెళ్లి సారధి అనే వ్యక్తిపై దాడిచేశాడు మోహన్‌బాబు పెద్దకొడుకు విష్ణు. అతను మనోజ్‌కి సన్నిహితుడు దీంతో తన మనిషిపై విష్ణుదాడిచేయడానికి వచ్చాడంటూ ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు మంచు మనోజ్‌ దీంతో మంచు కుటుంబ పంచాయితీ క్షణాల్లోనే వైరల్‌ అయిపోయింది. ఆ సారధి మొదట్లో విష్ణుకు దగ్గరగా ఉండేవాడు తర్వాత మోహన్‌బాబుకు సన్నిహితుడయ్యాడు ఇప్పుడేమో మనోజ్‌ వెంట ఉంటున్నాడు. ఇంట్లో అందరితో పరిచయమున్న వ్యక్తి ఇంటిమీదికి విష్ణు ఎందుకు వెళ్లాడన్నదే ప్రశ్న.

సారధిపై దాడి గురించి తెలియగానే మంచు మనోజ్‌ మంచు లక్ష్మి ఇద్దరూ పరుగున అక్కడికి వెళ్లారు. అప్పటికే గాయాలతో సారధి ఆసుపత్రిలో చేరాడు. మ్యాటర్‌ రచ్చరచ్చయిపోవటంతో మోహన్‌బాబు తలపట్టుకున్నారు. ఇద్దరు కొడుకులకూ క్లాస్‌పీకారు. ఆవేశం అనర్ధదాయకమని హితవు చెబుతూనే అన్నదమ్ములన్నాక చిన్నాచితకా గొడవలు సహజమని కవర్‌ చేశారు. తండ్రి పరువుపోయేలా ఉండటంతో ఫేస్‌బుక్‌నుంచి మనోజ్‌ పోస్ట్‌ తీసేశాడు. అటు విష్ణు కూడా ఇది చాలా చిన్న విషయమంటూ వివాదాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు. 20ఏళ్లుగా మంచు కుటుంబంతో ఉన్న అనుబంధం చుట్టే అన్నదమ్ముల గొడవ తిరగడమే అందరికీ ఆసక్తి కలిగిస్తోంది.